దళితుల భూముల జోలికొస్తే ఖబడ్దార్‌

దళితుల భూముల జోలికొస్తే ఖబడ్దార్‌ అంటూ టిడిపి నాయకులను సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు హెచ్చరించారు. ఒక్కసెంటు కూడా ఇతరులకు పోనివ్వబోమని స్పష్టం చేశారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేట మండలం యడవల్లిలో 40 ఏళ్ల కిందట దళితులకు కేటాయించిన 416 ఎకరాల సాగు భూమిని అధికార పార్టీ నాయకులు కాజేయాలని చూస్తున్న నేపథ్యంలో సంబంధిత పొలాలను మధు ఆధ్వర్యంలో శుక్రవారం పరిశీలించారు. ఈ భూములను 1975లో అప్పటి జిల్లా కలెక్టర్‌ కత్తి చంద్రయ్య దళితులను సొసైటీగా ఏర్పాటు చేసి భూమినిచ్చారు. ఇందులో గ్రానైట్‌ నిక్షేపాలున్నాయని తెలుసుకున్న అధికార పార్టీ నాయకులు.. ఈ భూములను కొట్టేయాలని అక్రమ రిజిస్ట్రేషన్లకూ పూనుకున్నారు. ఈ క్రమంలో ఆ భూములను పి.మధు పరిశీలించి హక్కుదార్లతో మాట్లాడారు. భూములను కాపాడుకునేందుకు దళితులకు సిపిఎం పూర్తి అండనిస్తుందని స్పష్టం చేశారు. దీనిపై ఆరో తేదీ నుంచి ప్రత్యక్ష కార్యాచరణకు పూనుకుంటామని వెల్లడించారు. అక్రమ రిజిస్ట్రేషన్లు చేసిన భూములను తిరి గివ్వకుంటే అదే భూములను దున్నే కార్యక్రమాన్ని 6వ తేదీ నుంచి ప్రారంభిస్తామన్నారు. సొసైటీ సభ్యులను విడగొట్టి అక్రమంగా రిజిస్ట్రేషన్లకు పూనుకోవటం దారుణమన్నారు. ఒకే పట్టా క్రింద 416 ఎకరాల భూమిని కేటాయిస్తే, 9 ఎకరాల భూమిని ఇటీవల అక్రమ రిజిస్ట్రేషన్‌ చేసినట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. దీని వెనక మంత్రులు, ఎంత పెద్దస్థాయి నాయకులున్నా తగ్గే ప్రసక్తే లేదన్నారు. యడవల్లితో పాటూ గోపాళంవారిపాలెం, పోతవరం, వేలూరు, పసుమర్రు గ్రామాల్లోని దళితుల భూములనూ కాజేయటానికి బడాబాబులు యత్నిస్తున్నారని విమర్శించారు. ఉమ్మడిగా పట్టా ఇచ్చిన భూములను విడగొట్టడానికి ఎవ్వరికీ అధికారం లేదని, దీనిపై రెవెన్యూ మంత్రి, సిఎం దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. అవసరమైతే కోర్టులో పిటీషన్‌ వేసి అక్రమ రిజిస్ట్రేషన్లను అడ్డుకుంటామన్నారు. స్థానిక దళితులు మాట్లాడుతూ ఒకరిద్దరినీ ప్రలోభాలకు గురిచేసి భూములను స్వాధీనం చేసుకునేందుకు మంత్రి పత్తిపాటి పుల్లారావు అనుచరులు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. స్థానిక సర్పంచ్‌తో పాటూ మంత్రి పుల్లారావు అనుచరులు సాగిస్తున్న కుంభకోణాలను బహిర్గతం చేస్తామన్నారు.