దోషులను బోనులో నిలబెట్టాలి

అగస్టా కుంభకోణం, కాగ్‌ తవ్వితీసిన గుజరాత్‌ స్టేట్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ (జిఎస్‌పిసి) అవినీతి భాగోతంపై పార్లమెంటులో బిజెపి, కాంగ్రెస్‌లు పరస్పరం ఆరోపణలు, ప్రత్యారోపణలతో సభాకార్యక్ర మాలను స్తంభింపజేశాయి. ఈ రెండు కుంభకోణాల్లోను ఆవిరైన ప్రజాధనాన్ని మెక్కిన వారిచే కక్కించేందుకు దీనిపై పార్లమెంటులో సమగ్ర చర్చ జరిగితే ఉపయోగకరంగా వుండేది. కానీ, పసలేని వాదనలతో సభను అడ్డుకోవడం ఈ కుంభకోణాల్లో దోషులను కాపాడడానికే పనికొస్తుంది. రూ.36 వేల కోట్ల విలువైన పన్నెండు వివిఐపి హెలికాప్టర్ల అమ్మకంలో రూ.360 కోట్ల మేర ముడుపుల చెల్లింపునకు సంబంధించిన అగస్టా వెస్ట్‌లాండ్‌ కుంభకోణం గురించి లేవనెత్తి కాంగ్రెస్‌ను ఇరకాటంలో పెట్టాలని బిజెపి యత్నించగానే, కాంగ్రెస్‌ 2016 కాగ్‌ నివేదికను అస్త్రంగా చేసుకుని బిజెపి పై ఎదురు దాడికి దిగింది. అయితే, ఇందులో అసలు పాత్రధారులు, సూత్రధారులను బయటకు లాగేందుకు ఇరు పక్షాలు సిద్ధంగా లేవు. కాంగ్రెస్‌ నేతృత్వంలోని యుపిఏ-2 ప్రభుత్వ హయాంలో ఇటాలియన్‌ కంపెనీ అగస్టా వెస్ట్‌లాండ్‌ కంపెనీతో కుదుర్చుకున్న హెలికాప్టర్ల కొనుగోలు ఒప్పందంలో ముడుపులు ముట్టాయని చెబుతున్న మోడీ ప్రభుత్వం, తాను అధికారంలోకి వచ్చిన ఈ రెండేళ్లలో దానిపై దర్యాప్తును ఎందుకు వేగవంతం చేయలేదు? ఈ కుంభకోణానికి కారణమైన అగస్టా వెస్ట్‌లాండ్‌కు చెందిన ఆంగ్లో, ఇటాలియన్‌ కంపెనీ ని 'మేడికన్‌ ఇండియా'లో భాగస్వామిగా ఎన్డీయే సర్కార్‌ ఎలా చేర్చుకుంది? ఆ కంపెనీతో 25 వేల కోట్ల రక్షణ కొనుగోళ్ల ఒప్పందాలను ఎలా కుదుర్చుకుంది? ఇలాంటి అనేక ప్రశ్నలకు మోడీ సర్కార్‌ సమాధానం చెప్పాలి. అదే సమయంలో కాంగ్రెస్‌ కూడా ఈ కుంభకోణంలో బదులివ్వాల్సిన ప్రశ్నలు ఉన్నాయి. అగస్టా వెస్ట్‌లాండ్‌ కంపెనీ ముడుపులు చెలించినట్లు వార్తలు రావడంతో 2014లో ఆ కాంట్రాక్టును రద్దు చేసి, సిబిఐ దర్యాప్తునకు ఆదేశించిన అప్పటి యుపిఏ ప్రభుత్వం దర్యాప్తును ఎందుకు తొత్తడం చేసింది? మధ్య దళారీలను గుర్తించడంలో ఎందుకు విఫలమైంది? వంటి ప్రశ్నలకు కాంగ్రెస్‌ సమాధానం చెప్పాలి. ఫిన్‌ మెకానికా కంపెనీ అనుబంధ సంస్థ అయిన అగస్టా వెస్ట్‌లాండ్‌ భారత్‌లో మధ్య దళారీలకు 360 కోట్లు ముడుపులు ముట్టజెప్పినట్లు ఇటలీ దర్యాప్తు సంస్థ , అక్కడి కోర్టు స్పష్టంగా తేల్చి చెప్పాయి. ఈ కేసులో ఫిన్‌మెకానికా కంపెనీ చీఫ్‌ గిసెస్పీ ఓర్సికి శిక్ష కూడా పడింది. భారత్‌లో మాత్రం ప్రతిష్టాత్మక దర్యాప్తు సంస్థ సిబిఐ ఈ కేసుపై దర్యాప్తులో ఒకడుగు ముందుకు రెండడుగులు వెనక్కి అన్న చందంగా వ్యవహరిస్తోంది. అందువల్లే దర్యాప్తులో ఎలాంటి పురోగతి లేదు. దీనికి యుపిఏతోబాటు ఎన్డీయే ప్రభుత్వానికీ బాధ్యత వుంది. రెండేళ్లయినా ఎన్డీయే ప్రభుత్వం దోషులను పట్టుకోలేకపోయింది. గతంలో ఎన్డీయే ప్రభుత్వ హయాంలో తెహల్కా కుంభకోణం బిజెపి అసలు స్వరూపాన్ని బయటపెట్టింది. ఇప్పుడు కూడా రక్షణ కొనుగోళ ్ల పేరుతో అదే ఇటాలియన్‌ కంపెనీతో ఒప్పందాలు కుదుర్చుకోవడం, ఇంకా అనేక విదేశీ కంపెనీల నుంచి పెద్దయెత్తున రక్షణ కొనుగోళ్లు చేపడుతున్న మోడీ సర్కార్‌ వీటిలో పారదర్శకతకు పాతరేసింది. తనది అవినీతి రహిత ప్రభుత్వమని, పారదర్శకత, జవాబుదారీకి ప్రతిరూపమని చెప్పుకునే మోడీ సర్కార్‌ దీనిపై ఎందుకిలా బెల్లం కొట్టిన రాయిలా వ్యవహరిస్తున్నదో చెప్పాలి. అగస్టా కుంభకోణంలో ఈ ప్రభుత్వం చితతశుద్ధితో నిజాయితీగా దర్యాప్తు జరిపించే సూచనలు కనిపించడం లేదు. మోడీ ప్రభుత్వానికి దీనిని రాజకీయం చేయడంపై వున్న శ్రద్ధ, ఈకేసులో దర్యాప్తును వేగవంతం చేసి దోషులను బోనులో నిలపడంపై లేదు. ఈ కేసులో దోషులను బయటకు లాగేందుకు సుప్రీం కోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరిపించాల్సిన అవసరముంది. 
అదే సమయంలో గుజరాత్‌ స్టేట్‌ పెట్రోలియం కార్పొరేషన్‌లో చోటుచేసుకున్న 20 వేల కోట్ల అవినీతికి కారకులను గుర్తించి న్యాయస్థానం ముందు నిలబెట్టాలి. కాగ్‌ నివేదికపై పార్లమెంటులో చర్చించేందుకు బిజెపి ఎందుకు వెనకాడుతోంది? ఈ అంశంపై సోమవారం రాజ్యసభలో ప్రతిపక్షాలు చర్చకు పట్టుబట్టినప్పుడు అగస్టా కుంభకోణాన్ని పక్కదారి పట్టించేందుకే కేజి బేసిన్‌ గ్యాస్‌ వ్యవహారాన్ని తీసుకొచ్చారని, కాగ్‌ నివేదిక గుజరాత్‌ పబ్లిక్‌ అకౌంట్స్‌ కమిటీకి సమర్పించింది కనుక పార్లమెంటులో దానిపై చర్చించడం సాంప్రదాయం కాదని మోడీ ప్రభుత్వం వాదించడం దాని అతి తెలివిని తెలియజేస్తోంది. కేజి బేసిన్‌లో అపారమైన ఇరవై ట్రిలియన్ల క్యూబిక్‌ అడుగుల గ్యాస్‌ కనుగొన్నామని, కెజి బేసిన్‌ నుంచి ఆ గ్యాస్‌ను గుజరాత్‌కు తరలించేందుకు పైపు లైన్‌ నిర్మాణానికి ప్రభుత్వ రంగ బ్యాంకుల నుంచి రూ.19, 716.27 కోట్ల మేర రుణాలను తీసుకున్న జిఎస్‌పిసి, ఆ తరువాత ఆ మొత్తాన్ని దుర్వినియోగం చేసిందని కాగ్‌ వెల్లడించింది. ప్రభుత్వ రంగ బ్యాంకుల నుంచి రుణాలు తీసుకోవడం, సహజ వనరు అయిన గ్యాస్‌ తరలింపులో అవకతవకలకు సంబంధించిన ఇంతటి కీలకమైన అంశంపై పార్లమెంటు చర్చించనక్కర్లేదనడం హాస్యాస్పదం. ఈ అవకతవకలు జరిగింది మోడీ హయాంలోనే గనుక వీటిపై ప్రధాని నోరు విప్పాలి. కాగ్‌ బయటపెట్టిన వాస్తవాలపై సిబిఐచే దర్యాప్తునకు ఆదేశించాలి. ప్రజా ధనం లూటీకి కారకులైనవారు ఎంతటివారైనా వదిలిపెట్టరాదు.