నదుల అనుసంధానానికే మొగ్గు

దేశంలో నదుల అనుసంధానం తక్షణ అవసరమని జాతీయ జల వనరుల అభివృద్ధి మండలి సమావేశం అభిప్రాయపడింది. రెండు నెలలకొకసారి జరిగే ఈ జలఅభివృద్ధి మండలి సమావేశం సోమవారం విజ్ఞాన్‌ భవన్‌లో జరిగింది. దీనికి వివిధ రాష్ట్రాల నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు. సుప్రీం కోర్టు ఒత్తిడి మేరకు కేంద్ర నదీ జలాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నదుల అనుసంధానానికి ప్రత్యేక కమిటీ వేసిన సంగతి తెలిసిందే. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి నదుల అనుసంధానాన్ని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం స్వాగతించగా, తెలంగాణ ప్రభుత్వం మిగులు జలాల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ముఖ్యంగా మహానది, గోదావరిలో మిగులు నీళ్లు కృష్టా నదీకి మళ్లించి, అక్కడ నుంచి పెన్నా నదికి, అటు పిమ్మట కావేరికి అక్కడ నుంచి వైదేహికి, ఆ పైన గుండకి నీళ్లు మళ్లించాలని ప్రతిపాదనలు వచ్చినట్లు ఈ వర్గాలు పేర్కొన్నాయి. మహానదీ ఒరిస్సాలో ఉండటంతో ఒరిస్సా ప్రభుత్వం మిగులు నీళ్లులేవు కనుక మహానది నుంచి గోదావరికి తరలించడానికి ససేమిరా అంటోందని, ఒరిస్సా ప్రభుత్వాన్ని ఒప్పించే ప్రయత్నంలో కేంద్ర ప్రభుత్వం అనేక ప్రతి పాదనలు ముందుకు తెచ్చిందని ఈ వర్గాలు వివరించాయి. గోదావరిలో కలిసే 230 టిఎంసీల మహానది మిగులు జలాలకు ప్రస్తుతం ఒరిస్సా ప్రభుత్వం సానుకూలంగా ఉన్నట్లు ఈ వర్గాలు తెలిపాయి.