ధరలను నియంత్రించాలి..

ధరల పెరుగుదలను నియంత్రించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలి. ఇందుకు ప్రజాపంపిణీ వ్యవస్థను సార్వత్రీకరించాలి. నిత్యావసర సరుకుల మార్కెట్‌లో స్పెక్యు లేషన్‌ను నివారించాలి. అఖిల భారత వినిమయ ధరల సూచిక 2013-13లో 10.4 శాతం పెరగగా 2013-14లో 8.3 శాతం, 2014-15లో 5.3 శాతం పెరిగింది. ఆహార వస్తువుల ధరలు మరింత పెరుగుతున్నాయి. వీటి ధరలు 2012-13లో 12 శాతం, 2013-14లో 8.3 శాతం, 2014-15లో 6.3 శాతం పెరిగాయి. గత 8 నెలలుగా ధరల పెరుగుదల రేటు పెరుగుతున్నది. నవంబరు 2014లో ద్రవ్యోల్బణం 4.12 శాతం కాగా మే 2015లో 5.74 శాతం అయింది. జూన్‌ 2015లో ద్రవ్యోల్బణం రేటు భారతదేశంలో 5.4 శాతం కాగా చైనాలో 1.4 శాతమే ఉన్నది.
బిఎస్‌ఎన్‌ఎల్‌ ఉద్యోగులకు డిఎ రేటు 2007 జనవరిలో 0 కాగా 2015 జులై 1 నాటికి 102.6 శాతం అయిందంటే ధరల పెరుగుదల ఏ స్థాయిలో ఉన్నదో తెలుస్తున్నది. వినిమయదారుల ధరల సూచిక ధరల పెరుగుదలను తక్కువగా చూపించే విధంగా రూపొందించినందున ధరలు ఏ మేరకు పెరిగితే డిఎ ఆ మేరకు రావడం సాధ్యం కాని విధంగా డిఎ ఫార్ములా ఉన్నది. కాబట్టి మొత్తంగా చూస్తే ధరల పెరుగుదల వల్ల డిఎ తగినంతగా రాక నష్టం జరుగుతున్నది. ఇంతేగాక డిఎ ఇప్పటికే 100 శాతం మించినా దానిని మూల వేతనంలో కలిపేసే విషయాన్నే మోడీ ప్రభుత్వం ప్రస్తావించడం లేదు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులకు 100 శాతం డిఎను మూల వేతనంలో కలపాలని కేంద్ర ట్రేడ్‌ యూనియన్లు 2015 జనవరి 17న ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీని కోరినా ఇంత వరకూ స్పందన లేదు.
డిఎ లేకుండా తక్కువ వేతనాలు పొందే కార్మికుల పరిస్థితి ధరల పెరుగుదల వలన మరింత బాధాకరంగా ఉంటున్నది. విద్య, వైద్యం ప్రైవేటు పరమయినందున సామాన్యులు తట్టుకోలేని పరిస్థితి ఏర్పడుతున్నది. దీనికి తోడు మోడీ ప్రభుత్వం గుండె జబ్బు, డయాబెటిస్‌, ఎయిడ్స్‌, తదితర వ్యాధులకు ఉపయోగించే మందుల ధరలపై నియంత్రణ ఎత్తివేసినందున వాటి ధరలు విపరీతంగా పెరిగాయి. అంతర్జాతీయంగా పెట్రోలియం ధరలు 50 శాతం తగ్గాయి. ఆ మేరకు పెట్రోలు, డీజిల్‌ ధరలు తగ్గాలి. పెట్రోలు, డీజిల్‌ ధరలు తగ్గితే రవాణా ఛార్జీలు తగ్గి సరుకుల ధరలు తగ్గుతాయి. ఇంతేగాక డీజిల్‌ ధరలు తగ్గితే బిఎస్‌ఎన్‌ఎల్‌కు డిజీలు ఖర్చు ఆ మేరకు తగ్గి నష్టాలు తగ్గుతాయి. కానీ మోడీ ప్రభుత్వం పెట్రోలు, డీజిల్‌పై విపరీతంగా పన్నులు విధించి వాటి ధరలు తగ్గకుండా చేసింది.
నిత్యావసర సరుకుల అక్రమ నిల్వలను అనుమతించకూడదు. పెట్రోల్‌/డీజిల్‌పై విధించిన అధిక పన్నులను కూడా రద్దు చేసి వాటిని ఉత్పత్తి ఖర్చుకు తగ్గ లాభం కలిపిన రేటుకు అమ్మే విధానాన్ని అమలు చేయాలి. ప్రజా పంపిణీ వ్యవస్థను సార్వత్రీకరించి ఆదాయంతో నిమిత్తం లేకుండా అందరికీ వర్తింపజేయాలి. ప్రతి కుటుంబానికీ నెలకు 35 కిలోలు ఆహార ధాన్యాలు కిలో రూ.2కు అందించాలి. ఈ పని చేయకుండా మోడీ ప్రభుత్వం ఆహార భద్రతా చట్టాన్ని నీరుగారుస్తున్నది. ఆహారం బదులు కొంత నగదు సబ్సిడీగా ఇచ్చి క్రమంగా ప్రజా పంపిణీ వ్యవస్థను దెబ్బ తీసే విధంగా కుట్ర చేస్తున్నది. ఈ కుట్ర లను విరమించి పైన తెలియజేసిన విధంగా ధరల పెరుగుదలను అరికట్టేందుకు తగిన చర్యలు తీసుకోవాలి. ధరల పెరుగుదలను అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతూ సెప్టెంబరు 2 సార్వత్రిక సమ్మె జయప్రదం చేయండి.