నిరుద్యోగం తొలగింపునకు నిర్దిష్ట చర్యలు..

ఉద్యోగిత పెరిగేందుకు నిర్దిష్టమైన చర్యలు తీసుకొని నిరుద్యోగ సమస్యను నియంత్రించాలి. మన దేశంలో ప్రతి సంవత్సరం 1.2 కోట్ల మంది ఉద్యోగం కోసం కొత్తగా మార్కెట్‌లోకి వస్తారు. కాబట్టి యువతీయువకులకు ఉద్యోగాలు, పని కల్పించడం ఒక ప్రధాన సమస్య. కోటీ నాలుగు వేల మందికి ఉద్యోగాలు కావాల్సి ఉండగా లేబర్‌ బ్యూరో (సిమ్లాలో ఉంది) లెక్కల ప్రకారం దుస్తులు, తోళ్ళు, లోహాలు, ఆటోమోబైల్సు, వజ్రాలు, నగలు, రవాణా, ఐటి/బిపిఒ, చేనేత, మర మగ్గాలు- ఈ ఎనిమిది రంగాలలో 2013లో 4.19 లక్షల ఉద్యోగాలే కొత్తగా వచ్చాయి. మన్మోహన్‌ సింగ్‌ ఉద్యోగాలు కల్పించలేదని, తమను గెలిపిస్తే అందరికీ ఉద్యోగాలు కల్పిస్తామని ఎన్నికల ప్రచారంలో మోడీ హామీ ఇచ్చారు. ప్రధానమంత్రి అయిన తరువాత కోట్లాది మందికి ఉద్యోగాలు కల్పిస్తామని ''మేక్‌ ఇన్‌ ఇండియా'' విధానాన్ని ప్రకటించారు. ఇందుకోసం మోడీ అనేక దేశాలు తిరిగి అక్కడి పెట్టుబడిదారులను ఆహ్వానించారు. వారికి అనేక రాయితీలు ప్రకటించారు. రైతుల ఆమోదంతో నిమిత్తం లేకుండానే వారి నుంచి భూములు స్వాధీనం చేసుకుని స్వదేశీ విదేశీ కార్పొరేట్స్‌కు కట్టబెట్టేందుకు వీలుగా భూ సేకరణ ఆర్డినెన్స్‌ను జారీ చేశారు. అయినప్పటికీ పరిశ్రమలలో పెట్టుబడులు పెద్దగా రాలేదు. 2014లో మోడీ హయాంలో 4 లక్షల ఉద్యోగాలే వచ్చాయి. ఇది మన్మోహన్‌ హయాంలో వచ్చిన 4.19 లక్షలకన్నా తక్కువ.
విదేశాలలో ఆర్థిక మాంద్యం వల్ల కొనుగోలు శక్తి పెరగక మార్కెట్లు స్తబ్ధంగా ఉండి మన ఎగుమతులు పడిపోయాయి. ఈ వాస్తవాన్ని 2015 జులై 22న రాజ్యసభలో ఒక ప్రశ్నకు ఇచ్చిన జవాబులో వాణిజ్య మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలియజేశారు. మన దేశంలో కూడా ప్రజల కొనుగోలు శక్తి స్తబ్ధంగా ఉన్న కారణంగా మార్కెట్‌ మాంద్యంలో ఉన్నది. ఆర్థిక మంత్రి పార్లమెంటులో జులై 21న వెల్లడించిన వివరాల ప్రకారం 2015 మార్చి ముగింపు నాటికి దేశంలో 45,603 కంపెనీలలో కార్యకలాపాలు మూతబడగా 2015 జులై 16 నాటికి ఈ సంఖ్య ఏకంగా 61,449కి చేరింది. తాజా గణాంకాల ప్రకారం దేశంలో 1.40 లక్షల కంపెనీలు పతనం అంచున ఉన్నాయి. కాబట్టి మార్కెట్‌ ఎక్కడా లేని పరిస్థితులలో వచ్చే విదేశీ పెట్టుబడులు కేవలం స్పెక్యులేషన్‌, రియల్‌ ఎస్టేట్‌, షేర్‌ మార్కెట్‌, భూముల అక్రమణ, గనులు చౌకగా కొనటం, ప్రకృతి వనరులను చౌకగా కాజేయటం, తదితర అనుత్పాదక కార్యక్రమాల కోసమే వస్తున్నాయి. విదేశీ, స్వదేశీ కార్పొరేట్ల వల్ల జరిగే ''అభివృద్ధి'' వారి లాభాలు పెంచటానికే గానీ ఉద్యోగితను పెంచటానికి కాదని ప్రభుత్వం ప్రకటించిన గణాంకాలు రుజువు చేస్తున్నాయి.
ఉద్యోగితను పెంచాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. కానీ సంఘటిత రంగంలో ఉద్యోగాలు తగ్గుతున్నాయి. 1998లో సంఘటిత రంగంలో 2.82 కోట్ల ఉద్యోగాలు ఉండగా 2.75 కోట్లకు తగ్గింది. కార్మికులలో 1999-2000 నాటికి 20 శాతం కాంట్రాక్టు కార్మికులుండగా 2008-09 నాటికి 32 శాతం, ఇప్పుడు 50 శాతం అయింది. మన దేశంలో సంఘటిత రంగంలో అతిపెద్ద యజమాని ప్రభుత్వమే. కానీ ప్రభుత్వమే రిక్రూట్‌మెంట్లపై నిషేధం విధించింది. పోస్టులను రద్దు చేస్తున్నది. పనులను అవుట్‌సోర్సింగ్‌కు ఇస్తున్నది. వివిధ కేంద్ర ప్రభుత్వ శాఖలలో 10 లక్షలకు పైగా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. పోలీసు, రక్షణ దళాలలోనే 7 లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. రైల్వేలో ఉద్యోగుల సంఖ్య గత 10 సంవత్సరాలలో 16 లక్షల నుంచి 13 లక్షలకు తగ్గింది. వివిధ ప్రభుత్వ రంగ సంస్థలు, బ్యాంకుల్లో కూడా ఇదే పరిస్థితి ఉంది. బిఎస్‌ఎన్‌ఎల్‌లో 2000 అక్టోబర్‌ 1 నాటికి 3.5 లక్షల ఉద్యోగులుండగా 2015 మార్చి 31 నాటికి 2.25 లక్షలే ఉన్నారు. దీనివల్ల సామాజిక న్యాయంలో భాగంగా ఎస్‌సి/ఎస్‌టి/ఒబిసి లకు రావాల్సిన ఉద్యోగాలు రావటం లేదు.
ఒక వైపు ఉద్యోగాలు కల్పించే బాధ్యత నుంచి వైదొలగిన మోడీ ప్రభుత్వం మరో వైపు గ్రామీణ ఉపాధి హామీ పథకానికి నిధుల కేటాయింపును పెద్ద ఎత్తున తగ్గించి ఆ పథకం క్రింద దళితులకు, వెనకబడిన తరగతులకు దొరుకుతున్న పనిని కూడా దొరకకుండా చేస్తున్నది. ఈ విధముగా పెరుగుతున్న నిరుద్యోగ సమస్య వల్ల యువతలో ఏర్పడిన అసంతృప్తిని వినియోగించి మతోన్మాద శక్తులు, విచ్ఛిన్నకర శక్తులు అశాంతిని రెచ్చగొడుతున్నాయి. నిరుద్యోగ సమస్య ఈ విధంగా పెరగటం వల్ల సంఘటిత రంగంలో రెగ్యులర్‌ ఉద్యోగాలు తగ్గి కాంట్రాక్టు, క్యాజువల్‌, బినామీ, తదితర అతి స్వల్ప వేతనాల కార్మికుల సంఖ్య పెరిగి ట్రేడ్‌ యూనియన్ల పోరాట పటిమను దెబ్బతీసి కార్మికుల, ఉద్యోగుల భవిష్యత్తును ఇబ్బందుల పాలు చేస్తున్నది. కాబట్టి సమాజ శ్రేయస్సు దృష్ట్యా, కార్మిక వర్గ మనుగడ దృష్ట్యా నిరుద్యోగ సమస్యను పరిష్కరించాల్సిన అవసరం ఉంది. ఇందుకోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ రంగ సంస్థల్లో రిక్రూట్మెంట్‌పై నిషేధాన్ని తొలగించాలి. ఖాళీగా ఉన్న పోస్టులను రద్దు చేయకుండా భర్తీ చేయాలి. ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ రంగ సంస్థల్లో అవుట్‌సోర్సింగ్‌ను ఆపాలి. అందరికీ పని కల్పించేందుకు గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని మెరుగు పరచాలి. ఈ పథకం క్రింద కల్పించే పని రోజులపై 100 రోజుల పరిమితిని తొలగించాలి. స్వయం ఉపాధి, స్వయం సహాయక పథకాలకు, చిన్న పరిశ్రమలకు తగిన ఆర్థిక మద్దతు ఇవ్వాలి. నిరుద్యోగులకు భృతి కల్పించాలి. ఎంప్లారుమెంట్‌ ఎక్సేంజీలను ఆధునీకరించాలి. 
- పి. అశోక్‌బాబు