ధరలపై యుద్ధం..

ఇటు రైతులను అటు వినియోగదారులను కట్టకట్టి అందినకాడికి దోపిడీ చేసే దళారీ వ్యవస్థను మరింతగా స్థిరీకరించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే నడుంబిగించడం ఆందోళన కలిగించే అంశం. ఈ దుష్పరిణామం పివి నరసింహారావు 'సంస్కరణ'లతో పురుడు పోసుకొని వాజపేయి హయాంలో మొగ్గ తొడిగి మన్మోహన్‌ సమయంలో కొమ్మలుగా విస్తరించి చివరికి మోడీ నేతృత్వంలో వటవృక్షమైంది. రైతుల, వినియోగదారుల మూలుగ పీల్చే కేంద్ర విధానాలకు రాష్ట్రం తందాన అంటోంది. రైతులకు కనీస మద్దతు ధర (ఎంఎస్‌పి) దక్కక ఆత్మహత్యలకు పురిగొల్పుతున్నదీ, నిత్యావసరాల ధరలు పెరిగిపోయి పేదల కంచాల్లో కనీసం పప్పుచారు, చింత పులుసు కరువవుతున్నదీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడబలుక్కొని ప్రజల నెత్తిన రుద్దిన విధానాల ఫలితమే. నిన్న ఉల్లిపాయల ధరలు ఆకాశానికెగిసినా, నేడు కందిపప్పు రేటు చుక్కలు దాటినా అందుకే. రేపు బియ్యం ధరలు మండుతాయన్న సంకేతాలూ ఆ కోవలోనివే. కందిపప్పు కిలో రెండొందల రూపాయలకు ఎగబాకినాక ప్రజల్లో నిరసనలు మిన్నంటిన దరిమిలా ఇప్పుడు బ్లాక్‌ మార్కెట్‌ గురించి అరుణ్‌జైట్లీ, తదితరులు చిలక పలుకులు పలుకుతున్నారు. చంద్రబాబు, ఆయన సహచర మంత్రులు తాళం వేస్తున్నారు. ధరలు పెరగడానికి కారణం వాతావరణ ప్రతికూల పరిస్థితులేననడం తప్పించుకోడానికే. నిత్యావసర వస్తువులను ప్రభుత్వమే సేకరించి ప్రజలకు రేషన్‌ దుకాణాల్లో పంపిణీ చేస్తే అటు జనానికి ధరాఘాతం నుంచి ఊరట లభిస్తుంది అటు అక్రమ వ్యాపార లాబీకి ముకుతాడు పడుతుంది. ఈ పని చేయడానికి పాలకులకు సుతరాం ఇష్టం లేదని వారి చేష్టలే చెబుతున్నాయి.
నాలుగైదు నెలల నుంచి రాష్ట్రంలో కందిపప్పు ధరలు పెరుగుతున్నా బాబు ప్రభుత్వం కుంభకర్ణుడిలా నిద్రపోయింది. తీరా ప్రతిపక్షాల, ప్రజల ఆందోళనలు ఉధృతమయ్యాక కిలో రూ.143పై అమ్మిస్తున్నామని హడావుడిగా ప్రకటలు చేయడమే కాదు మంత్రులు ఫొటోలకు ఫోజులిచ్చి మరీ ప్రచారం చేశారు. ప్రచార్భాటమే తప్ప ఎక్కడా సర్కారు చెప్పిన ధరకు వ్యాపారులు అమ్మట్లేదు. ధర తగ్గింపు విషయంలో సర్కారు పై నుంచి కిందికి కాకుండా కింద నుంచి పైకి తలకిందులు వ్యవహారం నడిపింది. ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయకుండా వ్యాపారులే స్వచ్ఛందంగా అమ్ముతారని గంపెడాశ ఒలకబోసింది. కాని ఇది జరిగేది కాదని దానికీ తెలుసు. రైతుల వద్ద నుంచి ఎంఎస్‌పి కంటే తక్కువకు కొని, విదేశాలు, పొరుగు రాష్ట్రాల నుంచి స్వల్ప ధరకు సేకరించి గోదాముల్లో టన్నులకొద్దీ అక్రమంగా దాచిన నిల్వలపై ప్రభుత్వం దాడులు చేసి ఆ సరుకును బహిరంగ మార్కెట్‌లోకి విడుదల చేస్తే దళారులు దారిలోకొస్తారు. ప్రజలకు ధర తగ్గుతుంది. ఆ పని చేయకుండా అక్రమ వ్యాపారులు, దళారుల చేతిలో కీలుబొమ్మగా మారి వారు చెప్పినట్లు ఆడటం సర్కారుకు తగని పని. దళారులు ఎంతకు సేకరించారో విడిచిపెట్టి రూ.143 రేటు నిర్ణయించడం వారితో లాలూచీ కిందికే వస్తుంది. కిలో రూ.70కి సేకరించి ప్రజలకు 143కు అమ్మమంటే ప్రభుత్వం అక్రమార్కులకు లైసెన్స్‌లిచ్చినట్లే. పైగా దళారుల కృత్రిమ ధరను స్థిరీకరించడం అవుతుంది. ప్రజలకు ధరల మంట వ్యాపారులకు లాభాల పంట ప్రాప్తిస్తుంది. 
ఆధార్‌, నగదు బదిలీ వంటివి ప్రజలకు నిత్యావసర వస్తువుల స్థానంలో సబ్సిడీ ఇచ్చే పద్ధతులు ప్రవేశపెట్టాయి. ఈ క్రమంలో వచ్చినవే ధాన్యం, చక్కెరపై లెవీ రద్దు. ఇంతకుముందే చక్కెరపై లెవీ ఎత్తేయగా ఈ ఏడాది నుంచి వరి ధాన్యానికి లెవీ లేదు. లెవీ ఉన్నప్పుడు ప్రభుత్వం నిర్ణయించిన పరిమాణంలో ఎఫ్‌సిఐకి మిల్లర్లు బియ్యం సరఫరా చేసేవారు. రైతుల నుంచి ఎంఎస్‌పికి ధాన్యం కొన్నట్లు ఆధారాలు చూపితేనే ఎఫ్‌సిఐ మిల్లర్ల నుంచి బియ్యం తీసుకునేది. ఈ విధంగా సేకరించిన బియ్యాన్ని ప్రజా పంపిణీ వ్యవస్థ (పిడిఎస్‌)కు ఇచ్చేది. లెవీ ఎత్తేసినందున రైతుల నుంచి ఎంఎస్‌పికి మిల్లర్లు కొనక్కర్లేదు. పైగా సేకరించిన ధాన్యాన్ని మార్కెట్‌లో యధేచ్ఛగా అమ్ముకోవచ్చు. ఇక నుంచి ఎఫ్‌సిఐ రాష్ట్రాలకు బియ్యం కాకుండా డబ్బులిస్తుంది. వాటితో రాష్ట్రం బియ్యం సేకరించాలి. కిలో రూపాయికి పిడిఎస్‌లో ఇవ్వడం వలన కేంద్రం ఇచ్చేది పోను రాష్ట్ర్రం ఇప్పటికే రూ.2,300 సబ్సిడీ పెట్టుకుంటోంది. కేంద్రం సబ్సిడీని నిర్ణయించి నిధులిస్తే రాష్ట్రం అదనంగా వందల కోట్లు భరించాలి. ఉన్న సబ్సిడీలకు ఎప్పుడు ఎగనామం పెట్టాలా అని చూస్తున్న బాబు సర్కారు రేషన్‌ కార్డుల కోత, ధర పెంపునకు మొగ్గు చూపుతోంది. మార్కెట్‌లో కందిపప్పు ధర పెరిగినప్పుడు అదనపు సబ్సిడీ భరించి పాత రేటు రూ.50కి రేషన్‌లో ఇవ్వడం ప్రజానుకూల నిర్ణయం. సేకరణ ధర పెరిగింది కనుక రేషన్‌లో ధర రూ.90 చేయడం వ్యాపార అనుకూల కార్యక్రమం. దీన్నిబట్టి రేపు బియ్యం సబ్సిడీ ఏమవుతుందో ఊహించవచ్చు. మొత్తం మీద కేంద్ర, రాష్ట్ర విధానాలవల్ల నిత్యావసర సరుకుల ధరలు ఆకాశానికి చేరుతుంటే ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్లుండడం ఇంకెంతమాత్రం సహించరాని విషయం. అందుకే ఈ నెల 9న ధరల పెరుగుదలను అరికట్టాలని కోరుతూ మండల, డివిజన్‌, జిల్లా కేంద్రాల్లో నిరసన ప్రదర్శనలు, ధర్నాలు నిర్వహించాలని రాష్ట్రంలోని 9 వామపక్ష పార్టీలు పిలుపునిచ్చాయి. ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనండం ద్వారా పాలకుల మెడలు వంచాల్సిన అవసరం ఉంది.