దారిద్య్రం గురించి మరోసారి..

అక్టోబరు 6వ తారీఖున హిం దూపత్రికలో ప్రపంచంలో దారి ద్య్రం తగ్గిందనే ప్రపంచ బ్యాంకు అంచనాకు సంబంధించిన వార్త ప్రచురింపబడింది. ప్రపంచం మొత్తంమీద 2011లో 14.2శాతం మంది దారిద్యంలో ఉంటే ఆ సంఖ్య 2012లో 12.8 శాతంగా నమోదయింది. భారతదేశం లో కూడా దారిద్య్రం అదే స్థాయిలో తగ్గినట్లు ఆ వార్తా కథనంలో ఉన్నది. ప్రపంచబ్యాంకు అలాంటి నిర్ధారణకు ఎలా వచ్చింది? ముఖ్యంగా భారతదేశం విషయంలో అదొక మిస్టరీగా మిగలనున్నది. ఎందుకంటే భారతదేశంలో నేషనల్‌ శాంపిల్‌ సర్వే 5 సంవత్సరాలకొకసారి విస్తృత సర్వే చేస్తుంది. మిగతా సంవత్సరాలలో అంతగా ఆధారపడజాలని చిన్న చిన్న సర్వేలు చేస్తుంది. వీటిని అంతగా ఉపయోగిం చరు. గతంలో చివరిగా 2011-12లో విస్తృత సర్వే జరిగింది. కాబట్టి ఈ కాలంలో పేదరికం తగ్గిందని నిర్ధారిం చటం చాలా కుట్రపూరితంగా ఉన్నది. భారతదేశానికి సంబంధిం చిన నిర్ధారణ కుట్రపూరితంగావుంటే మొత్తం ప్రపంచానికి సంబంధించి కూడా అంతే కుట్రపూరితంగా ఉంటుంది. ఎందుకంటే ప్రపంచ బ్యాంకు అంచనా ప్రకారం కూడా ప్రపంచంలోని పేదలలో ఎక్కువమంది భారతదేశం లోనే వున్నారు. ఈ విషయాన్ని పక్కకు పెడదాం. గతంతో పోలిస్తే 2011-12లో భారతదేశంలోని పేదరికానికి ఏమైందో చూద్దాం. 2011-12లో నేషనల్‌ శాంపుల్‌ సర్వే ఎందుకు విస్తృత సర్వే చేసిందనేది కూడా ఆసక్తికరమైన విషయం. 2009-10లో విస్తృత సర్వే జరిగిన స్థితిలో అదే సర్వే తిరిగి 2014-15లో జరగాలి. అయితే 2009-10లో జరిగిన సర్వేలో దారిద్య్రం తీవ్రత ఊహాతీతంగా చాలా ఎక్కువగా వున్నది. అప్పటి ప్రభుత్వం దేశంలో దారిద్య్రం నిష్పత్తి తగ్గిం దని చెబుతుండేది. అలా తగ్గిందని భావిస్తున్న దారిద్య్రాన్ని గురించిన స్పష్టత కోసం ఒక ప్రత్యేక పంచవర్ష విస్తృత సర్వేని ప్రభుత్వం చేయించింది. 2009-10లో వర్షాలు సరిగా కురవనందున మొత్తంమీద ప్రజలకు 'అసహజ' స్థాయిలో ఆహార పదార్దాలు అందలేదని, 2011-12లో పంటలు బాగా పండినందున ఆ సంవత్సరంలో విస్తృత సర్వే జరిగితే 'అహ్లాదకర దృశ్యం' ఆవిష్కరింపబడుతుందని ప్రభుత్వం భావించింది. ఆశ్చర్య పడాల్సిన అవసరంలేకుండా అలానే జరిగింది. అందుబాటు లోకి వచ్చే పౌష్టికాహార పరిమాణం పంటలు బాగాపండిన సంవత్సరానికి, పండని సంవత్సరా నికి మధ్య తేడా వుం టుంది. అయితే ఇక్కడ రెండు ముఖ్యమైన విషయాలను గమనించాలి. మొదటిదేమంటే 2009-10దాకా చేసిన విస్తృత సర్వేలన్నీ ప్రజలు పౌష్టికాహారలోపానికి గురవుతు న్నారని తెలిపాయి. ఈ నిర్ధారణను ప్రభుత్వం కొట్టిపారేస్తు న్నది. ప్రజలు కావాలనే తాము తినే ఆహార పరిమాణాన్ని తగ్గించుకుంటున్నారని, దానితో వారు తీసుకునే క్యాలరీలు కూడా తగ్గుతున్నాయని ప్రభుత్వం వాదిస్తోంది. తద్వారా మిగుల్చుకున్న ఆదాయాన్ని విద్య, ఆరోగ్యంవంటి వాటిపై ప్రజలు ఖర్చు చేస్తున్నారని ప్రభుత్వం చెబుతున్నది. ప్రజలు తమ ఆదాయాన్ని ఖర్చు చేయటంలో వచ్చిన అలాంటి మార్పును పేదరికం పెరగ టంగా కాకుండా పెరిగిన వారి ఆదాయానికి సూచికగా భావించటం జరుగుతున్నది. వేరే మాటల్లో చెప్పాలంటే పౌష్టికాహారలోపం పెరుగుదల ప్రజల స్వీయ నిర్ణయంతో జరిగిందని, వాస్తవంలో అది వారు మరింత ధనవంతులు కావటానికి ఉద్దేశింపబడిందని భావిస్తున్నది. 
అసంబద్ద వాదన
ఇది పూర్తిగా అసంబద్ద వాదన. వాస్తవ ఆదాయాలు పెరిగినప్పుడు ఆహారధాన్యాల ప్రత్యక్ష, పరోక్ష (ఆహార పదార్ధాల ఉత్పాదనలలోను, మాంసం ఉత్పాదనలలోను చేరిన ఆహారధాన్యాలు) తలసరి వినియోగం పెరుగు తుంది. దానితో తలసరి క్యాలరీల వినియోగం కూడా పెరుగుతుంది. ఈ వాస్తవాలు ప్రభుత్వ వాదన అసంబద్ద తను తెలియజేస్తున్నాయి. భారతదేశంలో దీనికి పూర్తిగా భిన్నంగా జరగటమేకాకుండా అది ఆందోళన కలిగించేలా పెరుగుతున్నది. గ్రామీణ భారతదేశంలో 1993-94లోగల 2156 తలసరి క్యాలరీల వినియోగం 2004-05కల్లా 2038కి, 2009-10కి 2018కి పడిపోయింది. (1999- 2000 లెక్కలు ఇవ్వలేదు. ఎందుకంటే ఆ సంవత్సరం వేరే పద్ధతి అవలంబించారు). అదేవిధంగా పట్టణ భారతదేశం లో తలసరి రోజువారీ క్యాలరీల వినియోగం 1993-94లో 2072 వుంటే 1994-95లో 2007వున్నది. 2009-10 లో అది 1981కి దారుణంగా పడిపోయింది. పట్టణ భారతదేశంలో రోజుకు తలసరి 2100 క్యాలరీలు, గ్రామీణ భారతదేశంలో రోజుకు తలసరి 2200 క్యాలరీలు అందు బాటులో లేకపోతే 'పేదలు'గా భావిస్తారు. 'దారిద్య్రరేఖ'ను ఈ స్థాయి క్యాలరీలు అందని స్థితిగా నిర్వచించారు. గ్రామీణ భారతదేశంలోని పరిస్థితిని గమనంలోకి తీసుకుంటే రోజుకు తలసరి 2200 క్యాలరీలు కూడా అందుబాటులోలేని ప్రజల శాతం 1993-94లో 58.5శాతం వుంటే 2004-05లో 69.5శాతం ఉన్నది. ఈ సంఖ్య 2009-10లో 76శాతానికి పెరిగింది. భారతదేశంలోని పట్టణ ప్రాంతంలో 2100 క్యాలరీలు అందుబాటులో లేనివారు 1993-94లో 57 శాతం ఉంటే 2004-05లో 64.5శాతానికి, 2009- 10కల్లా 73శాతానికి పెరిగింది. ప్రభుత్వ ప్రమాణాల ఆధారంగానే పేదరికం పెరుగుతుంటే ఉద్దేశపూర్వకంగానే ప్రజలు తమ ఆదాయాలను పెంచుకోవటానికి వినిమయాన్ని తగ్గించుకున్నారని వక్రీకరించటం జరుగుతున్నది! అయితే ఆహారధాన్యాల వినిమయానికి సంబంధించి 2011-12లో సేకరించిన సమాచారాన్ని 2009-10 క్యాలరీల వినిమయాన్ని పోల్చిచూసినప్పుడు క్యాలరీలు వినియోగం పెరిగింది. దీనినిబట్టి పేదరికం తగ్గిందని అదే ప్రభుత్వ వర్గాలు వాదిస్తున్నాయి. అయితే అంతకుముందు తగ్గిపోయిన క్యాలరీల వినియోగం ప్రభుత్వం చెప్పినట్లుగా ప్రజలు తమ ఆదాయాలను పెంచుకోవటానికి స్వయంగా తగ్గించుకుంటే అదే తర్కం ప్రకారం 2009-10, 2011-12 సంవత్సరాలలో పెరిగిన క్యాలరీల వాడకం దానికి విరుద్దమైనదిగా ఉండితీరాలి. అంటే ఈ కాలంలో ప్రజలు స్వచ్చంధంగా ఆహారధాన్యాలను అధికంగా వినియోగించుకున్నారు కాబట్టి ఆ మేరకు దరిద్రులుగా మారాలి. ఈ అసంబద్ద తర్కంతో అదే ప్రభుత్వం గతంలోని క్షీణత స్వచ్ఛంధంగా జరిగిందని, 2011-12లో పెరిగిన వినిమయం కూడా స్వచ్చందంగా జరిగిందేనని వాదిస్తున్నది. అయితే వాస్తవమేమంటే 2009-10, 2011-12 మధ్యకాలంలో ప్రజలు ఎక్కువగా పీడనకు గురవటంవల్ల తమ ఆహార వినిమయాన్ని తగ్గించుకున్నారు. ఆ తరువాత ఆ వత్తిడి తగ్గగానే తమ ఆహార వినిమయాన్ని పెంచారు. ఈ వత్తిడి తగ్గటానికిగల కారణాన్ని గురించి తెలుసుకోవాలి. 2011-12లో పంటలు బాగా పండటం, ఆహార భద్రతా పథకంవంటి పథకాలు అస్థిత్వంలో వుండటంవల్ల ఇది జరిగివుంటుంది. అయితే 2011-12లో పెరిగిన వినిమయం ప్రజల ఆదాయాలు పెరగటం కారణంగా జరిగిందనే వాదనను బలపరుస్తున్నది. ఇక్కడ నేను రెండో పాయింటుకు వస్తాను. 2011-12లో గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో తలసరి రోజువారీ క్యాలరీల వినియోగం 2009-10, 2004-5కంటే ఎక్కువగా వున్నప్పటికీ 1993-94లో వున్నదానికంటే గణనీయంగా తక్కువగా వున్నది. గ్రామీణ భారతదేశంలో 1993-94లో 2156 క్యాలరీల తలసరి రోజువారీ వినియోగం వుండగా 2011-12కల్లా అది 2090కి పడిపోయింది. పట్టణ ప్రాంతంలో ఈ సంఖ్యలు 2072, 2049. ప్రభుత్వం చెబుతున్నట్లుగా వాస్తవ ఆదాయం పెరగటంతో క్యాలరీల వినియోగం పెరుగుతున్నది నిజమైనప్పుడు సరళీకరణ విధానాల కాలమైన 1993-94, 2011-12 సంవత్సరాల మధ్యకాలంలో భారతదేశంలోని గ్రామాలలోను, పట్టణాలలోను మెజారిటీ ప్రజల వాస్తవ ఆదాయాలు పతనమయ్యాయి. ఈ కాలంలో మెజారిటీ భారత ప్రజల వాస్తవ ఆదాయాలు క్షీణించాయంటే వారి పరిస్థితి 90వ దశకం ప్రారంభంలోకంటే బాగా లేదని చెప్పినట్లు కాదు. దీనికి ఒక స్పష్టమైన కారణం వున్నది. ఈ కాలంలో ప్రజలు వుపయోగించే సరుకుల తీరు నాటకీయంగా మారింది. అంతకుముందు తెలియని ప్రాణాలను కాపాడే మందులు, వైద్య సౌకర్యాలవంటి కొన్ని సరుకుల ప్రవేశం వాటి ధరలకు మించి ప్రజలకు బాగా వుపయోగపడ్డాయి. దీనితో క్యాలరీల వినియోగం తగ్గిన పరిస్థితిలో కూడా జీవన నాణ్యత పెరిగివుండవచ్చు. అయితే వైద్య రంగంవంటి రంగాలలో వచ్చిన పరికల్పనలకు కారణం ఉదారీకరణ కాదు. వైద్య సదుపాయాలపై ప్రభుత్వ రంగానికి గుత్తాధిపత్యంవున్నా అవి వచ్చివుండేవే. కాబట్టి ఉదారీకరణవల్ల జరిగిందేమంటే మెజారిటీ ప్రజల వాస్తవ ఆదాయం తగ్గినకారణంగా వారి క్యాలరీల వినిమయం తగ్గింది. ఈ క్షీణతకుగల అనేక కారణాలలో 'ఆదిమ మూలధన సంచయ' ప్రక్రియ ప్రధానమైనది. ఈ ప్రక్రియతో మార్క్స్‌ చెప్పినట్లుగా 'క్రియాశీల కార్మిక సైన్యం'లో భాగం కాకుండా చిన్న ఉత్పత్తిదారులు ఆర్థికంగా పతనమవుతారు. సబ్సిడీల కోతతోను, గిట్టుబాటుధరలు లేకపోవటంతోను చిన్న ఉత్పత్తిదారులు పూర్తిగా చితికిపోకముందే వారి వాస్తవ ఆదాయాలు కుంచించుకుపోతాయి. విద్య, ఆరోగ్యంవంటి నిత్యావసర సేవలు ప్రయివేటీకరించటంతో వాటి నాణ్యతలో మార్పులేకపోయినప్పటికీ వాటికి చెల్లించే ధరలు పెరగటమే దీనికి కారణం.
ప్రజలపై వత్తిడి 
అలా చెల్లించిన ధరలలోని పెరుగుదల జీవన వ్యయంలోని పెరుగుదలగా గణాంకాలలో చేరదు. ఉదాహరణకు గతంలో ప్రభుత్వ హాస్పిటల్స్‌లో ఒక సర్జరీకి 100 రూపాయలు చెల్లించేవారనుకుందాం. ఇప్పటికీ ప్రభుత్వ హాస్పిటల్స్‌ అదే సర్జరీకి 100 రూపాయలే చార్జి చేస్తున్నా వాటి సంఖ్య చాలా తక్కువగా వున్నది. దానితో ప్రజలు ఎక్కువగా డబ్బులు దండుకునే ప్రయివేటు హాస్పిటల్స్‌కు వెళ్లవలసి వుంటుంది. అయినప్పటికీ సర్జరీకి అయ్యే ఖర్చులో ఎలాంటి పెరుగుదలా నమోదు కాదు. క్లుప్తంగా చెప్పాలంటే ప్రయివేటీకరణతో ప్రజలపై పెరిగిన పీడన ధరల సూచికలో ప్రతిబింబించటంలేదు. అలా పీడనకు గురయిన ప్రజలు తాము తీసుకునే ఆహారాన్ని తగ్గించుకుని పెరిగిన వైద్య సేవల ఖర్చులను భరిస్తున్నారు. ప్రయివేటీకరణతో పెరిగిన ధరలవల్ల ప్రజల వాస్తవ ఆదాయం తగ్గుతున్నది. జీవన వ్యయం పెరుగలేదనే భావనవల్ల వినిమయ వ్యయం అలవోకగా ఆహారంపై కాకుండా వైద్య సేవలకు మళ్ళించబడుతున్నది. దీనిని స్వచ్చందంగా జరిగిన మార్పుగా వ్యాఖ్యానిస్తున్నారు. ప్రత్యక్ష, పరోక్ష ఆహార ధాన్యాల తలసరి వినియోగంలో కనిపించే స్పష్టమైన క్షీణతను విస్మరించే దారిద్య్రం అంచనాలు మౌలికంగా లోపభూయిష్టంగా వున్నాయి. ఇందుకు ప్రపంచబ్యాంకు అంచనాలు భిన్నమైనవేమీ కావు.
- ప్రభాత్‌ పట్నాయక్‌