నక్కపల్లి 'హెటిరో' వద్ద ఉద్రిక్తత

- హెచ్‌ గేట్‌లో దారి మూసివేతకు నిరసనగా కార్మికుల ధర్నా
- మద్దతుగా నిలిచిన సిపిఎం జిల్లా కార్యదర్శి లోకనాథం, ఎం.అప్పలరాజు
- దిగొచ్చిన యాజమాన్యం 
        నక్కపల్లి హెటిరో డ్రగ్స్‌ కంపెనీ వద్ద బుధవారం ఉద్రిక్తత నెలకొంది. కంపెనీ హెచ్‌ గేట్‌ వద్ద వాహనాలు రాకపోకలు సాగించే దారి మూసివేతను నిరసిస్తూ హెటిరో కార్మికులు విధులను బహిష్కరించి గేట్‌కు ఎదురుగా ధర్నా చేపట్టారు. ఇక్కడ ఉన్న దారిలో యథావిధిగా కార్మికుల వాహనాలు రాకపోకలు సాగించేందుకు మార్గంలో ఉంచాలని డిమాండ్‌ చేశారు. కార్మికుల పోరాటానికి సిపిఎం జిల్లా కార్యదర్శి కె.లోకనాధం, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఎం.అప్పలరాజు మద్దతు పలికారు.
హెటిరో పరిశ్రమ చుట్టుపక్కలున్న రాజయ్యపేట, బోయపాడు, బుచ్జిరాజుపేట, నల్లమట్టిపాలెం, చందనాడ, తమ్మయ్యపేట, ఎన్‌.నర్సాపురం, అయ్యన్నపాలెం తదితర గ్రామాలకు చెందిన సుమారు 3,500 మంది హెటిరో కంపెనీ కార్మికులు హెచ్‌ గేట్‌ ద్వారా రాకపోకలు సాగిస్తారు. ఇప్పుడు వాహనాలు రాకపోకలకు వీల్లేకుండా ఆ దారి మూసివేయడంతో కార్మికులు సుమారు ఐదారు కిలోమీటర్ల దూరం అదనంగా ప్రయాణం చేయాల్సి వస్తోంది. దీంతో బుధవారం కార్మికులు విధులను బహిష్కరించి హెచ్‌ గేట్‌ వద్ద భైఠాయించారు. దీంతో సంఘటనా స్థలానికి యలమంచిలి సిఐ వెంకట్రావు, నక్కపల్లి, పాయకరావుపేట ఎస్‌ఐలు రామకృష్ణ, సత్యనారాయణ తమ సిబ్బందితో చేరుకున్నారు. సిఐ వెంకట్రావు, ప్రజాప్రతినిధులు గొర్ల బాబురావు, గంటా తిరుపతిరావు, గట్టెం గణేష్‌, పిక్కి శ్రీనివాససరావు, పుణ్యమంతుల రమణలు తదితరులు హెటిరో డైరక్టర్‌ భాస్కరరెడ్డి, డిజిఎం బి.వెంకటేశ్వరరెడ్డిలతో చర్చలు జరిపారు. చర్చలకు సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు అప్పలరాజును యాజమాన్యం రానివ్వకపోవడంతో కార్మికులు ఆగ్రహానికి గురై దారికి అడ్డంగా వేసిన మెస్‌ను తొలిగించారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ప్రజాప్రతినిధులను కార్మికులు నిలదీశారు. తొలిగించిన మెస్‌లను యథావిధిగా ఏర్పాటు చేస్తే సమస్య పరిష్కరిస్తామని ప్రజాప్రతినిధులు కార్మికులకు హామీ ఇచ్చారు. ముందు దారి సౌకర్యం కల్పిస్తే తొలిగించిన మెస్‌ను ఏర్పాటు చేస్తేమని కార్మికులు తేల్చి చెప్పారు. దారి సౌకర్యం కల్పించే వరకు ఆందోళన విరమించబోమని స్పష్టం చేశారు. మరో దఫా జరిగిన చర్చలకు సిపిఎం జిల్లా కార్యదర్శి కె.లోకనాథాన్ని ఆహ్వానించారు. లోకనాథం, సిఐ వెంకట్రావు, ప్రజాప్రతినిధులు సమక్షంలో జరిగిన ఈ చర్చలు ఫలించాయి. ప్రత్యామ్నాయ రోడ్డు ఏర్పాటు చేసే వరకు ప్రస్తుత రోడ్డులో కార్మికులు రాకపోకలు సాగించడానికి యాజమాన్యం ఒప్పుకుంది. దీంతో కార్మికులు ఆందోళన విరమించారు.
దీనికి ముందు సిపిఎం జిల్లా కార్యదర్శి కె.లోకనాధం, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఎం.అప్పలరాజు మాట్లాడుతూ పరిశ్రమలో పని చేస్తున్న కార్మికులకు ఇబ్బందులకు గురిచేయడం సరికాదన్నారు. హెచ్‌ గేట్‌కు అడ్డంగా మెస్‌ ఏర్పాటు చేసి నడిచి వెళ్ళే వారికి మాత్రమే దారి ఉంచి, సైకిళ్లు, మోటారు సైకిళ్లపై వెళ్ళేడానికి వీలు లేకుండా చేయడం వల్ల సుమారు 3,500 మంది కార్మికులు, ప్రధానంగా మహిళా కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వాస్తు, సెక్యూరిటీ సమస్య అని చెప్పి పాత రోడ్డు మూసివేయడం సరైన పద్ధతికాదన్నారు. ప్రభుత్వ భూమిని కంపెనీ ఉపయోగించుకుంటుందని, ఆ భూమిలో దారికి అడ్డంగా మెస్‌ ఏర్పాటు చేసే అధికారం ఎవరిచ్చారని ప్రశ్నించారు. రోడ్డుకు అడ్డంగా వేసిన మెస్‌ను తొలిగించాలని డిమాండ్‌ చేశారు.