నవ్యాంద్రాలో మద్యం మాఫియా

నవ్యాంద్రాలో మద్యం మాఫియా విచ్చల విడిగా పెచ్చురిల్లుతుందని..రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన మద్య విధానం వల్ల మండల స్థాయిలో బెల్ట్‌ షాపులు పెరుగుపోతున్నాయని మహిళ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సుంకర పద్మశ్రీ విమర్శించారు. డ్వాక్రా రుణమాఫీ చేస్తానని మహిళ ఓట్లు వేయించుకొని గద్దెనెక్కిన చంద్రబాబు మహిళ వ్యతిరేఖ విధానాలు రూపొందుస్తున్నారని ఆరోపించారు. బుధవారం నుంచి రెండు రోజుల పాటు జరిగే జాతీయ మహిళ కాంగ్రెస్‌ సమావేశాలకు ఢిల్లీ వచ్చిన ఆమె మీడియాతో మాట్లాడుతూ...కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేఖ విధానాల, భూఆర్ధినెన్స్‌,బీజేపీ అవినీతిపై చర్చించామన్నారు. ఆగస్టులో జరిగే మహిళ కాంగ్రెస్‌ పార్లమెంట్‌ ముట్టడిలో లేవనెత్తే డిమాండ్లపై చర్చ జరిగిందన్నారు. రాష్ట్రంలో ప్రజా సమస్యలపై చంద్రబాబు మాట్లాడకపోవటం దారుణమన్నారు. మహిళ సమస్యలపై స్పందించేందుకు చంద్రబాబాకు సమయం లేదని విమర్శించారు. మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఉద్యమించేందుకు త్వరలో కార్యచరణ ప్రవేశపెడుతున్నామని తెలిపారు.