దేశంలో భయానక వాతావరణం నెలకొంది

రాజ్యాధికారం కోసం సంఫ్‌ుపరివార్‌ శక్తులు ఒక పథకం ప్రకారం మతోన్మాదాన్ని రెచ్చగొడుతున్నాయని జమ్మూ కాశ్మీర్‌ ఎమ్మెల్యే యూసఫ్‌ తరిగామి అన్నారు. డిసెంబర్‌ 6న బాబ్రీ మసీదు ఘటనతో పథకం ప్రారంభమై, గుజరాత్‌లో అల్లర్లు సృష్టి, దాద్రి ఘటన ఇవన్నీ ఒక వరుస క్రమంలో జరిపినవేనని చెప్పారు. ఆదివారం స్థానిక పాతబస్టాండ్‌ సెంటర్లోని ఉర్దూ బాలుర పాఠశాల ప్రాంగణంలో ఆవాజ్‌ సంఘం నిర్వహించిన లౌకిక ప్రజాస్వామ్య పరిరక్షణ సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. సదస్సుకు అవాజ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి అక్భర్‌ అధ్యక్షత వహించారు. తరిగామి మాట్లాడుతూ దేశంలో భయానక వాతావరణ నెలకొన్నదని చెప్పారు. గతంలో టెర్రిస్టులు దాడులను ధైర్యంగా ఎదుర్కొన్నామని, కానీ ఇప్పుడు మతోన్మాదం వల్ల భయపడాల్సి వస్తుందన్నారు. మన గుడిని చూస్తే ఎలాంటి పవిత్ర భావన కలుగుతుందో, ఎదుటి మతానికి చెందిన గుడిని చూసినా అదే భావన కలగాలని మతోన్మాదులను ఉద్దేశించి అన్నారు. డిసెంబర్‌6న బాబ్రీ మసీదు కూల్చివేత ఘటన ఒక మతానికి సంబంధించిన సమస్య కాదని, దేశ లౌకిక విధానానికి, ప్రజలందరికీ సంబంధించిన సమస్యని చెప్పారు. లౌకిక వాదం విషయంలో దేశ చరిత్రను డిసెంబర్‌6కు ముందు, తర్వాత అని చెప్పుకోవాల్సి వస్తుందన్నారు. బిజెపి అధికారం చేపట్టిన నాటి నుండి సంఫ్‌ుపరివార్‌ శక్తులు ముస్లింలనే కాకుండా క్త్రైస్తవులు, ఇతర మైనార్టీలు, హేతువాదులు, సాధారణ ప్రజల్ని కూడా హతమార్చుతున్నారన్నారు. ఏ ఆహారం తినాలనే విషయంలోనూ స్వేచ్చ లేకుండా పోయిందని, కేరళ భవన్‌లో బీఫ్‌ వండుతున్నారని పోలీసులు పరిశీలించిన ఘటన దేశ చరిత్రలోనే జరగలేదన్నారు. పాలకులు పార్లమెంట్‌లో దేశం బాగుండాలని ఉపన్యాసాలిస్తూ ఆచరణలో దానికి భిన్నంగా వ్యవరిస్తున్నారని మండిపడ్డారు. సచార్‌ కమిటీ నివేదిక ప్రకారం ముస్లింలు బాగా వెనుకబడి ఉన్నారని, ముస్లింల ఆర్థిక స్థితి గతుల్లో మార్పులు రాకుండా దేశాభివృద్ధి సాధ్యం కాదని స్పష్టం చేశారు.
రాష్ట్రంలో చంద్రబాబు బిజెపి పట్ల ఎప్పుడు ఎలా వ్యవహరిస్తారో ఎవరికీ అర్ధం కాదని, పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు బిజెపితో కలుస్తున్నాడని, లేనప్పుడు వారి విధానాల్ని వ్యతిరేకిస్తున్నాడన్నారు. ఎన్నికల్లో ఎంత అవలీలగా హామీలు ఇస్తున్నారో అధికారం చేపట్టాక అంతే వేగంగా రేషన్‌ కార్డులు రద్దు చేస్తున్నట్లు తెలిసిందని, దీని ప్రభావం పేదలపైనే అధికంగా ఉంటుందన్నారు. మంచి రోజులు మోదీకి వచ్చాయని, ప్రజలకు మాత్రం రాలేదన్నారు. ఆయన నిత్యం విదేశీ పర్యటనలు చేస్తూ విశ్రాంతి కోసం భారత దేశానికి వస్తున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో పలు లౌకిక సంఘాలు, రాజకీయ పార్టీలు వేర్వేరుగా పోరాటాలు చేసినా ఫలితం లేదని, ఐక్య పోరాటాల ద్వారానే మతోన్మాదుల చర్యలను అడ్డుకోగలమన్నారు. యుపిలో త్వరలో ఎన్నికలు రాబోతున్న దృష్ట్యా అక్కడ మతోన్మాదాన్ని రెచ్చగొట్టి లాభపడాలనే బిజెపి యత్నిస్తుందని, దీనిపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. భిన్న మతాలు, కులాలు, సంస్కృతులు, భిన్న వాతావారణ స్థితిగతులు అన్నీ కలిసినదే భారతదేశమని, దీన్ని విడదీయం ఎవరి తరం కాదని హెచ్చరించారు.