'దివీస్‌' బాధిత సాగుదారులకు నష్టపరిహారమివ్వాలి

                 భీమిలి మండలంలోని దివీస్‌ లేబొరేటరీస్‌ స్వాధీనం చేసుకున్న భూములకు సంబంధించి బాధిత భూ సాగుదారులకు తక్షణమే నష్టపరిహారం చెల్లించాలని సిపిఎం డిమాండ్‌ చేసింది. సమస్య పరిష్కారమయ్యే వరకూ ఆ భూముల్లో ఎటువంటి నిర్మాణాలు చేపట్టకుండా చర్యలు తీసుకోవాలని కోసింది. ఈ మేరకు సిపిఎం జిల్లా కార్యదర్శి కె.లోకనాధం, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎస్‌.రమేష్‌, జిల్లా కమిటీ సభ్యులు వివి.శ్రీనివాసరావులు గురువారం జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎన్‌.యువరాజ్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఆ వివరాలు....
దివీస్‌ లేబొరేటరీస్‌ భూ సమస్య, కాలుష్యం, ఇతర సమస్యలపై ఫిబ్రవరి 22న మీకు విన్నవించాం. నాలుగు పంచాయతీల్లోని 17 గ్రామాలకు చెందిన 16 వేల మంది ప్రజల సమస్యపట్ల మీరు సానుకూలంగా స్పందించారు. అయితే గతంలో మీ ముందు ఉంచిన సమస్యల పరిష్కారానికి కంపెనీ యాజమాన్యం కనీస చర్యలు తీసుకోలేదు. అందువల్ల ఈ విషయంలో కలుగజేసుకొని సమస్యను పరిష్కరించాలని కోరుతున్నాం. 
మాన్సాస్‌ భూములను సాగుచేసుకున్న కుటుంబాలకు ఎటువంటి పరిహారం ఇవ్వకుండానే దివీస్‌ కంపెనీ గోడ నిర్మాణానికి ఆ భూములను స్వాధీనం చేసుకుంది. ఈ భూములపై సాగుదారులకు హక్కుపత్రాలున్నాయి.
- భీమిలి మండలం కంచేరుపాలెం గ్రామానికి చెందిన 13 మంది రైతులు తాత ముత్తాతల కాలం నుండి ఈ భూములను సాగు చేసుకుంటున్నారు. సర్వే నెంబర్‌ 172లోని 2.26 ఎకరాలు మజ్జి పాపారావు కుమారుడు పాపారావు, ఉప్పిలి బంగారప్ప భార్య సూరమ్మ, సర్వే నెంబర్‌ 172/3లో 76 సెంట్లు పంచదార్ల తాత కుమారుడు గురన్న, కొండ్రు రాములు భార్య అప్పయ్యమ్మ, కొండ్రు అప్పన్న భార్య చిన్నమ్మ, కొండ్రు సుత్తన్న భార్య సన్నమ్మ, పిన్నింటి రామస్వామి కుమారుడు రామస్వామి, నమ్మి రామస్వామి కుమారుడు తాత తదితరుల సాగులో ఉన్నాయి. ఈ భూముల్లో కూరగాయలు, కొబ్బరి వగైరా పంటలు సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. 
- ఆ భూములపై సాగుదారులకు ప్రభుత్వం పట్టాలు కూడా ఇచ్చింది. ప్రభుత్వ అడంగల్‌లో వీరి పేర్లు నమోదయ్యాయి. పట్టాదారు పాసుపుస్తకాలు మంజూరు చేసింది. వీరంతా బడుగు, బలహీనవర్గాలకు చెందిన వారు. ఈ భూమి తప్ప వేరే బతుకు తెరువు లేదు. ఈ భూము కోల్పోతే జీవచవాళ్లగా బతకాల్సిన దుస్థితి. ఇటీవల కాలంలో ఈ భూములు మాన్సాస్‌ ట్రస్టుకు చెందినవని బోర్డులు పెట్టారు. ఈ భూములను సాగు చేస్తున్న రైతులకు కనీసం సమాచారం కూడా తెలియజేయలేదు. ఇప్పుడు ఆ భూములను వుడా స్వాధీనం చేసుకొని ఆక్షన్‌ వేసింది. ఆ ఆక్షన్‌లో దివీస్‌ మేనేజ్‌మెంట్‌ కొనుగోలు చేసినట్లు చెబుతున్నారు. రైతుల భూముల్లో దివీస్‌ యాజమాన్యం ప్రహరీ నిర్మాణం చేపడ్డడంతో బాధిత 
రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. నష్టపరిహారం అడిగితే మాన్సాస్‌కు ఇచ్చాం వారి వద్ద తీసుకొండి అని చెబుతున్నారు. 
- మాన్సాస్‌ భూములకు సంబంధించి రీ సర్వే నిర్వహించాలన్న కలెక్టర్‌ ఆదేశాలను స్థానిక అధికారులు పాటించలేదు. భూ సమస్య పరిష్కారమయ్యే వరకు ప్లాంట్‌ విస్తరణ పనుల్లో భాగంగా నిర్మిస్తున్న ప్రహరీ నిర్మాణం ఆపాలి. సామాజిక, పర్యావరణ ప్రభావంపై సర్వే చేయించాలి.
- దివీస్‌ ల్యాబ్స్‌ చుట్టూ వున్న గ్రామాలకు చెందిన అర్హులైన వారందరికీ పర్మినెంట్‌ ఉద్యోగాలు ఇవ్వాలి. కార్మికులందరికీ కనీస వేతనాలు, పిఎఫ్‌, ఇఎస్‌ఐ లాంటి చట్టాలను వర్తింపజేయాలి. స్థానికులకు ఉపాధిపై ప్రభుత్వ మోనటరింగ్‌ కమిటీ ఏర్పాటు చేయాలి. 
- దివీస్‌ ల్యాబొరేటరీ వల్ల చుట్టు పక్కల ఉన్న 17 గ్రామాల ప్రజలు కాలుష్యంతో తీవ్రంగా బాధపడుతున్నారు. స్థానికులకు ఉపాధి కల్పించడం లేదు. సిఎస్‌ఆర్‌ నిధులను కూడా బాధిత గ్రామాలకు పూర్తిస్థాయిలో ఖర్చు చేయడం లేదు. ఈ సమస్యలపై చర్చించేందుకు జాయింట్‌ మీటింగ్‌ ఏర్పాటు చేయాలి. 
- కాలుష్యం వల్ల మత్స్య సంపద నాశనమై అన్నవరం గ్రామస్తులంతా వలసలు పోతున్నారు. ఈ గ్రామ ప్రజలకు ప్రత్యేక ఉపాధి చూపించవలసిన బాధ్యత కంపెనీ యాజమాన్యంపై ఉంది. యఫిలెంట్‌ ట్రీట్‌మెంట్‌ (శుద్ధి కర్మాగారాలు) తగినన్ని ఏర్పాటు చేసి కాలుష్యాన్ని సముద్రంలోకి వదలకముందే శుద్ధి చేయాలి.
- కంపెనీకి ఎదురుగా ఉన్న కంచేరుపాలెం గ్రామం చుట్టూ గోడ నిర్మించి దిగ్బంధం చేస్తున్నారు. దీనివల్ల వారి ప్రయాణం కూడా చాలా కష్టంగా ఉంటుంది. గతంలో ఉన్నట్లు దారిని యథా విధిగా ఉంచాలి. 
- దివీస్‌ కాలుష్య ప్రభావిత గ్రామాల్లో పోలీసుల నిర్బంధాన్ని ఆపాలి. పోలీసు క్యాంపులను ఎత్తివేయాలి.