ధరాఘాతం..

 నిత్యావసర వస్తువుల ధరలు ప్రజానీకానికి శరాఘాతంలా తాకుతున్నా ప్రభుత్వాలకు చీమ కుట్టినట్టు కూడా లేకపోవడం దారుణం. నిన్నటి దాకా ఉల్లి పెట్టించిన కన్నీటితో కుదేలయిన ప్రజలను ఇప్పుడు కందిపప్పు కుదేలెత్తిస్తున్న తీరు విస్మయాన్ని కలిగిస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా కందిపప్పు ధర డబుల్‌ సెంచరీని దాటి ఆ పైనా దౌడు తీస్తున్నా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం క్షమార్హం కాదు. దసరా పండుగ ఉత్సాహంపౖౖె ఈ ధరాఘాతం నీళ్లు చల్లింది. పప్పు వండు కోవాలన్నా తటపటాయించే స్థితికి సాధారణ ప్రజానీకం చేరుకున్న తరువాత ఇంకెక్కడి పండగ! ఉల్లి ఏడిపించడానికి కొద్దిరోజుల ముందు చికెన్‌ ఇలాగే కొండెక్కి కూర్చుంది. అప్పట్లో చికెన్‌ వండిన రోజే పండగ. ఆ తరువాత రైతు బజార్‌ క్యూలలో నిలబడి, తోపులాటల్లో విజయం సాధించి, ఉల్లిపాయలు ఇంటికి పట్టుకెళ్లితే పండుగే పండగ! ఇప్పుడు కిలో కందిపప్పు కొంటే పండుగ జరుపుకొన్నట్టే! ఈ దుస్థితి నుండి ప్రజలను బయట పడేయాల్సిన పాలక వర్గాలు పట్టించుకోకుండా, మార్కెట్‌ శక్తుల లాభాల రక్షణకే ప్రాధాన్యమిస్తున్న తీరు దుర్మార్గం. కందిపప్పుతో పాటు మిగిలిన అన్ని పప్పులూ, నిత్యావసరాల ధరలూ గత ఏడాది కాలంగా పైచూపే చూస్తున్నా సకాలంలో చర్యలు తీసుకోవాలన్న కనీస ఆలోచన కూడా పాలక వర్గాలకు రాకపోవడం ఆశ్చర్యమే! 
నిజానికి కందిపప్పు ధర ఆకాశానికి ఎగబాకడం ఊహించనిదేమీ కాదు. కొంత కాలంగా ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాల కారణంగా దేశ వ్యాప్తంగా అపరాల సాగు గణనీయంగా తగ్గిపోయింది. ప్రతి ఏడాది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విడుదల చేస్తున్న గణాంకాలే ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. దీనికి తోడు దేశవ్యాప్తంగా నెలకొన్న అనావృష్టి పరిస్థితులూ సమస్యను తీవ్రం చేశాయి. వర్షాభావ పరిస్థితులు ఇదే మాదిరి కొనసాగితే రానున్న రోజుల్లో కొరత తప్పదంటూ ఆహార రంగ నిపుణులు కొన్ని నెలలుగా చేస్తున్న హెచ్చరికలనూ ప్రభుత్వం బేఖాతరు చేసింది. ఆహార ధాన్యాల ఎగుమతులకు కళ్లెం వేయాలన్న ముందు చూపూ లేక పోయింది. ఇక అడ్డూ అదుపు లేకుండా బ్లాక్‌ మార్కెట్‌ సాగించే అక్రమార్కుల జోలికి వెళ్లే తెగువనూ ప్రదర్శించ లేకపోయింది. అధికారంలోకి వచ్చింది మొదలు విదేశాల్లో సైతం ప్రచారార్భాటాలు సాగించిన నేతల ఆచరణ శూన్యత్వం మరీ ఇంత అధ్వానంగా ఉంటుందని ఊహించలేరు. 
చేతులు కాలాకైనా ఆకులు పట్టు కుంటున్నారా అంటే అదీ లేదు! ఇప్పటికి దేశంలో ఉన్న డిమాండ్‌ ఎంత, అంతర్గతంగా అందుబాటులో ఎన్ని క్వింటాళ్లు నిల్వలున్నాయి, విదేశాల నుండి దిగుమతి చేసుకోవాల్సిన పరిమాణం ఎంత అనే అంశాలపై కేంద్ర ప్రభుత్వ పెద్దలు కనీస కసరత్తు చేయక పోవడం బాధ్యతా రాహిత్యమే! ఏ మాత్రం లెక్కలు తీసి ఉన్నా, నామమాత్రంగా దిగుమతి చేసుకునే ఐదు వేల టన్నుల కంది పప్పుతోనే బ్రహ్మాండం బద్దలవుతుందన్న పద్ధతిలో కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేసి ఉండేది కాదు. ప్రచారార్భాటంలో కేంద్ర సర్కారుకు ఏ మాత్రం తీసిపోని రాష్ట్ర ప్రభుత్వమూ సామాన్య ప్రజల సమస్యల పట్ల నిర్లక్ష్యం చూపడంలోనూ ఆ తానులోని ముక్కగానే తేలి పోయింది. దేశ వ్యాప్త పరిణామాల్లో భాగంగానే రాష్ట్రంలోనూ కంది సాగు తగ్గింది. ఏడాది క్రితం దాదాపుగా 85 రూపాయలున్న కందిపప్పు ప్రస్తుతం 200 రూపాయలు దాటినా చలనం లేదు. సింగపూర్‌. జపాన్‌ పర్యటనల మీద చూపిన శ్రద్ధలో కొద్దిగానైనా ధరల అదుపుపై చూపి ఉంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదేమో! సంక్రాంతికి, రంజాన్‌కు చంద్రన్న కానుక అంటూ ఆర్భాటం చేసిన ప్రభుత్వ పెద్దలు ఆపత్సమయంలో ఆదుకోవడానికి బదులుగా రిక్త హస్తం చూపిన తీరు ప్రజానీకాన్ని నిలువునా వంచన చేయడమే! ధరలు ఏ నెలకానెల పెరుగుతూ ఉన్నా పూర్తి స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించక పోవడం నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనం. 
ప్రజలపై ఒక దాని వెంట మరొకటిగా ధరల దాడి జరుగుతున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం యాదృచ్ఛికమనుకుంటే పొరపాటే! మార్కెట్‌ శక్తుల ప్రయోజనాల కోసం ఒక వ్యూహం ప్రకారమే ప్రభుత్వాలు ఈ ధోరణిని అనుసరిస్తున్నాయి. రేషన్‌ షాపులకు సరుకుల్లో కోతలు పెట్టడం, సరఫరాలను అరకొరగా చేయడం, వాటిలోనూ నాణ్యతను తగ్గించడం వంటి చర్యలతో ప్రజా పంపిణీ వ్యవస్థను ఒక పథకం ప్రకారం నిర్వీర్యం చేస్తున్నాయి. మార్కెట్‌ శక్తులపై అనివార్యంగా ఆధారపడే పరిస్థితిని సృష్టించడమే లక్ష్యంగా సాగుతున్న ఈ చర్యలను ప్రతిఘటించాల్సి ఉంది. తిండి కలిగితేనే కండ కలదోయి... కండ కలవాడే మనిషోయి... అంటూ దేశమంటే ఏమిటో స్పష్టం చేసిన మహాకవి సృజన ప్రజలతో పాటు ప్రభుత్వాలకూ ఆదర్శం కావాలి. వట్టి మాటలు కట్టిపెట్టి ప్రజలకు గట్టిమేలు చేసే దిశలో ప్రజా పంపిణీ వ్యవస్థను పటిష్ఠం చేయడానికి చర్యలు తీసుకోవాలి. దీనికి భిన్నంగా మార్కెట్‌ ప్రయోజనాలకే పట్టం కడితే ఏం తినేటట్టు లేదంటూ నిట్టూర్పులు విడిచే ప్రజలే ఎదురుతిరిగి పాలకులకు గట్టి గుణపాఠం చెప్పడానికి వెనకాడరు.