దుర్మార్గపు వ్యాఖ్యలు..

కార్మిక సంఘాలను, కార్మికుల న్యాయమైన కోర్కెలకు మద్దతిచ్చే పార్టీలను, సంస్థలను ఉక్కుపాదంతో అణచి వేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ఇటీవల విశాఖపట్నంలో చేసిన వ్యాఖ్యలు అత్యంత దుర్మార్గపూరితమైనవి. రాష్ట్ర ప్రభుత్వాధిపతిగా కార్మికుల హక్కులను పరిరక్షించాల్సింది పోయి యాజమాన్యాల దోపిడీకి వకాల్తా పుచ్చుకోవడం దారుణం. ట్రేడ్‌ యూనియన్లపై విషం కక్కిన బాబు తమ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక, పెట్టుబడిదారుల అనుకూలమని కుండబద్దలు కొట్టారు. పారిశ్రామిక అభివృద్ధికి కార్మిక సంఘాలు అడ్డంకిగా మారాయని స్వయంగా ముఖ్యమంత్రే వక్కాణించడం అక్కసును తెలుపుతుంది. యూనియన్లు పరిశ్రమల ఉనికికే ప్రమాదంగా మారాయనడం వాక్‌చాపల్యమే. రాజకీయ పార్టీలపైనా బాబు అవాకులు చెవాకులు పేలడం అసహనానికి పరాకాష్ట. కొన్ని పార్టీలు యూనియన్లను అడ్డం పెట్టుకొని ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతున్నాయనే స్థాయికి సిఎం దిగజారడాన్ని చూస్తుంటే అసలు ప్రజాస్వామ్యంలోనే ఉన్నామా అనిపిస్తుంది. అక్కడితోనే ముఖ్యమంత్రి ఆగ్రహం చల్లారలేదు. యూనియన్ల వలన శాంతిభద్రతలకు విఘాతం కలుగుతోందని, పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటారని హెచ్చరికలు జారీ చేసి నియంతృత్వ, నిర్భంద ధోరణిని బయటపెట్టారు. తాను అధికారంలోకొచ్చింది ప్రజాస్వామ్య ప్రక్రియ ద్వారా అనే విషయాన్ని బాబు మర్చిపోయినట్లున్నారు. ప్రాంతీయపార్టీ నుంచి జాతీయ పార్టీగా ఎదిగిందంటున్న టిడిపిని నడుపుతున్నామని, ప్రజలు ఓట్లేస్తేనే ఎపిలో అధికారంలోకొచ్చామని విస్మరించి, తానేదో ఆకాశం నుంచి ఊడి పడ్డట్లు భ్రమ పడుతున్నట్లున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కార్మికుల ఆందోళనలకు మద్దతు తెలిపిన బాబు, గద్దెనెక్కగానే నియంత మాదిరిగా నిరసనలను, ఆందోళనలను అణగతొక్కాలని చూడటం ఏం నీతి? 
ఎన్నికలకు ముందు తాను మారిన మనిషినని, ప్రజలు నమ్మాలని ప్రాధేయపడ్డ చంద్రబాబు, అధికారంలోకి రాగానే చేపట్టిన చర్యలతో ఏ మాత్రం మారలేదని రూఢ చేశారు. మనిషే కాదు బుద్ధి కూడా మారలేదని విశాఖలో చేసిన కార్మిక వ్యతిరేక వ్యాఖ్యలతో పక్కాగా నిరూపించుకున్నారు. ప్రజలు తెలుగుదేశం పార్టీని పదేళ్లు ప్రతిపక్షంలో ఉంచడానికి ప్రధాన కారణం అంతకుముందు తొమ్మిదిన్నరేళ్లలో అమలు చేసిన ప్రజా వ్యతిరేక విధానాలే. సుదీర్ఘ విరామం అనంతరం అధికారంలోకొచ్చిన టిడిపి అధినేత, గతంలో చేసిన తప్పులకు లెంపలేసుకోవాల్సింది పోయి జనం ఛీకొట్టిన విధానాలనే మళ్లీ అమలు చేయాలని తహ తహలాడుతున్నారు. సిఎం కుర్చీలో కూర్చున్నది మొదలు జపాన్‌, సింగపూర్‌ పర్యటనల్లో తమ వద్ద చాలా ఫ్రీగా దోపిడీ చేసుకోవచ్చని కార్పొరేట్లకు భరోసా ఇచ్చి వస్తున్నారు. ట్రేడ్‌ యూనియన్లతో ఇబ్బంది లేదని హామీలిస్తున్నారు. కార్మిక సంఘాలు రోడ్లమీదికొస్తే పారిశ్రామికవేత్తలు పెట్టుబడులెలా పెడతారని కొన్ని మాసాల క్రితం అదీ హుదూద్‌ తుపాను భీభత్స సమయంలో విశాఖలో ప్రవచించారు. ఇప్పుడు ఏకంగా కార్మిక సంఘాలను నిలువరిస్తామని, సహించేది లేదనే స్థాయికి ఎదిగారు. తమ పార్టీ అనుబంధ సంఘాన్ని ఆందోళనలు చేయనీకుండా నియంత్రిస్తామనే స్థాయికి దిగజారారు. సిఎం వ్యాఖ్యలపై టిడిపి అనుబంధ సంఘం తేల్చుకోవాలి. కార్మిక సంఘాలు న్యాయమైన డిమాండ్ల కోసం ఆందోళనలు చేస్తుంటే, తెలుగుదేశం నాయకులు యాజమాన్యాలతో లాలూచీపడి పడుతున్నారని సిఎం సమీక్షలోనే వెల్లడైంది. దీన్నిబట్టి అధికారపార్టీ వైఖరేమిటో అర్థమైపోతుంది. 
పైన మోడీ, కింద చంద్రబాబు ఇద్దరూ కార్మికులంటే చాలు ఇంతెత్తున ఎగిరిపడుతున్నారు. విదేశీ కార్పొరేట్లను సంతృప్తి పర్చేందుకు కార్మికులు పోరాడి సాధించుకున్న చట్టాలను సమూలంగా మార్చేస్తున్నారు. ట్రేడ్‌ యూనియన్‌ పెట్టొద్దనడానికి సిఎంకు ఏం హక్కుంది? రాజ్యాంగం కల్పించిన ప్రాధమిక హక్కులను కాలరాయడం అతి పెద్ద నేరం. ప్రభుత్వాధినేతే కార్మికులకు వ్యతిరేకంగా మాట్లాడితే పోలీసులు ఊరికినే ఉంటారా? ఇప్పటికే కార్మిక శాఖ చేతులు కట్టేసుకుంది. మేనేజ్‌మెంట్‌ శాఖగా మార్చేశారు. ఆ శాఖలో ఉన్న అవినీతి మరెక్కడా లేదు. పరిశ్రమల్లో జరుగుతున్న ప్రమాదాలకు యాజమాన్యాల నిర్లక్ష్యమే కారణమని నిర్ధారణ అయినా చర్యల్లేవు. ఒక్క విశాఖలోనే ఉక్కు కర్మాగారంలో, ఫార్మా సెజ్‌ల్లో కార్మికులు నిలువునా ఆహుతైనా సర్కారుకు పట్టట్లేదు. కార్మికుల సంక్షేమానికి ఎన్ని కోట్లయినా ఖర్చు చేస్తామంటున్న సిఎంకు కనీసం చనిపోయిన కార్మికులను పరామర్శించడానికి మనసు రాలేదు. మున్సిపల్‌ కార్మికుల సమ్మె, స్కీం వర్కర్ల ఆందోళనలు, ట్రేడ్‌ యూనియన్‌ బంద్‌ సమయాల్లో ప్రభుత్వ నిర్భందం అంతా ఇంతా కాదు. సంపద సృష్టించేది కార్మికులే. వారు లేకుండా అభివృద్ధిని పరుగులు పెట్టించడం సాధ్యం కాదు. వారిని విస్మరిస్తే గతంలో పట్టిన గతే పడుతుంది. ఇప్పటికైనా కార్మిక వ్యతిరేక వ్యాఖ్యలను ముఖ్యమంత్రి ఉపసంహరించుకోవాలి. ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించే సిఎం వ్యాఖ్యలను ప్రతి ఒక్కరూ ఖండించాలి.