దుర్మార్గం..

హాస్టళ్ల సమస్యలు పరిష్కరించాలని కోరిన విద్యార్థులపై విశాఖలో రాష్ట్ర ప్రభుత్వం పోలీసులను ఉసిగొల్పిన తీరు దుర్మార్గం. ఏ మాత్రం కనికరం లేకుండా పోలీసులు విరుచుకు పడిన తీరే పైనుండి అందిన ఆదేశాలకు నిదర్శనంగా నిలుస్తోంది. అసాంఘిక శక్తులతోనూ, శత్రు సమూహాలతోనూ వ్యవహరించినట్లు పోలీసులు విద్యార్థుల పట్ల వ్యవహరించారు. విద్యార్థినులను సెల్‌ ఫోన్లో చిత్రీకరించడం, చున్నీలు గుంజడం, జుట్టు పట్టి లాగడం వంటి చర్యలు పోలీసుల అనాగరిక స్వభావాన్ని వెల్లడిస్తున్నాయి. ఇష్టం వచ్చినట్లు లాఠీఛార్జీ చేయడం, సొమ్మసిల్లి పడిపోయిన వారిని కూడా బూటు కాళ్లతో తొక్కడం, బలవంతంగా వ్యాన్‌లలో ఎక్కించిన తరువాత కూడా పిడిగుద్దులకు దిగడం వంటి చర్యలు ఏ నాగరికతకు వారసత్వమో పోలీసు అధికారులు, వారిని వెనక నుండి నడిపించిన రాజకీయ బాస్‌లే చెప్పాలి! విద్యార్థులు ఏ దశలోనూ హింసాత్మక చర్యలు దిగలేదు. శాంతియుతంగా ప్రదర్శన, సభ నిర్వహించారు. అంతే శాంతియుతంగా కలెక్టర్‌కు వినతిపత్రం ఇవ్వడానికి వెడుతున్న విద్యార్థులను అడ్డుకోవడం, లాఠీలు ఝుళిపించడం ఎందుకో అర్ధంకాని పరిస్థితి. అమానుష హింసాకాండపై నిరసన తెలపుతున్న విద్యార్థులపై బుధవారం సైతం విరుచుకుపడటం బరితెగింపునకు నిదర్శనం. 
నిజానికి తమ సమస్యలను ప్రభుత్వ యంత్రాంగానికి నివేదించడం, వాటిని పరిష్కరించమని కోరడం ఈ దేశంలో ప్రజలకున్న అతి సాధారణ హక్కు! అదే పని చేయడానికి ప్రయత్నించిన విద్యార్థులపై హింసాకాండకు దిగడం ద్వారా పోలీసులు, వారిని ఆచర్యకు ప్రేరేపించడం ద్వారా ప్రభుత్వ పెద్దలు రాజ్యాంగాన్ని అడ్డదిడ్డంగా ఉల్లంఘించారు. 
హాస్టళ్లకు సొంత భవనాలు. తాగునీరు, మరుగుదొడ్లు, ప్రభుత్వం నిర్దేేశించిన మెనూ ప్రకారం భోజనం వంటి విద్యార్థులు లేవనెత్తిన సమస్యలు పరిష్కరించలేనంత పెద్దవి కావు. ఈ అంశాలు లేవనెత్తడం ద్వారా ఒళ్లు చితక బొడిపించుకోవాల్సిన నేరమూ వారు చేయలేదు. వీటిని కూడా అప్పటికప్పుడు లేవనెత్తి తక్షణమే పరిష్కరించాలనీ డిమాండ్‌ చేయలేదు. కొన్ని సంవత్సరాలుగా ఇవే సమస్యలను విద్యార్థి లోకం ప్రస్తావిస్తోంది. క్యాలెండర్లో సంవత్సరాలు మారడం తప్ప సమస్యల పరిష్కారానికి పాలకవర్గం ఏనాడూ చిత్తశుద్ధితో చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. ఎప్పటికప్పుడు మాటలు చెప్పడం, ఆచరణలో శూన్య హస్తం చూపించడం అలవాటుగా మారింది. భావి భారత పౌరులకు నిలయాలైన విద్యా సంస్థలు, వసతి గృహాలపై ఏళ్ల తరబడి చూపిన ఈ నిర్లక్ష్యమే విద్యార్థుల ఆగ్రహానికి కారణం. ఎన్నికల ముందు అందరికీ ఇచ్చినట్లుగానే విద్యార్థులకూ తెలుగుదేశం పార్టీ హామీల వర్షం కురిపించింది. అరచేతిలో స్వర్గం చూపింది. అధికారంలోకి వచ్చిన తరువాత కార్పొరేట్‌ నేతలను ముందు పెట్టుకుని ప్రభుత్వ విద్యా రంగాన్ని విస్మరించింది. ఈ నేపథ్యంలో విద్యా సంవత్సరం ప్రారంభంలోనే ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో ఏళ్ల తరబడి ఉన్న సమస్యలు ప్రస్తావిస్తూ అధికారులకు వినతిపత్రాలు ఇచ్చారు. ధర్నాల వంటి నిరసన కార్యక్రమాలు చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ సైకిల్‌ యాత్రలు నిర్వహించి ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, హాస్టళ్లలో తిష్ఠ వేసిన సమస్యలను వెలుగులోకి తెచ్చే ప్రయత్నం చేశారు. ఇంత చేసినా చెవిటివాని ముందు శంఖం ఊదినట్టు కావడం, ప్రభుత్వ యంత్రాంగంలో నామమాత్రపు స్పందన కూడా లేకపోవడంతో జిల్లా కలెక్టర్‌కు నేరుగా సమస్యలు నివేదించాలని విశాఖ ఎస్‌ఎఫ్‌ఐ పిలుపునిచ్చింది. ఇటీవల ఎన్నడూ లేనంతగా విద్యార్థులు కదలడమే హాస్టళ్ల సమస్యల తీవ్రతకు నిలువెత్తు నిదర్శనం. ఈ కదలిక తరువాతైనా కళ్లు తెరచి, సమస్యలు పరిష్కరించాల్సిన ప్రభుత్వం, దానికి భిన్నంగా దమనకాండకు దిగడం పాశవికత తప్ప మరొకటి కాదు. 
రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత కార్పొరేట్‌ కళాశాలల్లో విద్యార్థుల ఆత్మహత్యలు విపరీతంగా పెరిగాయి. వీటి నిరోధానికి చర్యలు తీసుకోకపోగా, అస్మదీయులకు ఒక న్యాయం, ఇతర పార్టీల వారికి మరో న్యాయం అన్న విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోంది. ఇంటిలో విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంటే ప్రకాశం జిల్లా బివిఎస్‌ ఇంజనీరింగ్‌ కళాశాల ఛైర్మన్‌, వైఎస్‌ఆర్‌సిపి నేత బూచేపల్లి సుబ్బారెడ్డిని అరెస్ట్‌ చేసిన ప్రభుత్వం, రాష్ట్ర మంత్రి నారాయణ కళాశాలలో విద్యార్థులు పిట్టల్లా రాలిపోతున్నా, ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం రిషితేశ్వరి ఆత్మహత్యలో ప్రిన్సిపాల్‌ బాబూరావు ప్రమేయం ఉందని ప్రభుత్వ కమిటీయే తేల్చినా చర్యలు తీసుకోకపోవడం దేనికి సంకేతమో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మరోవైపు విద్యార్థులపైనా, వారి హక్కులపైనా సర్కారీ దాడులు పెరుగుతున్నాయి. ప్రైవేటు విశ్వవిద్యాలయాలకు వ్యతిరేకంగా ప్రదర్శన చేసిన విద్యార్థులపై విజయవాడలో పోలీసులు వెంటపడి దాడి చేశారు. నారాయణ కళాశాలల్లో ఆత్మహత్యలపై ఆందోళనకు దిగిన ఎస్‌ఎఫ్‌ఐ విద్యార్థులను కడపలో ఏడు రోజుల పాటు జైలులో నిర్బంధించారు. రిషితేశ్వరీ ఆత్మహత్యపై నిరసన స్వరం వినిపించిన వారిపై గుంటూరులో పాశవికంగా దాడి చేశారు. తిరుపతి వేంకటేశ్వర విశ్వవిద్యాలయం, పశ్చిమగోదావరి జిల్లాలోనూ నిర్బంధకాండ చోటు చేసుకుంది. ఇటువంటి వాటినెన్నింటినో ఎదుర్కొని పోరాటాలు చేసిన చరిత్ర రాష్ట్ర విద్యార్థిలోకానిది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా నియంతృత్వ ధోరణికి స్వస్తి పలకక పోతే, యావత్‌ విద్యార్థి లోకం ఆగ్రహానికి గురికాక తప్పదు. ప్రభుత్వ పెద్దలకు ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా కార్పొరేట్‌ రంగానికి వంత పాడటం మాని ప్రభుత్వ విద్యా సంస్థల్లోనూ, వసతి గృహాల్లోనూ ఉన్న సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి. విశాఖలో అమానుషకాండకు బాధ్యులైన వారిపై తక్షణం చర్యలు తీసుకోవాలి.