దళిత జీవన చిత్రణ

తెలుగు నవలా సాహిత్యంలో దళిత జీవన చిత్రణ

స్వాతంత్య్రానంతర తెలుగు నవల్లో దళితాభ్యుదయం ప్రతిభావంతంగా రూపుకట్టడానికి సుదీర్ఘమైన నేపథ్యం వుంది. తెలుగులో తొలి నవలలుగా చెప్పబడే నరహరి గోపాలకృష్ణమ్మశెట్టి వ్రాసిన ‘‘శ్రీరంగరాజ చరిత్ర’’, కందుకూరి వీరేశలింగం వ్రాసిన ‘‘రాజశేఖర చరిత్ర’’ (1878) నవలల్లో దళిత సమస్యల చిత్రణ రేఖా మాత్రంగా వుంది. దీన్ని బట్టి నవల ప్రక్రియ పుట్టుకతోనే దళితాంశాన్ని స్వీకరించినట్లు తేటతెల్లమౌతుంది. జాతీయోద్యమంలో భాగంగా వచ్చిన సంఘ సంస్కరణోద్యమం సంఘంలోని అనేక చీకటి కోణాల మీద వెలుగును ప్రసరింపచేసింది. అందులో భాగంగానే హరిజనోద్ధరణ, స్త్రీ జనోద్ధరణ, విద్య పట్ల నూతన దృక్పథం, మూఢాచార నిరసన వంటివి ఆ కాలపు రచనలకు ప్రధాన వస్తువులయ్యాయి. 

దళితా నవలా సాహిత్యంలో వెలుగుచూసిన తొలి నవలగా తల్లాప్రగడ సూర్య నారాయణ రాసిన ‘‘హేలావతి’’ (1913)ను చెప్పుకోవచ్చు. తెలుగులో మొదటి నవల శ్రీ రంగరాజు చరిత్రలో ఎలాగైతే పూర్తి నవలా లక్షణాలు కనిపించలేదో, దళిత నవలా సాహిత్యంలో కూడా మొదటిదిగా పేర్కొనబడుతున్న తల్లాప్రగడ వారి హేలావతి నవలలో కూడా దళిత జీవన చిత్రణ ఉంది గానీ దళిత చైతన్యం కనిపించలేదు. సాంఘిక వ్యవస్థ, వర్ణ వ్యవస్థలను గురించిన నిశితమైన విమర్శ ఈ నవల్లో కనిపిస్తుంది. హరిజనోద్ధరణ ప్రధానంగా కనిపించడమే కాకుండా, సంఘలోని అన్యాయాల్ని పోగొట్టడానికి కావాల్సిన మార్గన్వేషణాంశాలు ఈ నవలలో చక్కగా చిత్రించారు. వేంకట పార్వతీశ్వర కవులు రాసిన ‘‘మాతృమందిరం’’ (1919) నవలలో దుష్టులకు శిష్టగుణాలు అలవర్చడం, అనాధలలో ఆత్మ విశ్వాసాన్ని కల్పించడం, వారిని భావి భారత పౌరులుగా దేశాభ్యుదయానికి సేవ చేసేవారుగా చేయడం ఈ నవల ప్రధానోద్దేశంగా కనిపిస్తుంది. 

....డాక్టర్‌ తన్నీరు కళ్యాణ్‌ కుమార్‌