నష్టపరిహారం ఏది..?:గంగారావు

గంగవరం పోర్టు యాజమాన్య నిరంకుశత్వానికి సోమవారం ఓ కార్మికుడు మృతి చెందాడు. గంగవరం గ్రామానికి చెందిన ఎరిపిల్లి రాజారావు(40) పోర్టులో అగ్రికల్చర్‌ విభాగంలో విధులు నిర్వహిస్తున్నాడు. పోర్టుకు కిలోమీటరు దూరంలో రాజారావుకు సంబంధం లేని గోతులు తవ్వే పనిని యాజమాన్యం అప్పగించింది. పని ప్రదేశంలో మంచినీరు కూడా లేదు. పనిచేస్తుండగా రాజారావు కుప్పకూలిపోయాడు. అప్పటికే మృతిచెందిన రాజారావును చికిత్స పేరుతో దొడ్డిదారిన మల్కాపురంలోని ఇఎస్‌ఐ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి కెజిహెచ్‌కు తరలించేందుకు ప్రయత్నిస్తుండగా గంగవరం పోర్టు ఎంప్లాయీస్‌ యూనియన్‌ నాయకులు అడ్డుకున్నారు. నష్ట పరిహారం చెల్లించేవరకు మృతదేహాన్ని తరలిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. దీంతో స్థానిక పోలీసులు కలుగజేసుకుని చర్చల పేరుతో ఆరు గంటల పాటు మృతదేహాన్ని ఆస్పత్రిలోనే ఉంచారు. ఎప్పటికీ పోర్టు యాజమాన్యం చర్చలకు రాకపోవడంతో ఆగ్రహించిన యూనియన్‌ నాయకులు, మృతుని కుటుంబ సభ్యులు, కార్మికులు మృతదేహాన్ని గంగవరం పోర్టుకు తీసుకొచ్చి ప్రధాన గేటు వద్ద ఆందోళనకు దిగారు. పోర్టు యాజమాన్యం నష్టపరిహారం చెల్లిస్తే తప్ప ఇక్కడ్నుంచి కదిలే ప్రసక్తే లేదని గంగవరం పోర్టు ఎంప్లాయీస్‌ యూనియన్‌ సిఐటియు గౌరవాధ్యక్షులు డాక్టర్‌ బి.గంగారావు హెచ్చరించారు. ఆందోళనలో గంగవరం పోర్టు ఎంప్లాయీస్‌ యూనియన్‌ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కారి అప్పారావు, కదిరి భూలోకరావు, సిఐటియు నగర ప్రధాన కార్యదర్శి ఎం.జగ్గునాయుడు, నాయకులు ఉన్నారు. సంఘటన స్థలం వద్ద పోలీసులు భారీగా మోహరించారు.