దొంగ చేతికే తాళాలిచ్చిన ఐరాస..

జెనీవాలోని సౌదీ అరేబియా దౌత్యవేత్త ఫైసల్‌-బిన్‌-హస్సాద్‌ ట్రాద్‌ ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కమిషన్‌ అధ్యక్షునిగా ఎన్నిక వటం ప్రపంచ దేశాలను విస్మయా నికి గురిచేశాయి. ఈ ఎన్నికను అభ్యుదయ ప్రజాస్వామికవాదులంతా నిరసన తెలియజేస్తు న్నారు. కానీ సౌదీ మిత్ర దేశమైన అమెరికా మాత్రం అభినందనలు తెలుపుతూ సంబరాలు తెలియజేసుకుంటు న్నది. సౌదీ అరేబియాకు మానవహక్కుల కమిషన్‌ అధ్యక్ష పదవి దక్కటమంటే దొంగచే తికి ఇంటి తాళాలిచ్చి కాపలాకాయమనడం తప్ప మరొకటి కాదు. జులైలోనే ఈ నిర్ణయం తీసుకున్నప్పటికీ గోప్యంగా ఉంచారు. ఈ విషయం సెప్టెంబరు 17 వరకు బయటి ప్రపంచా నికి తెలియదు. ఐక్యరాజ్యసమితి పత్రాల ఆధారంగా యుఎన్‌ వాచ్‌ అనే ఎన్‌జీఓ సంస్థ తెలియజేసింది. ఈ నియామకం ఐరాసకు కళంకంగా మారటం ద్వారా దాని విశ్వసనీయతను ప్రపంచ మీడియా ప్రశ్నిస్తోంది. రైఫ్‌ బడోవీ అనే సౌదీ బ్లాగర్‌ భావస్వతంత్ర స్వేచ్ఛలను ప్రశ్నించినందుకు వెయ్యి రాళ్ల దెబ్బలతో చంపారు. అయిదుగురు సభ్యులతో నూతనంగా ఎన్నికైన ఈ కమిటీ ప్రపంచ దేశాల మానవహక్కులకై పనిచేస్తూ ఆయా దేశాల్లో నిష్ణాతులను వెలికితీసి భాద్యతలను అప్పగిస్తుంది. యుఎన్‌ వాచ్‌ ఎగ్జిక్యూటివ్‌ హిల్లర్‌ నోయిర్‌ ''సౌదీ అరేబియా ప్రపంచంలో మత స్వేచ్ఛ, స్త్రీల హక్కుల విషయంలో చెడు స్థానాన్ని ఆక్రమించింది. ఇప్పటివరకూ మానవహక్కుల కమిషన్‌ కౌన్సిల్‌ సభ్య దేశంగా ఉన్నందుకే అవమానంతో తలదించుకున్నాం. ఇప్పుడు ఏకంగా ఆ కౌన్సిల్‌కు అధ్యక్షుని చేయడమంటే సౌదీ అరేబియా జైళ్లలో మగ్గుతున్నవారికి పుండుపై కారం చల్లినట్లే'' అంటున్నారు.
సౌదీలో మానవహక్కుల ఉల్లంఘన
సౌదీ అరేబియాలో స్త్రీలు పాస్‌పోర్టు పొందటం, ప్రయాణం చేయటం, వివాహంచేసుకోవడం, ఉన్నత విద్యను పొందడమనేది ఒక పురుష గార్డియన్‌ సమ్మతిలేకుండా సాధ్యంకాదని 2014 హెచ్‌ఆర్‌డబ్యు నివేదికలో పొందు పరచింది. ప్రపంచంలో ఎక్కడాలేని విధంగా సౌదీలో స్త్రీలు కార్లు నడపడం నిషేధం. వచ్చే డిసెంబర్‌లో జరిగే మునిసిపల్‌ ఎన్నికల్లో స్త్రీలకు ఓటుహక్కును వినియోగించుకునే అవకాశం కలిగించారు. ప్రజాస్వామ్యానికి మూలస్తంభమైన ప్రెస్‌ మీడియా స్వేచ్ఛలో ప్రపంచంలోని 180 దేశాల్లో సౌదీ అరేబియా 164 స్థానంలో ఉండటం గమనార్హం. సౌదీలోని సున్నీ టెర్రరిస్టు గ్రూపులకు విరాళాలిచ్చి, ప్రోత్సహించి అల్‌ఖైదా, ఐఎస్‌ఐఎస్‌ స్థాపనకు కారణమైంది. కేవలం ఏడు రోజుల వ్యవధిలో 19 మందిని దారుణంగా ఉరితీసిన ఘట నలు చోటుచేసుకున్నట్లు 2014 ఆగస్టులో హ్యూమన్‌రైట్‌ వాచ్‌ నివేదిక వెల్లడించింది. ఏటికేడు ఉరిశిక్షలలో రికార్డులను అధిగ మిస్తోంది. కాగా 2015 సెప్టెంబర్‌ నాటికి 134 మంది ఉరితీసి చంపబడ్డారు. ఇది ఇప్పటికే 2014 కంటే 44 మంది ఎక్కువ.
మధ్య ప్రాచ్య అశాంతిలో సౌదీ పాత్ర
2015 మార్చి నుంచి ధనికదేశమైన సౌదీ అరేబియా అతిపేద దేశమైన ఎమెన్‌పై బాంబుల వర్షం కురిపిస్తూనే ఉంది. ఇది చట్టవ్యతిరేక యుద్ధం. దీనికి ఐరాస అధికారం ఇవ్వలేదు. పాఠశాలలూ, విద్యాలయాలూ, ఆస్పత్రులూ, ప్రభుత్వ భవనాలూ, తాగునీటి సదుపాయాలనూ సర్వనాశనం చేస్తున్నది. లక్షలాది ఎమెనీయులు మానవీయ సహాయక చర్యల కోసం ఎదురుచూడవలసిన పరిస్థితులు ఏర్పడ్డాయి. నాజీ హిట్లర్‌ వలే ఎమెన్‌లో చారిత్రాత్మిక యూదులను హింసించి చంపుతున్నది. ఇవన్నీ ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్‌ దృష్టిలో యుద్ధ నేరాలుగా పరిగణించబడతాయి. మిలిటరీ స్థావరాలపై కాకుండా, సామాన్య ప్రజానీకంపై దాడులు చేస్తూ కేవలం అమెరికా ప్రోద్బలంతో కీలకమైన ఎర్రసముద్రం సూయిజ్‌ కెనాల్‌ ముఖద్వారమైన బాబ్‌ ఎల్‌ మండెబ్‌ జలసంధిపై కన్నేయడం దీనికి గల ప్రధాన కారణం. ఎమెన్‌లో ఇప్పటి వరకూ 4 వేలకు పైగా సామాన్య ప్రజానీకాన్ని బలిగొంది. సౌదీ అరేబియా 2003లో ఇరాక్‌పై జరిపిన దాడిలో కూడా పాల్గొంది. ప్రస్తుత ప్రపంచమంతా ఇరాక్‌పై జరిగిన యుద్ధాన్ని అమానుషంగా తేల్చి ఖండిస్తున్నది. ఇది అమెరికా విదేశాంగ విధానానికి పెద్ద మాయని మచ్చ. సిరియాలో జరుగుతున్న అంతర్యుద్ధాల కారణంగా లక్షలాదిమంది నిరాశ్రయులై శరణార్థులుగా విదేశాలకు వెళ్లి నూతన జీవితాన్ని కొనసాగించేందుకు ప్రయత్నిస్తుండగా, పక్కనే ఉన్న ధనిక గల్ఫ్‌ దేశమైన సౌదీ అరేబియా ఒక్క సిరియన్‌ శరణార్థిని కూడా రానివ్వలేదు. టర్కీ ఇప్పటి వరకూ 19 లక్షల మందికి ఆశ్రయం కల్పించింది. ''తాజాగా అమెరికా, ఇరాన్‌ కుదుర్చుకున్న అణు ఒప్పందం దృష్ట్యా మధ్య ప్రాచ్యంలో ఇరాన్‌ బలపడుతుందనీ, ఇరాన్‌కు ఆప్తమిత్రుడైన షియా నేత అస్సాద్‌ను సిరియాలో కూల్చేందుకు, శరణార్థులను టర్కీ నుంచి ఐరోపాకు పారద్రోలారని, ఇది సౌదీ, టర్కీ రహస్య ఎజెండా'' అని పోర్చుగల్‌ వెబ్‌సైట్‌ పుబ్లికో తాజాగా సమాచారాన్ని ఉంచింది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్న హిల్లరీ క్లింటన్‌ అరబ్‌ షేక్‌ల ధనసహాయంతోనే సిరియా ప్రభుత్వాన్ని కూల్చడానికి పథకం జరుగుతోందని అన్నారు. ఐరోపాకు సిరియా శరణార్థులను పంపటం ద్వారా ఒత్తిడికి గురైన యూరప్‌, అమెరికా దేశాలు సిరియాపై దాడులను ఉధృతంచేసి అస్సాద్‌ ప్రభుత్వాన్ని కూల్చడానికి కుట్రపన్నినట్లు తెలిపింది. కానీ రష్యా అధ్యక్షుడు పుతిన్‌ సిరియాకు అండగా నిలవడంతో కథ అడ్డంతిరిగి రష్యా, ఇరాన్‌, సిరియా ప్రభుత్వ నేతల ప్రమేయంలేనిదే రాజీసాధ్యంకాదని ఇప్పుడు అమెరికా గ్రహించక తప్పలేదు.
ఐరాస మానవహక్కుల వెబ్‌సైట్‌ ''ఐక్యరాజ్యసమితి మానవహక్కుల హై కమిషన్‌ (ఒహెచ్‌సిహెచ్‌ఆర్‌) అంతర్జాతీయంగా మానవాళి ఆత్మగౌరవాన్ని కాపాడుతూ మాకు ఇచ్చిన విలువైన అధికారాలతో అన్ని దేశాల్లోని మానవహక్కులను అభివృద్ధి పరుస్తాం'' అని ఉంది. యుఎన్‌ కార్టర్‌ 55లో మానవహక్కులకై అంతర్జాతీయ గౌరవం, జాతి, మత, భాష, కుల, వర్ణ వివక్షత లేని అందరికీ ప్రాథమిక స్వేచ్ఛ కల్పించటం ప్రధానధ్యేయంగా ఉంది. స్త్రీని అన్ని విధాలుగా అణగద్రొక్కే సౌదీ అరేబియాలో మానవహక్కులు ఏమాత్రం ఉన్నాయి? సౌదీ అరేబియాలో ప్రజాస్వామ్యం ఉందా? అక్కడ ప్రజాస్వామ్యంలేని రాచరికపు నియంత అబ్దుల్లా జిన్‌ ఇబిన్‌ వారసత్వాలు గడచిన ఎనిమిది దశాబ్దాల నుంచి రాజ్యమేలుతున్నాయి. పైగా ఈజిప్టులోని జనరక్తం పీల్చే నియంత సౌదీకి అత్యంత ఆప్తుడు. లక్షలాదిమంది మరణాలకు, కోట్లాది శరణార్థులకూ కారణమైన మధ్యప్రాచ్యంలోని యుద్ధాలకు సౌదీ అరేబియా అమెరికాకు మద్దతు ఇస్తూనే ఉంది. కనుక సౌదీ అరేబియా మానవ హక్కుల కమిషన్‌ అధ్యక్ష పగ్గాలు చేపట్టడం మానవహక్కుల ఉల్లంఘనే. భవిష్యత్తులో ఐరాస మానవహక్కుల కోసం సౌదీ అరేబియా, అమెరికాలతో కొత్త నిర్వచనాలు ప్రపంచ దేశాలలో వారికి అనుకూలంగా చెప్పినా ఆశ్చర్యపోనవసరంలేదు.
- బుడ్డిగ జమిందార్‌
(వ్యాసకర్త ఆలిండియా ప్రోగ్రెసివ్‌ ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షులు)