దిగొచ్చిన పోర్టు యాజమాన్యం

కాకినాడ ; కార్మికులు ఆందోళన ఉధృతం చేయడంతో పోర్టు యాజమాన్యం దిగొచ్చింది. ఆల్‌బెస్ట్‌ కార్మికులకు నష్టపరిహారం అందించేం దుకు రాతపూర్వక ఒప్పందం చేసుకుంది. 20 రోజులుగా కాకినాడ డీప్‌ వాటర్‌ పోర్టు ఆల్‌బెస్ట్‌ కంపెనీ కార్మికులు ఆందోళన చేస్తున్నారు. అయినప్పటికీ పోర్టు యాజమాన్యం స్పందించలేదు. దీంతో శుక్రవారం వారు ఆందోళనను ఉధృతం చేశారు. వివిధ కంపెనీల కార్మికులు విధులను బహిష్కరించి వీరికి అండగా నిలిచారు. దీంతో యాజమాన్యం దిగొచ్చింది. డిప్యూటీ కమిషనర్‌ ఆఫ్‌ లేబర్‌ సమక్షంలో రాతపూర్వక ఒప్పందం జరిగింది. రెండున్నరేళ్లు పైబడిన సీనియర్‌ కార్మికులకు మూడు నెలల జీతాన్ని నష్టపరిహారంగా చెల్లించడానికి, మిగిలిన వారికి రెండున్నర నెలల జీతం చెల్లించడానికి అంగీకరించారు. పిఎఫ్‌, ఇఎస్‌ఐ పూర్తిగా కార్మికుల ఖాతాకు జమ చేసి, ఓవర్‌ టైం బకాయి జీతాలు చెల్లించాలని రాతపూర్వక ఒప్పందం కుదిరింది. ఈ కార్యక్రమంలో కంపెనీ జనరల్‌ మేనేజర్‌ డానియేలు, సిఐటియు నాయకులు ఎం.వేణుగోపాల్‌, జి.బేబిరాణి, సిహెచ్‌.అజరు కుమార్‌, ఎం.వెంకటరమణ, లోవరాజు, రవిశంకర్‌ పాల్గొన్నారు. సిపిఎం జిల్లా కార్యదర్శి దువ్వా శేషబాబ్జి, నగర కార్యదర్శి పలివెల వీరబాబు వారికి మద్దతు తెలిపారు.