నిర్మాణ పనులన్నీ గోప్యం..!

రాజధాని నిర్మాణంలో ప్రభుత్వ వ్యాపార ధోరణులు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. సింగపూర్‌లో సిఎం బృందం ఇటీవలి పర్యటనలో పట్టణాభివృద్ధిశాఖ అధికారులు లేరు. తెలుగుదేశం పార్టీకి చెందిన ఓ కేంద్రమంత్రి, ఇద్దరు రాష్ట్ర మంత్రులకు లబ్ధి చేకూర్చే ఉద్దేశంతోనే సిఆర్‌డిఎ పరిధిని పెంచారనే వార్తలూ వస్తున్నాయి. రెవెన్యూ శాఖను పక్కన పెడుతునట్టు, మున్సిపల్‌శాఖలో అధికారులను ఒక్కొక్కరిని మార్పు చేస్తున్నట్టు పరిస్థితులు వెల్లడిస్తున్నాయి. రాజధాని నిర్మాణాలకు సంబంధించిన ఒప్పందాల్లోనూ సంబంధిత అధికారులకు సమాచారం ఉండటం లేదు. ఇటీవలి సింగపూర్‌ పర్యటనలో పట్టణాభివృద్దిశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ కరికాల వలవన్‌కు స్థానం కల్పించలేదు. రాజధాని ప్రణాళికపై సింగపూర్‌లో పర్యటిస్తున్నట్లు పేర్కొన్నా, ఆ శాఖ ముఖ్య అధికారే పర్యటన బృందంలో లేకపోవడం చర్చనీయాంశమైంది. రాజధానికి సంబంధించి చేసుకుంటున్న ఒప్పందాల్లోని వివరాలేమీ బయటకు రానీయడం లేదు. రాజధాని విషయంలో ఇంతవరకు ఆరు ఒప్పందాలు చేసుకున్నా వాటిలోని అంశాలేమిటనేది గోప్యంగా ఉంచుతున్నారు.