
హైదరాబాద్‌లోని సెంట్రల్ వర్సిటీలో ఐదుగురు దళిత విద్యార్థులపై సస్పెన్షన్ ఎత్తివేయాలని మంగళవారం పలు చోట్ల ఆందోళనలు చేశారు. రౌండ్ టేబుల్ సమావేశం, దిష్టిబొమ్మల దహనం, వినతిపత్రాలు తదితర కార్యక్రమాలు నిర్వహించారు. బండారు దత్తాత్రేయను బర్తరఫ్ చేయాలని, వీసీని బాధ్యతల నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు.విద్యార్థులను బహిష్కరించడం హేయమైన చర్య అని భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్‌ఎఫ్‌ఐ) రాష్ట్ర కమిటీ సభ్యులు డీ మల్లేష్ మంగళవారం ఒక ప్రకటనలో విమర్శించారు. దీనికి నిరసనగా బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు నిర్వహించనున్నట్టు తెలిపారు. యూనివర్సిటీల్లో దళిత విద్యార్థులు ఏబీవీపీ విద్యార్థులపై దాడి చేశారని ఆరోపిస్తూ అధికారులు విద్యార్థులను బహిష్కరించడం సిగ్గుచేటన్నారు. యూనివర్సిటీ పాలక మండలి సభ్యులే దళిత విద్యార్థులు దాడి చేయలేదని స్పష్టం చేసినా, బీజేపీ మతోన్మాద రాజకీయ నేతల మాటలు విని విద్యార్థులను బహిష్కరించడం అన్యాయమన్నారు.