ధరల‌ పెరుగుదల‌కు నిరసనగా సిపియం రాస్తారోకో

2015 ఆగష్టు 31    
    నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుదల‌కు నిరసనగా సిపియం గ్రేటర్‌ విశాఖనగర కమిటీ ఆధ్వర్యాన కార్యకర్తలు సోమవారం మద్దిపాలెం జంక్షన్‌లో భారీ ఎత్తున రాస్తారోకో నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేసారు. బిజెపి, తెలుగుదేశం ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చాక భారీగా ప్రజల‌పై భారాలు పడుతున్నాయి. ధరలు పేద, సామాన్యుడుకి అందని ద్రాక్షగా ఉంది. ఉల్లి, కందిపప్పు ధరలు ఇక చెప్పనవసరం లేదు. దళారులు, పెట్టుబడిదారుల‌కు ఈ ప్రభుత్వాలు దాసోహం చేస్తున్నాయి. ఉల్లిపాయలు సబ్సిడీ ద్వారా 20 రూ॥కే అందజేస్తున్నామని ప్రభుత్వం భారీగా ప్రకటనలు చేస్తోంది. కాని రైతు బజార్ల ద్వారా తెల్లరేషన్‌కార్డు ఉంటేనే ఇస్తున్నారు. ఆ ఉల్లిపాయలు కూడా నాణ్యత లేనివి. బయట మార్కెట్లో 60రూ॥కు మంచి ఉల్లిపాయలు అమ్ముతుంటే ప్రభుత్వం పాడైన ఉల్లిని సరఫరా చేయడం దుర్మార్గం. బహిరంగ మార్కెట్లో ఉల్లి నిల్వ‌లు చేపట్టి కృత్రిమ కొరతను సృష్టిస్తున్నారు. దీనిపై ప్రభుత్వం ఎటువంటి దాడులు చేయకుండా నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తోంది. తక్షణమే నిత్యావసర ధరలు ప్రజల‌కు అందుబాటులో ఉంచాలి. రేషన్‌కార్డు ఉన్నా లేకపోయినా ప్రతి కుటుంబానికి వారానికి రెండు కేజీల‌ ఉల్లిపాయలు సరఫరా చేయాలి.