దేవినేని ఉమా మాట్లాడడేం:YV

సుబాబుల్‌ బకాయిలు తక్షణమే చెల్లించేలా మంత్రులు స్పందించకపోతే అఖిలపక్షం ఆధ్వర్యంలో ఆందోళన ఉధృ తంగా చేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వై.వెంకటేశ్వరరావు (వైవి) సూచించారు. కృష్ణాజిల్లా నంది గామ ఏఎంసి కార్యాలయం వద్ద సుబాబుల్‌ రైతులు చేస్తున్న ఆందోళన బుధవారానికి మూడోరోజుకు చేరింది. రైతులు వంటా వార్పూ నిర్వహించారు. వారి ఆందోళనకు మద్దతుగా వైవి ప్రసంగించారు. కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల రైతులకు ఎస్‌పిఎం కంపెనీ రూ.15కోట్లకు పైగా బకాయి పడిందన్నారు. నందిగామ, జగ్గయ్యపేట నియోజకవర్గాల్లోనే సుమారు రూ.9.5 కోట్ల బకాయిలు పేరుకుపోయినా పాలకులు స్పందించకపోవటం సిగ్గు చేటన్నారు. మూడు రోజుల నుండి రైతులు ఏఎంసి కార్యాలయం వద్ద ధర్నా చేస్తుంటే స్థానిక ప్రజాప్రతినిధులకు పట్టాదా అని ప్రశ్నించారు. మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నిత్యం సుబాబుల్‌ రైతుల పక్షాన నిలబడి పోరాడి ప్రస్తుతం స్పందించకపోవడం ఆశ్చర్యం కల్గిస్తోందన్నారు.