దళిత సమస్యలపై చర్చించేందుకే ప్రత్యేక పార్లమెంటు సమావేశాలకై ఉద్యమం..

బిఆర్‌ అంబేద్కర్‌ 125వ జయంతి ఏడాది పాటు జరుగుతోంది. మోడీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం అంబేద్కర్‌ విగ్రహానికి పూల మాలలు వేసి ఆయన ఆశయాలకు తిలోదకాలిచ్చింది. ఎన్నో ఏళ్లగా దళితులకు సంబంధించిన సమస్యలు పెండింగ్‌లో ఉన్నాయి. నయా ఉదారవాద ఆర్థిక విధానాలు అమలులోకి వచ్చిన తరువాత ఎస్సీ, ఎస్టీ, తదితర వెనుకబడిన సామాజిక తరగతుల పరిస్థితి మరింత ఘోరంగా తయారైంది. దేశంలోని సగటు మానవాభివృద్ధి సూచికలతో పోల్చుకుంటే వీరి పరిస్థితి అంతకంటే అట్టడుగున ఉంది. దళిత, గిరిజన వాడలు అభివృద్ధికి నోచుకోలేదు. ఉపాధి లేక వలసలు పెరిగాయి. ప్రభుత్వ రంగ పతనంతో చదువుకున్న వారికి ఉద్యోగం దొరకటం లేదు. ప్రైవేటు రంగంలో పోటీ పడలేక వెనకబడిపోతున్నారు. దళితులు, ప్రత్యేకించి దళిత మహిళలపై అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. కులాంతర వివాహాలు చేసుకున్న దంపతులను అగ్రకుల పంచాయితీలు(కాప్‌ పంచాయితీలు) గౌరవ హత్యల పేరుతో నరికి చంపేస్తున్నాయి. అంటరానితనం వివిధ రూపాల్లో ఇప్పటికీ పీడిస్తున్నది. ఎన్నో విషయాలపై తర్జనభర్జన పడుతున్న పార్లమెంటుకు దళితుల సమస్యలపై చర్చించడానికి మాత్రం సమయం ఉండటం లేదు. తరతరాలుగా వెనుకబడి ఉన్న ఈ తరగతుల అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యల గురించి పార్లమెంటు చర్చించి చట్టాలు చేయకుండా, చేసిన చట్టాల అమలుపై సమీక్షలు చేయకుండా ఉత్తిగా కబుర్లు చెబితే సమస్య పరిష్కారం అవ్వదు. మోడీ వైఖరి చూస్తుంటే కబుర్లతో కడుపునింపాలని చూస్తున్నట్టుంది. రోజూ సరికొత్త వాగ్దానాలు చేయటంలో ఆయనకు ఎవరూ సాటి రారు. సామాన్యులకు మాటలు, సంపన్నులకు చేతలు ఇదీ ఆచరణలో మోడీ పాలన. జిఎస్‌టి బిల్లు ఆమోదింపజేసుకోవటానికి అవసరమైతే ప్రత్యేక పార్లమెంటు సమావేశాలు నిర్వహిస్తామంటున్న ప్రభుత్వానికి, దళిత సమస్యలపై ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలనే స్పృహ ఎందుకు రాలేదు? పెట్టుబడుల పేరుతో దేశదేశాలు తిరిగి బడా కార్పొరేట్‌ నేతలకు సాష్టాంగపడుతున్న మోడీ ఒక్కసారైనా దళిత, గిరిజన, రైతు, కార్మిక, కూలీ నాయకులను కలుసుకున్నారా? వారి బాధలు విని ఎలా పరిష్కరించాలో ఆలోచించారా? గత ఏడాది 2014 నవంబర్‌లో జరిగిన దళిత సోషన్‌ ముక్తి మంచ్‌(డిఎస్‌ఎంఎం) జాతీయ సదస్సు మొదటిసారి ప్రత్యేక సమావేశాల కోసం గళం విప్పింది. దీన్ని బలపర్చాల్సిందిగా వివిధ రాజకీయ పక్షాలకు, పార్లమెంటు సభ్యులకు లేఖలు సమర్పించింది. సిపిఐ(యం) దీనిపై స్పందించి 21వ అఖిల భారత మహాసభల్లో తీర్మానం చేసింది. అయినా ప్రభుత్వంలో ఏమాత్రం స్పందన లేదు. అందుకే ఈ డిమాండుపై దేశవ్యాప్త ఉద్యమాన్ని నిర్మించేందుకు, మరింత విస్తృత మద్దతు కూడగట్టేందుకు సెప్టెంబర్‌ 20న ఢిల్లీలో జంతర్‌ మంతర్‌ వద్ద బహిరంగ ప్రదేశంలో దళిత పార్లమెంటు నిర్వహించాలని డిఎస్‌ఎంఎం నిర్ణయించింది. దీనికి ఒక రోజు ముందు దళితులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలపై జాతీయ సెమినార్‌ నిర్వహిస్తుంది.
సబ్‌ప్లాన్‌కు చట్టబద్ధత
గత 25 ఏళ్లలో ఒక పద్ధతి ప్రకారం సామాజిక న్యాయానికి చిల్లులు పడుతున్నాయి. సంక్షేమ విధానాల స్థానంలో మార్కెట్‌ ఆర్థిక విధానాలు చోటుచేసుకున్నాయి. చివరికి ప్రభుత్వ సేవలకు కూడా సామాన్యుల వద్ద ముక్కు పిండి డబ్బులు వసూలు చేస్తున్నారు. పేదలకు భూ పంపకం స్థానంలో కార్పొరేట్‌ కంపెనీలకు కట్టబెట్టే విధానం అమలు చేస్తున్నారు. గతంలో దళితులకు పంపిణీ చేసిన భూమిని కూడా అభివృద్ధి పేరుతో వెనక్కిలాగేసుకుంటున్నారు. గిరిజనులు సాగు చేసుకుంటున్న భూమిని గుంజుకుంటున్నారు. సెజ్‌ల పేరుతో లక్షల ఎకరాలు కార్పొరేట్లకు కట్టబెట్టే ప్రభుత్వం, దళితులకు వంద గజాల ఇళ్ల స్థలం ఇవ్వటానికి వెనుకంజ వేస్తున్నది. పైగా ఎక్కడైనా ప్రభుత్వ స్థలాల్లో ఇళ్లు వేసుకుంటే బలవంతంగా పీకేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఒకే ఇంట్లో రెండు మూడు కుటుంబాలు ఇరుక్కుని సర్దుకుంటున్నారు. దళితులు నివసించే ప్రాంతాలు సగటు గ్రామాభివృద్ధితో పోలిస్తే వెనుకబడి ఉన్నాయి. నాసిరకం రోడ్లు, నీటి కొరత, పేరుకుపోయిన చెత్తాచెదారంతో మురికి కేంద్రీకృతమై దోమలు విలయతాండవం చేయడంతో వ్యాధుల బారిన పడుతున్నారు. ప్రభుత్వ పాఠశాలలు నాసిరకంగా ఉన్నాయి. వీటిల్లో చదివే వారిలో అత్యధికులు దళితులే. ఒకటి అర ఉపాధ్యాయులతో ఇవి నత్తనడకన నడుస్తున్నాయి. ఇక నాణ్యమైన విద్యను ఊహించను కూడా లేము. ఈ దుస్థితిలో ఉన్న దళితవాడలు అభివృద్ధి కావాలంటే ప్రత్యేక నిధులివ్వకుండా సాధ్యం కాదు. 1980ల్లో తెచ్చిన ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక నియమాల ప్రకారం జనాభా నిష్పత్తి ప్రకారం నిధులు కేటాయించాలి. కానీ అలా చేయడం లేదు. గత అనేక బడ్జెట్‌లలో కేటాయించిన అరకొర నిధులు కూడా ఖర్చు పెట్టకుండా దారి మళ్లిస్తున్నారు. దీన్ని నివారించాలంటే ఉప ప్రణాళికకు చట్టబద్ధత కావాలి. ఓ పెద్ద పోరాటం తరువాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చట్టం వచ్చింది. కేంద్రంలో, వివిధ రాష్ట్రాల్లో ఇటువంటి చట్టాలు తేవాల్సిన అవసరం ఉంది.
ప్రైవేటురంగంలో రిజర్వేషన్లు
ప్రైవేటు రంగం విస్తరించాక ఎస్సీ, ఎస్టీలకు ఉపాధి అవకాశాలు పడిపోయాయి. ప్రభుత్వ రంగంలో శాశ్వత ఉద్యోగాలకు బదులు తాత్కాలిక, కాంట్రాక్టు పద్ధతుల్లో ఉద్యోగాలిస్తున్నారు. వీటిల్లో రిజర్వేషన్లు అమలు కావటంలేదు. ఫలితంగా సగానికి సగం ఉపాధి అవకాశాలు పడిపోయాయి. 2005లో ఉన్నత విద్యా సంస్థల్లో రిజర్వేషన్ల సమస్య ముందుకు వచ్చినప్పుడు 'సానుకూల చర్యలు'(అఫర్మేటివ్‌ యాక్షన్‌) ద్వారా ఉపాధి అవకాశాలు కల్పిస్తామని కార్పొరేట్‌ రంగం హామీ ఇచ్చింది. ప్రభుత్వం దీనికి వంతపాడింది. కానీ ఈ పదేళ్లల్లో ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. తాజాగా మోడీ స్టార్టప్‌-స్టాండప్‌ అంటూ ఎస్సీ, ఎస్టీలను పారిశ్రామికవేత్తలు కమ్మని పిలుపులిస్తున్నారు. తద్వారా సరికొత్త భ్రమలకు గురిచేసే ప్రయత్నం జరుగుతున్నది. 
తమను బలహీన వర్గాల్లో చేర్చాలని గుజరాత్‌లో పటేళ్లు చేపట్టిన ఆందోళనతో రిజర్వేషన్లపై సరికొత్త రగడ మొదలైంది. 'మాకు రిజర్వేషన్లు ఇవ్వండి లేకపోతే మొత్తం ఎత్తేయండి' అనేది వారి నినాదం. దేశంలోనే బాగా అభివృద్ధి చెందిన పటేళ్ల కులంలోనే నిరుద్యోగం ఇంత తీవ్రంగా ఉంటే, ఇక దళితుల పరిస్థితి ఎంత అధ్వానంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ప్రైవేటు రంగంలో నైపుణ్యం కలిగిన ఉద్యోగాలలో నాలుగు శాతం మించి దళితులు లేరు. ఆ రంగంలో రిజర్వేషన్లు అమలు జరపకుండా దళిత విద్యావంతులకు ఉపాధి పెరగదు. మరోవైపు ఉపాధి అవకాశాలను పెంచడంలో విఫలమైన ప్రభుత్వం, రిజర్వేషన్ల పేరుతో కులాల మధ్య వైషమ్యాలను రెచ్చగొట్టే పనిలో తలమునకలవుతోంది. తద్వారా యువతరంలో వస్తున్న ఆగ్రహం తమ వైపు రాకుండా వారిలోవారు కొట్టుకు చావాలనుకుంటోంది. అగ్ర కులాల్లోని చదువుకున్న యువత ఉపాధి అవకాశాల కోసం ప్రభుత్వంపై పోరాడకుండా ఎంత కాలం ఈ రిజర్వేషన్లంటూ తమ సహచర నిరుద్యోగులపై విరుచుకుపడుతున్నారు. దళితుల్లో ధనికులు, ఇతర కులాల్లో పేదలు ఉన్నారని, అందువల్ల ఆర్థిక ప్రాతిపదికపై రిజర్వేషన్లు కల్పించాలని వారు డిమాండు చేస్తున్నారు. ఉద్యోగస్తులు, కాస్తోకూస్తో డబ్బున్న దళితులు కూడా వివక్షకు గురౌతున్నారు. ఈ సామాజిక అసమానతలు ఉన్నంత కాలం రిజర్వేషన్లు కొనసాగాల్సిందే. ఎంత కాలం ఈ రిజర్వేషన్లు అని ప్రశ్నించేవాళ్లు, ముందుగా ఎంతకాలం ఈ కుల వివక్ష అని ప్రశ్నించాలి. గ్రామాల్లోని దళితులపై సాగుతున్న వివక్షకు వ్యతిరేకంగా అగ్రకుల యువత ఎదురు తిరిగి నిలబడితే ఈ సమస్య త్వరగా పరిష్కారం అవుతుంది. చదువుకుని ఉద్యోగం చేసుకుంటున్న ఒక దళిత అబ్బాయి, అగ్రకులంలోని ఒక పేదింటి అమ్మాయిని పెళ్లి చేసుకుంటే పెత్తందారులు సహించటం లేదు. రిజర్వేషన్లకు ఆర్థిక ప్రాతిపదిక ఉండాలని కోరే వాళ్లు ముందుగా ఇలాంటి కులాంతర వివాహాలకు మద్దతివ్వాలి. తద్వారా సామాజిక అంతరాలు తగ్గిపోతే ఆర్థిక ప్రాతిపదికపై విధివిధానాలు రూపొందించుకోవచ్చు. మరికొంత మంది రిజర్వేషన్ల వల్ల మెరిట్‌ దెబ్బతింటుందంటున్నారు. విద్యా రంగంలో ప్రైవేటు రంగం ప్రవేశించాక మెరిట్‌కు బదులు డబ్బున్న వారికే సీట్లు ఇస్తున్నారు. మెరిట్‌ దెబ్బతింటుందని బాధపడేవారు ముందుగా విద్యారంగంలో ప్రైవేటీకరణను వ్యతిరేకించాలి. ఇలాంటి డిమాండ్లు లెవనెత్తేవారిలో తాము వెనుకబడిపోతున్నామన్న బాధ కంటే తమ కన్నా కింది కులస్థులు తల ఎత్తుకుంటారనే భయమే ఎక్కువగా కనిపిస్తుంది. అగ్రకులాల్లోని అభ్యుదయ యువత ఇటువంటి ధోరణులకు వ్యతిరేకంగా ముందుకు రావాలి.
అత్యాచారాలు-దాడులు
ఈ కాలంలో దళితులపై భౌతిక దాడులు పెరిగాయి. ప్రతి రోజూ సగటున 100కు పైగా వివిధ రకాల అఘాయిత్యాలు నమోదవుతున్నాయి. ప్రత్యేకంగా దళిత మహిళలపై అత్యాచారాలు పెరుగుతున్నాయి. వీరికి రక్షణ కల్పించాల్సిన ప్రభుత్వం, ప్రభుత్వ యత్రాంగం పెత్తందార్లకు కొమ్ముకాస్తోంది. దళితులపై సాగుతున్న దాడులను అరికట్టడానికి ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టాన్ని (పిఒఎ యాక్ట్‌) సవరించాల్సి ఉంది. ఈ చట్టం దుర్వినియోగం అవుతోందని కొందరు ప్రచారం చేస్తున్నారు. అసలు వినియోగంలోకే రాకుంటే, దుర్వినియోగం అనే ప్రశ్న ఎక్కడ తలెత్తుతుంది. దుర్వినియోగం పేరుతో నేరస్థులను కాపాడటం క్షంతవ్యం కాదు. ఉదాహరణకు మామూలు నేరాల్లో 31 శాతం మందికి శిక్షలు పడుతుండగా ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద 23 శాతానికి మాత్రమే శిక్షలు పడుతున్నాయి. అందులో అప్పీలు తర్వాత చాలా కేసులు ఎగిరిపోతున్నాయి. కేవలం సాంకేతిక కారణాలపై కూడా కేసులు కొట్టేస్తున్నారు. గత కాంగ్రెస్‌ నాయత్వంలో యుపిఎ ప్రభుత్వం భూస్వామ్య శక్తుల ఒత్తిళ్లకు లొంగి ఆఖరి నిమిషంలో ఎన్నికలకు ముందు ఆర్డినెన్స్‌ రూపంలో ఈ చట్టానికి సవరణలు తెచ్చింది. ఆ తరువాత అధికారంలోకి వచ్చిన మోడీ ప్రభుత్వం దీన్ని మూలన పడేసింది. కార్పొరేట్ల కోసం భూ సేకరణ చట్టానికి సవరణలు తెస్తూ ప్రతిఘటన కూడా లెక్కచేయకుండా మూడుసార్లు ఆర్డినెన్స్‌ తెచ్చింది. దానికి చట్ట రూపం ఇవ్వటానికి అన్ని పార్టీలతో లాబీలు చేసింది. అదే బిజెపి అత్యాచార నిరోధక చట్ట సవరణలు లోక్‌సభలో పెట్టి, రాజ్యసభలో పెట్టకుండా నిర్లక్ష్యం వహిస్తోంది. ఈ చట్ట సవరణలు అసమగ్రంగా ఉన్నా దానికి వెంటనే చట్ట రూపం తేవాల్సిన అవసరం ఉంది. 
కొనసాగుతున్న అంటరానితరం
స్వచ్ఛ భారత్‌ పేరుతో హడావుడి చేస్తున్న కేంద్ర ప్రభుత్వం అపరిశుభ్రత కన్నా అనాగరికంగా ఉన్న అంటరానితనం, సామాజిక వివక్షను నిర్మూలించటానికి ఎలాంటి ప్రచార కార్యక్రమం చేపట్టలేదు. మనిషిని మనిషిగా చూసే సమాజం లేకుండా స్వచ్ఛ భారత్‌ అనే నినాదమే వ్యర్థం. అంటరానితనం నిర్మూలించినప్పుడే నిజమైన స్వచ్ఛ భారత్‌ అవతరిస్తుంది. 2011లో సామాజిక ఆర్థిక గణాంకాలు సేకరించినా, కులాల వారీ అసమానతలు ఎలా ఉన్నాయో బయట పెట్టలేదు. కుల అసమానతలు బయట పెడితే హిందూత్వ మతోన్మాద ప్రాజెక్టు భగమౌతుందని బిజెపి, ఆరెస్సెస్‌ భయం. అందుకే కుల గణాంకాలను విడుదల చేయకుండా ఆపారు. కుల సమస్యను పరిష్కరించకుండా మత విద్వేషాలు రెచ్చగొట్టడంపైనే వారికి ఆసక్తి ఉంది. మత మార్పిడి పేరుతో దళిత, గిరిజనులపై దాడులు చేస్తున్నారు. బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌ మతోన్మాద ఎజెండాను ఓడించకుండా సామాజిక న్యాయాన్ని సాధించలేము.
ఈ సమస్యలన్నీ చర్చించి వాటిని పరిష్కరించాలని డిమాండు చేయడానికే దళిత పార్లమెంటు కార్యక్రమం జరుగుతుంది. ఇది ఉద్యమ ఆరంభం మాత్రమే. సామాజిక న్యాయం, దళితుల సంక్షేమం, అభివృద్ధి కోసం ప్రభుత్వం నిర్దిష్ట చర్యలు చేపట్టేదాకా ఈ ఆందోళన విశాల ప్రాతిపదికపై బహుముఖంగా కొనసాగాలి. అదే మనం అంబేద్కర్‌కు అందించే నివాళి.
- వి శ్రీనివాసరావు
(వ్యాసకర్త సిపిఎం కేంద్ర కార్యదర్శివర్గ సభ్యులు)