దళితుల భూములపై ప్రభుత్వ పెత్తనం తగదు

దళితుల భూములపై ప్రభుత్వ పెత్తనం తగదు సిపిఎం జిల్లా కార్యదర్శి పాశం రామారావు యడవల్లిలో భూములను పరిశీలించిన సిపిఎం బృందం బాధిత రైతులతో సమావేశం, వివరాలు సేకరణ.

సిపిఎం జిల్లా కార్యదర్శి పాశం రామారావు మాట్లాడుతూ పట్టాదారులైన ఎస్‌సిలకు తెలియకుండానే వారి పేరుతో ఉన్న సొసైటీని రద్దు చేసి సంబంధిత భూములను అధికార పార్టీకి చెందిన నాయకులే స్వాధీనం చేసుకునేందుకు రంగం సిద్ధం చేశారన్నారు. ముందస్తుగా లభ్దిదారులకు ఎటువంటి నోటీసులు, సమాచారం లేకుండా అధికారాన్ని అడ్డు పెట్టుకుని సంబంధిత అధికారితో సొసైటీని రద్దు చేయటం భావ్యం కాదన్నారు. గత కొద్దికాలంగా ఈ వ్యవహారంపై విస్తృత స్థాయిలో ప్రచారం జరుగుతున్నా, స్థానిక శాసనసభ్యుడు, రాష్ట్ర మంత్రి పత్తిపాటి పుల్లారావు స్పష్టమైన వైఖరిని తెలియజేయక పోవటం పలు అనుమానాలకు దారి తీస్తుందన్నారు. 2014లో టిడిపి అధికారం చేపట్టిన నాటి నుంచి తొలి సంవత్సరమే భూమిలో ఖనిజ నిక్షేపాలున్నాయని మైనింగ్‌ అధికారులతో, గత సంవత్సరం భూమి సాగుకు యోగ్యం కాదని మంత్రి పత్తిపాటి పరిధిలోని వ్యవసాయశాఖకు చెందిన అధికారులతో తప్పుడు నివేదికలు ప్రభుత్వానికి అందించా రన్నారు. వాటికి తోడు ఈ సంవత్సరం సొసైటీని రద్దు చేసి 416 ఎకరాల భూమిని ప్రభుత్వమే స్వాధీనం చేసుకునిఅధికార పార్టీకి చెందిన నాయకులు పంచుకునేందుకు రంగం సిద్ధం చేసుకోవటం భావ్యం కాదన్నారు. దళితులకు చెందిన భూమిలో ఒక్క సెంటుపై ప్రభుత్వం పెత్తనం చలాయించినా ప్రధాన ప్రతిపక్ష పార్టీలతో పాటూ వామపక్షాలు, ప్రజాసంఘాలు, దళిత సంఘాలను కలుపుకుని సిపిఎం ఉద్యమాన్ని ఉధృతం చేస్తుందని హెచ్చరించారు.