దేవాలయ భూముల నుంచి పేదలను తరిమేస్తున్న ప్రభుత్వం

 రాష్ట్రంలో వివిధ దేవాలయాల క్రింద మూడు లక్షల ఎకరాలకు పైగా సాగుభూమి ఉన్నది. ఇది కాకుండా పట్టణ ప్రాంతాల్లో ఇళ్ళ స్థలాలకు పనికొచ్చే భూములు కూడా ఉన్నాయి. ఈ భూములను కౌలుకు తీసుకొని వేలాది మంది పేదలు జీవనం సాగిస్తున్నారు. వీరు అసలు భూమిలేని నిరుపేదలు లేదా కొద్దిగా ఉన్న పేద రైతులు. దేవాలయ భూముల కౌలు రైతుల్లో అత్యధికులు బిసి, ఎస్‌సి ఎస్‌టి తరగతులకు చెందినవారే. ఒక వైపు పేదలు క్రమం తప్పకుండా కౌలు చెల్లిస్తూ సాగుచేసు కొంటుండగా మరోవైపు దేవాలయ భూములను ధనికులు ఆక్రమించుకొని కోర్టు లిటిగేషన్‌లో ఉన్నాయి. మరి కొందరు ధనికులు కౌలుకు తీసుకొని పేదలకు ఆ భూములకు అధిక కౌలుకు సబ్‌ లీజుకు ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో 2003లో చేసిన దేవాలయ భూముల కౌలు నిబంధనలకు సవరణలను ప్రతిపాదిస్తూ 2015 సెప్టెంబర్‌ 10న 341 జీవో విడుదల చేసింది. 30 రోజుల లోపు సూచనలు, అభ్యంతరాలకు గడువు ఇచ్చింది. వాస్తవానికి ఈ సవరణల వల్ల అన్యాక్రాంతమై పెద్దల చేతుల్లో ఉన్న భూమి పేదలకు కౌలుకు అందుబాటులోకి రావాలి. కానీ రాష్ట్ర ప్రభుత్వం దేవాలయ భూముల నుంచి పరోక్షంగా పేదలను తొలగించేలా ఈ భూములు పెద్దలు అన్యాక్రాంతం చేసేలా సవరణలు ప్రతిపాదించింది.
దశాబ్దాలుగా పోరాడి సాధించుకున్న హక్కులు
1983లో అధికారంలోకి వచ్చిన ఎన్‌టి రామారావు ప్రభుత్వం దేవాలయ భూముల సమస్యలపై సూచనలు చేయాలని జస్టిస్‌ చల్లా కొండయ్య కమిషన్‌ను నియమించింది. ఆ కమిషన్‌ దేవాలయ భూములను విక్రయించి వచ్చిన డబ్బును బ్యాంకుల్లో ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేయాలని, ఆ వచ్చిన వడ్డీతో దేవాలయాల నిర్వహణ చేయాలని సూచించింది. కౌలు రైతులు పెద్ద యెత్తున ఆందోళనలతో ప్రభుత్వ ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. 2005లో పేదలను తొలగించటానికి రాష్ట్ర ప్రభుత్వం 456 జీవోను జారీ చేసింది. దీనిపై రైతులు ఆందోళనలు, న్యాయ పోరాటం ద్వారా కొన్ని రక్షణలు పొందారు. 2.5 ఎకరాలు మాగాణి లేదా 5 ఎకరాలు మెట్ట, నెలకు వెయ్యి రూపాయల లోపు ఆదాయం ఉన్నవారిని తొలగించకుండా రక్షణ కల్పించబడింది. వారికి భూములు కొనుగోలు చేసుకొనే అవకాశం కల్పించారు. కౌలు రేటులో మూడింట రెండు వంతు కౌలు చెల్లించవచ్చు.
ఈ సవరణలు పేదల పాలిట గుదిబండలు
ప్రభుత్వం విడుదల చేసిన 341 జీవోలో 11 సవరణలు ప్రతిపాదించింది. వీటిలో రెండు సవరణలు (6, 11) వివరణకు, నిబంధనలు మార్పు చేయటానికి అవకాశం కల్పించటానికి ఉద్దేశించినవి. మిగిలిన తొమ్మిది సవరణలు కీలకమైనవి. ఇవి అత్యధికం కౌలు రైతులకు వ్యతిరేకంగానే ఉన్నాయి. అంతే గాక దేవాలయ భూములు పెద్దల చేతుల్లోకి వెళ్ళటానికి పరోక్షంగా దోహదకారిగా ఉన్నాయి.
దేవాలయ భూముల కౌలు రైతులు దీర్ఘకాలం పోరాడిన ఫలితంగా భూమిలేని కౌలుదారులకు రక్షణ ఏర్పడింది. ప్రస్తుత సవరణ ప్రకారం ప్రతిమూడు సంత్సరాలకు ఒకసారి కౌలురైతు ఆర్థిక పరిస్థితిని పరిశీలించి భూమిలేని వారు అవునో, కాదో నిర్ధారించాలి. ఈ పేరుతో కౌలురైతులను తొలగించే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్‌ ధార్మిక, హిందూమత సంస్థలు, ధర్మాదాయ చట్టం 1987 సెక్షన్‌ 82 ప్రకారం గుర్తింపు పొందిన కౌలు రైతులు తాము కౌలుచేస్తున్న దేవాలయ భూములను మార్కెట్‌ రేటులో 75 శాతం ధరకు కొనుగోలుచేసుకోవచ్చు. ఆ మొత్తాన్ని నాలుగేళ్ళలో నాలుగు సమాన వాయిదాలలో 6 శాతం వడ్డీతో చెల్లించాలి. కొనుగోలు చేయటానికి సిద్ధపడకపోతే మార్కెట్‌ కౌలులో 2/3వ వంతు కౌలు చెల్లించి ఆ భూములను సాగుచేసుకోవచ్చు. కాని తాజాగా దేవాలయ భూములపై శాశ్వత హక్కులు కల్పించటాన్ని నిషేధించింది. దీర్ఘ కాలంగా కౌలుకు చేసుకొంటున్నవారు ప్రతి మూడు సంవత్సరాలకొకసారి చర్చల ద్వారా కౌలు రివైజ్‌ చేసుకొనే అవకాశం ఉంది. తాజాగా టెండర్ల ద్వారా లేదా బహిరంగ వేలం ద్వారానే కౌలును నిర్ణయించాలి. దీని వల్ల పేద రైతులకు అన్యాయం జరుగుతుంది. కౌలును నగదు రూపంలోనే నిర్ణయిస్తారు. కౌలును ముందుగానే చెల్లించాలి. దీని వల్ల కౌలురైతులు తీవ్రంగా నష్టపోతారు. ఇప్పటివరకు పంట రూపంలో కౌలును చెల్లిస్తున్నారు. ముందుగానే నగదు చెల్లించటం అంటే పేదలు అప్పులు తెచ్చి కౌలు చెల్లించాలి. ఇది కౌలు రైతుకు భారంగా మారుతుంది. ముందుగానే నగదు రూపంలో కౌలు చెల్లించటం వల్ల రైతు ప్రకృతి వైపరీత్యాలు వచ్చినపుడు ఉపశమనం పొందే అవకాశం కోల్పోతాడు. బహిరంగ వేలం అయినా లేదా టెండర్ల ద్వారా అయినా దేవాలయ భూముల కౌలు మిగతా వాటికంటే ఎక్కువగా ఉంటుంది. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం చేసిన రక్షిత కౌలుదారీ చట్టం 1956 ప్రకారం మాగాణి భూమి అయితే పండిన పంటలో 30 శాతం గానూ, మెట్ట అయితే 25 శాతంగానూ కౌలు వసూలు చేయాలి. దీన్ని దేవాలయ భూములకు వర్తింపజేయాలి. ఇప్పటివరకు దేవాలయ భూములను అన్ని మతాల వారూ కౌలుకు తీసుకునే అవకాశం ఉంది. కానీ కేవలం హిందువులకు మాత్రమే ఇస్తాననడం రాజ్యాంగ స్ఫూర్తికే విరుద్ధం. లీజు సకాలంలో చెల్లించలేక పోతే కౌలు రైతులను పోలీసుల సహాయంతో తొలగించే అవకాశం ఉంది. బకాయిలు చెల్లించకపోయినా, కౌలు రైతు భూమిలో ఉంటే నాన్‌బెయిలబుల్‌ కేసులు పెట్టి వారి నుంచి బకాయిలు రాబట్టుకోవాలి. అలాగే కౌలు పాడిన వెంటనే చెల్లించకపోయినా తరువాతి సంవత్సరం నెల ముందుగా కౌలు చెల్లించలేక పోయినా తక్షణమే అతణ్ణి తొలగించి తిరిగి బహిరంగ వేలం లేదా టెండర్‌ ద్వారా కొత్త వారికి కౌలుకిస్తారు. కౌలు గడువు తీరిన తర్వాత కౌలుదారు ఆ భూమిలోనే కొనసాగితే కౌలుదారీ చట్టం ప్రకారం ఆ కౌలు రైతుపై చర్యలు తీసుకోవాలని 1987 చట్టం చెబుతుండగా ఇప్పుడు దాని స్థానంలో నోటీసు ఇచ్చిన ఏడు రోజుల్లో కౌలు రైతులు భూమిని స్వాధీనం చేయకపోతే పోలీసుల సహాయంతో వారిని తొలగించటానికి అవకాశం కల్పించారు.
పేదలకు రక్షణ కల్పించే సవరణలు తేవాలి
దేవాలయ భూములను పేదలు సాగుచేసుకోవటానికి అవకాశం కల్పించాల్సింది పోయి ఈ పద్ధతిలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించటం సరైంది కాదు. కౌలును నిర్ణయించే పద్ధతిలోనూ, కౌలు రైతులను గుర్తించే పద్ధతిలోనూ దేవాలయ భూములకు 1956 రక్షిత కౌలుదారీ చట్టం గానీ, కౌలుదారులకు రుణ గుర్తింపు కార్డుల చట్టంగానీ వర్తించవు. తాము చేసిన చట్టాలనే ప్రభుత్వ ఆధీనంలోని దేవాలయ భూములకు వర్తించకుండా చేయటం సరైంది కాదు. వేలం పాటల ద్వారా భూములు కోల్పోతున్నామనే ఆందోళనతోనే ఈ కాలంలో గుంటూరు జిల్లాలో కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకొన్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం చేయతలపెట్టిన ఈ సవరణలు పేదలను భూముల నుంచి తరిమేసేవిగా ఉన్నందున వీటిని ఉపసంహరించుకోవాలి. భూమిలేని కౌలుదారుగా గుర్తింపు పొందిన పేద కౌలుదారులకు పూర్తి రక్షణ కల్పించాలి. సబ్‌ లీజు దారులందరినీ పేద కౌలుదారులుగా గుర్తించి వీరికి కూడా 2/3వ వంతు కౌలు అమలు పర్చాలి.
పెద్దల ఆక్రమణలో ఉన్న వాటిని స్వాధీనం చేసుకొని గ్రామసభల ద్వారా పేదలకు కౌలుకివ్వాలి. దేవాలయ భూములకు కౌలు రైతుల చట్టాలు వర్తింపజేయాలి. తద్వారా దేవాలయ భూములకు, పేదలకు రక్షణ ఏర్పడుతుంది. లక్షలాది కుటుంబాలకు జీవనం కల్పించే పద్ధతిలో రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచించాలి. మానవ సేవే మాధవ సేవ అని రాష్ట్ర ప్రభుత్వం మరవరాదు. పేదల జీవనాన్ని దెబ్బతీసే ఈ సవరణలకు వ్యతిరేకంగా రైతుసంఘాలు, కౌలు రైతులు ఉద్యమించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

- - జె ప్రభాకర్‌ 
(వ్యాసకర్త రైతు సంఘం కృష్ణా జిల్లా కార్యదర్శి)