దివీస్‌ ఔషద్‌ కంపెనీ విస్తరణ ప్రతిపాదన వద్దు

             భీమిలి మండలం చిప్పాడ దివీస్‌ ఔషద్‌ కంపెనీకి అనుబంధంగా కంచేరుపాలెంలో యూనిట్‌ 3 పేరుతో చేపట్టనున్న విస్తరణ ప్రతిపాదనను తక్షణమే వెనక్కి తీసుకోవాలని పలువురు డిమాండ్‌ చేశారు. అర్హులైన స్థానికులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని, కాలుష్యాన్ని నియంత్రణ చర్యలు తీసుకోవాలని కోరారు. ఈమేరకు సోమవారం స్థానిక తహశీల్ధార్‌ కార్యాలయం ఎదుట పెద్దఎత్తున ధర్నా నిర్వహించారు. 
ఈ సందర్భంగా సిపిఎం డివిజన్‌ కన్వీనర్‌ ఆర్‌ఎస్‌ఎన్‌ మూర్తి మాట్లాడుతూ వనరులన్నింటిని వినియోగించుకుని 2001లో ఔషదపరిశ్రమ నెలకొల్పిన దివీస్‌, స్థానిక నిరుద్యోగ యువతకు పరిశ్రమలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించకపోవడం దుర్మార్గమని విమర్శించారు. దీనినుంచి వెలువడుతున్న కాలుష్య కారక రసాయనాల వల్ల తీరప్రాంతంలోని మత్స్యసంపద నశించి, మత్స్యకారులు ఉపాధికి దూరమవుతున్నారనిఆవేదన వెలిబుచ్చారు. అప్పుడప్పుడు కురుస్తున్న ఆమ్లవర్షాలు ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయన్నారు. ప్రజలు ఊపిరితిత్తులు, చర్మవ్యాధులు, గర్భస్రావం, కిడ్నీ సంబంధిత దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడుతున్నారన్నారు. ఇన్నాళ్లు కొనసాగిన దళారుల ఆటలకు, ప్రస్తుతం ప్రజల్లో వచ్చిన చైతన్యంతో ఆటకట్టేనని హెచ్చరించారు. 
సిఐటియు డివిజన్‌ నాయకులు రవ్వ నర్సింగరావు మాట్లాడుతూ పరిశ్రమలకు భూమి, ఇతర అనుమతులను 15 రోజుల్లోనే ఇటీవల విశాఖ సదస్సులో ప్రకటించిన సిఎం చంద్రబాబు, పేదలకు 60 గజాల స్థలాన్ని ఇచ్చేందుకు ముందుకు రాకపోవడాన్ని బట్టి ప్రభుత్వవైఖరి అర్థమౌతోందన్నారు. విశాఖనగరంలోని ఇండిస్టియల్‌, ఫార్మా, ఐటి జోన్‌ల పరిధిలో (పరవాడ తదితర ప్రాంతాల్లో) ఔషధ పరిశ్రమలు ఏర్పాటుచేయాల్సి ఉండగా, అందుకు విరుద్ధంగా చిప్పాడలో దివీస్‌ యాజమాన్యం ఔషధ పరిశ్రమ నెలకొల్పడానికి అప్పటి ప్రభుత్వం అనుమతి ఇచ్చిందన్నారు. వైసిపి మండల అధ్యక్షులు వెంపాడ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం పరిశ్రమల యాజమాన్యాలకు పూర్తిగా అనుకూలంగా ఉంటుందని విమర్శించారు. వారి అండతోనే యూనిట్‌3 విస్తరణ పనులకు ముందుకెళ్తుందని ఆరోపించారు. దివీస్‌ యాజమాన్యం ప్రజాభిప్రాయాన్ని కాదని ఏకపక్షంగా వ్యవహరిస్తే స్థానిక ప్రజల సత్తా ఏంటో చూపెడతామని హెచ్చరించారు.