దొంగను ఊరేగించడమా?

టిడిపి ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి జైలు నుంచి బెయిల్‌పై బయటకు వస్తూ మాట్లాడిన మాటలు సభ్య సమాజం సిగ్గుపడేలా ఉన్నాయని, ఇకపై ఈ మాటలు మానకపోతే సహించేది లేదని మంత్రులు, ఎమ్మెల్యేలు హెచ్చరించారు. మంత్రులు మహేందర్‌రెడ్డి, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి వేరువేరుగా విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. చంద్రబాబు శిక్షణతో రేవంత్‌రెడ్డి పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారని రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి మండిపడ్డారు. మరోసారి ముఖ్యమంత్రి గురించి మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు. రేవంత్‌రెడ్డి కథ అయిపోయిందని అసలు కథ ముందుందని, ఈ కేసు నుంచి చంద్రబాబు తప్పించుకోలేరని అన్నారు.
ఎసిబికి రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయిన దొంగ ఎక్కువగా మాట్లాడుతున్నారని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి టిఆర్‌ఎస్ ఎల్‌పి కార్యాలయంలో జరిగిన విలేఖరుల సమావేశంలో విమర్శించారు. దేశం కోసం త్యాగం చేసిన నాయకులకు ఊరేగింపు నిర్వహించినట్టు పట్టుపడిన దొంగను ఊరేగించడం విడ్డూరంగా ఉందని అన్నారు. ఊరేగింపునకు రెండు కోట్ల రూపాయలు ఖర్చు చేశారని తెలిపారు. 30ఏళ్లపాటు కెసిఆర్‌పై పోరాటం చేస్తానని రేవంత్ అంటున్నారని, 30 ఏళ్లపాటు టిఆర్‌ఎస్ పార్టీనే అధికారంలో ఉంటుందని టిడిపి ఇప్పటికైనా గ్రహించిందని అన్నారు.
‘ఆకు రౌడీ వేషాలు ఆపు’
ఓటుకు నోటు కేసులో బెయిల్ లభించిన తరువాత టిడిపి నాయకులు హద్దు మీరి మాట్లాడుతున్నారని రోడ్లు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విమర్శించారు. రాజకీయ నాయకులు హుందాగా మాట్లాడాలి కానీ వీధి రౌడీల్లా మాట్లాడకూడదని అన్నారు. రేవంత్‌రెడ్డి ఆకు రౌడీ వేషాలు మానుకోవాలని హితవు పలికారు. రేవంత్ వ్యాఖ్యలు ప్రజాస్వామ్యానికి సిగ్గుచేటని, టిడిపి నేతలు స్వలాభం కోసం దిగజారి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. అద్దె మనుషులతో ఊరేగింపు నిర్వహించడం హీరోయిజం అనిపించుకోదన్నారు. మహాత్మాగాంధీ జైలు నుంచి విడుదలై వచ్చినప్పుడు కూడా ఇలా ఊరేగించి ఉండరని అన్నారు. బాబు తన స్వార్థం కోసం తెలుగు జాతి పరువు తీస్తున్నారని విమర్శించారు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే సహించేది లేదని టిడిపి నాయకులు నోరు అదుపులో పెట్టుకోవాలని టిఆర్‌ఎస్ ఎమ్మెల్యే జీవన్‌రెడి ఆగ్రహం వ్యక్తం చేశారు.