దాద్రి దారుణం..

 మోడీ ప్రభుత్వ అండ చూసుకుని దేశంలో హిందూత్వ శక్తులు పేట్రేగిపోతున్నాయి. ఢిల్లీకి యాబై కిలోమీటర్ల దూరంలోని దాద్రిలో సాగిన దారుణం కాషాయ మూకల రాక్షసత్వానికి మరో నిదర్శనం. గోవధ జరిగిందన్న తప్పుడు ప్రచారానికి హిందూ ఆలయాన్ని వేదికగా చేసుకోవడం మరీ దుర్మార్గం. గొడ్డు మాంసం తింటున్నాడన్న తప్పుడు ఆరోపణలతో యాభై ఏళ్ల మహ్మద్‌ ఇఖ్లాక్‌ అనే అమాయక ముస్లింను మతోన్మాద శక్తులు పొట్టనపెట్టుకోవడం హేయాతిహేయం. దీనికి కొద్ది రోజుల ముందు కాన్పూర్‌లో ఒక ముస్లింను పాకిస్తానీ ఉగ్రవాది అన్న ముద్ర వేసి ఇలాగే ప్రాణాలు తీశాయి. ముజఫర్‌గర్‌లో ఏ శక్తులైతే ఘర్షణలకు తెగబడ్డాయో అవే శక్తులు దాద్రి ఘటన వెనక వుండడం గమనార్హం. బిజెపి ఎమ్మెల్యే, ముజఫర్‌ నగర్‌ ఘర్షణల్లో పాత్రధారి సంగీత్‌ సోమ్‌, కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి మహేష్‌ శర్మ చేసిన రెచ్చగోట్టే ప్రసంగాలే ఈ దారుణానికంతటికీ కారణమని తేలింది. ఇదేదో బిజెపి అంటే గిట్టనివారు చేసిన విమర్శ కాదు. సాక్షాత్తూ దాద్రి పోలీసులే వెల్లడించిన నగ సత్యం. ఈ కేసులో నిందితులంతా బిజెపి ఎమ్మెల్యే కుమారుడు, ఇతర బిజెపి నాయకుల అనుచరులేనన్న విషయం మరువరాదు. దాద్రి ఘటనకు బిజెపికి ి సంబంధం లేదని బిజెపి నాయకులు ఎప్పటిలానే బుకాయించాలని చూస్తే కుదరదు.. దాద్రి ఘటనకు అనుకూలంగా, వ్యతిరేకంగా ప్రకటనలు గుప్పిస్తూ ప్రజలను గందరగోళపరిచేందుకు బిజెపి నాయకులు ఇప్పటివరకు ఆడుతూ వస్తున్న కపట నాటకాన్ని కట్టిపెట్టాలి. జరిగినదానికి ప్రజలకు సంజాయిషీ ఇచ్చుకోవాలి. దాద్రిలో ముజఫర్‌ నగర్‌ తరహా మత ఘర్షణలు సృష్టించేందుకు ఆరెస్సెస్‌, బిజెపి అనుసరిస్తున్న కుటిల పన్నాగాన్ని ప్రజలు గ్రహిస్తున్నారు. దాద్రి ఘటనను బిజెపి ఎమ్మెల్యే సంగీత్‌ సోమ్‌ బాహాటంగా సమర్థించుకున్నాడు. ఆయనకు కేంద్ర మంత్రి మహేష్‌ శర్మ పరోక్షంగా వత్తాసు పలికారు. బిషాద గ్రామంలో వీరిద్దరూ చేసిన ప్రసంగాలు, ప్రకటనలే ఇఖ్లాక్‌పై దాడికి పురిగొల్పాయి. వీరు చేసిన బాధ్యతారహిత వ్యాఖ్యలను అటు ప్రధాని మోడీ కానీ, ఇటు ఆ పార్టీ అధ్యక్షుడు అమిత్‌షా కానీ కనీసం ఖండించలేదు. ప్రతి అంశంపైనా ట్వీట్‌ చేసే ప్రధాని మోడీ దాద్రిలో దారుణ హత్యకు గురైన ఇఖ్లాక్‌ కుటుంబానికి సానుభూతి తెలపడానికి కూడా ఇష్టపడలేదు. నేటికి తొమ్మిది రోజులైనా మోడీ ఈ ఘటనపై నోరు మెదపక పోవడంలో ఆశ్చర్యమేమీ లేదు. హిందూత్వ మూకల విద్వేషపూరిత ప్రచారానికి, మైనార్టీలపై అవి సాగిస్తున్న హింసకు ప్రోత్సాహం అందించడమే ఆయన మౌనం లోని ఆంతర్యం. ఆవును చంపేశారన్న పుకార్లను ప్రచారంలో పెట్టడం దగ్గర నుంచి హిందూ ఆలయ పూజారిచే మైకులో పదే పదే పుకార్లను ప్రచారం చేయడం.నమాజ్‌ చేసుకుని ఇంటికి వచ్చిన ఇఖ్లాక్‌ను బయటకు లాక్కొచ్చి కొట్టి చంపడం వరకు అంతా ఒక పథకం ప్రకారం సంఫ్‌ుపరివార్‌ మూకలు సాగించాయి. తమ తప్పుడు ప్రచారానికి ఆలయాన్ని దుర్వినియోగం చేయడం సంఫ్‌ుపరివార్‌ ఫాసిస్టు పోకడలను తెలియజేస్తోంది. సెప్టెంబరు మొదటివారంలో కేంద్ర మంత్రులతో ఆరెస్సెస్‌ సమన్వరు బైఠక్‌ జరిపిన తరువాత అవి తమ మతతత్వ ఎజెండా దూకుడును పెంచాయి. బిజెపి ప్రభుత్వాలు దీనికి మద్దతుగా గొడ్డు మాంసంపై నిషేధం వంటి చర్యలు చేపట్టాయి. ఇంకోవైపు గొడ్డు మాంసం తింటున్నారనే పుకార్లను ప్రచారంలో పెట్టి సంఫ్‌ు పరివార్‌ మూకలు ముస్లింలపై భౌతిక దాడులకు తెగబడుతున్నాయి. ప్రస్తుతం బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుండడం, వచ్చే ఏడాది జరగనున్న కీలకమైన అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, ఆ తరువాత వచ్చే యుపి అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో వుంచుకుని సంఫ్‌ు పరివార్‌ ఒక పథకం ప్రకారమే ఈ దాడులను ముమ్మరం చేసింది. ఇంతకుముందు మతతత్వాన్ని సమర్థించుకోవడానికి కుహనా లౌకికత్వం అన్న పదాన్ని అద్వానీ లాంటి వారు ముందుకు తెచ్చేవారు.. ఇప్పుడు లౌకికవాదం భారత్‌ లాంటి దేశానికి పనికిరాదని సంఫ్‌ు ప్రచార ప్రముఖ్‌ వైద్య లాంటివారు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. లౌకికవాదంపై సంఫ్‌ు పరివార్‌ బాహాటంగానే దాడి చేస్తోంది. మతతత్వానికి వ్యతిరేకంగా నిలిచిన మేధావులను భౌతికంగా అంతమొందించేందుకు సంఫ్‌ుపరివార్‌ మూకలు ఇప్పుడు తెగబడుతున్నాయి. మొన్న కర్ణాటకలో కాల్బురిని హత్య చేశారు. అంతకుముందు మహారాష్ట్రలో పన్సారే, దబోల్కర్‌లను హత్య చేశారు. తదుపరి టార్గెట్‌ ఫలానా వ్యక్తి అని బాహాటంగా బెదిరింపులకు దిగుతున్నారు. మతతత్వ శక్తులు విసురుతున్న ఈ సవాల్‌ను ప్రజాతంత్ర, లౌకిక శక్తులు, మేధావులంతా కలిసి ఐక్యంగా ఎదుర్కోవాలి. దాద్రి ఘటనలో పాత్ర వున్న బిజెపి ఎమ్మెల్యే సంగీత్‌ సోమ్‌, ఆ ప్రాంత ఎంపీ, కేంద్ర మంత్రి అయిన మహేష్‌ శర్మను కటకటాలవెనక్కి పంపేలా కేంద్ర ప్రభుత్వంపైన, యుపి ప్రభుత్వంపైన ఒత్తిడి పెంచాలి.