దళితులను పట్టించుకోరా?

 తరతరాలుగా సమాజంలో వేళ్లూనుకున్న కుల వివక్షను అంతం చేయకుండా దేశాన్ని అభివృద్ధి బాట పట్టిస్తామని ఏ ప్రభుత్వమైనా ప్రచారం లంకించుకుంటే అంతకన్నా మోసం ఉండబోదు. స్వాతంత్య్రం సిద్ధించి ఇన్నేళ్లయినా అన్నింటా దళితులు అట్టడుగున ఉన్నారంటే ఏలికల వైఫల్యమే కారణం. దళితుల ఓట్లతో గద్దెనెక్కుతున్న ప్రభుత్వాలు అనంతరం వారిని, వారికి ఇచ్చిన హామీలను విస్మరించడం దుర్మార్గం. పాలకుల నయవంచన వల్లనే దళితుల బతుకులు నానాటికీ తీసికట్టు అవుతున్నాయి. అంటరానితనాన్ని రూపు మాపాలని రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌ ఉద్యమించగా, ఆయన ఫొటో పెట్టుకొని ప్రభుత్వాలు రాజకీయాలు చేస్తున్నాయి మినహా ఆయన ఆశయసిద్ధిని వంటబట్టించుకున్న దాఖలా లేదు. దళితులను కేవలం ఓటు బ్యాంక్‌గా చూస్తూ, కులాల కుంపట్లు రగిల్చి పబ్బం గడుపుకునే స్వార్ధ రాజకీయాలు స్వైర విహారం చేస్తున్న ఆందోళనకర పరిస్థితుల్లో దళిత శోషన్‌ ముక్తి మంచ్‌ (డిఎస్‌ఎంఎం) దళితులందరి అభ్యున్నతి కోసం దేశ వ్యాప్త ఉద్యమానికి నడుంకట్టడం అభినందనీయం. రాజధాని ఢిల్లీలో శని, ఆదివారాల్లో ఆ సంస్థ నిర్వహించిన సదస్సు, దళిత మాక్‌ పార్లమెంట్‌లో చర్చించిన అంశాలు ఆలకిస్తే దళితుల గోడు అర్థమవుతుంది. దళితులకు భూమిపై హక్కు లేదు. 92 శాతానిపైగా కటిక దారిద్య్రంలో మగ్గుతున్నారు. సగటు మానవాభివృద్ధి సూచీలన్నింటా వారిది అట్టడుగు స్థానమే. దేశంలో అందరికంటే వారు దైన్య స్థితిలో ఉన్నారంటే ప్రభుత్వాలు సిగ్గు పడాలి. తల దించుకోవాలి. శిశు మరణాల్లో ఎస్సీలకు చెందిన పిల్లలు 88 శాతం. నలభై శాతం మందికి ఇళ్లు లేవు. కేంద్ర అధికారిక లెక్కల ప్రకారమే దారిద్య్రరేఖకు దిగువన ఎస్టీలు 38 శాతం ఉండగా ఎస్సీలు 44 శాతం మంది ఉన్నారు. ఎస్సీలపై రోజుకు వంద దాడులు జరుగుతున్నాయని సర్కారు గణాంకాలే వెల్లడించాయి. ప్రతి రోజూ ముగ్గురు దళిత మహిళలు అత్యాచారానికి గురవుతున్నారు. ఇంత కాలం ప్రభుత్వాలు ఎత్తుకున్న దళితుల అభివృద్ధి నినాదం ఎలా అఘోరించిందో తెలియజెప్పడానికి ఈ దృష్టాంతాలు చాలు.
ప్రభుత్వాలు అవలంబించిన ఉద్దేశపూర్వక నిర్లక్ష్యానికి తోడు అవి తలకెత్తుకున్న నయా-ఉదారవాద ఆర్థిక విధానాలతో దళితుల జీవితాలు చిన్నాభిన్నం కావడం ఆందోళనకరం. సామాజిక దోపిడీకి విసృంఖల ఆర్థిక దోపిడీ కలగలిసి వారిని మరింత అట్టడుగుకు అణగదొక్కుతున్నాయి. పాతిక సంవత్సరాల సరళీకరణ విధానాలు రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్లను ప్రశ్నార్ధకం చేశాయి. అంతకంతకూ ప్రభుత్వరంగం కుదించుకుపోతుండటంతో ఉద్యోగాల్లో రిజర్వేషన్లు అమలు కాక ఉపాధి అవకాశాలు దిగజారుతున్నాయి. శాశ్వత ఉద్యోగాల స్థానంలో కాంట్రాక్టు, ఔట్‌సోర్స్‌ నియామకాలు చేపట్టడంతో దళితులకు రాజ్యాంగం నిర్ధేశించిన కోటా ఉనికికే ప్రమాదం ఏర్పడింది. ప్రభుత్వ, ప్రభుత్వరంగ, ప్రభుత్వ నిధులతో నడిచే వ్యవస్థల్లోనే రిజర్వేషన్ల అమలు అస్తవ్యస్తంగా ఉండగా ఎలాంటి నియంత్రణా, చట్టబద్ధత లేకుండా ఇష్టారీతిన నడుస్తున్న ప్రైవేటురంగంలో రిజర్వేషన్లు అమలవుతాయా? ప్రైవేటులో తమ అనుకున్నవారికే ప్రవేశం. ఐటి వంటి ఉద్యోగాల్లో ఎస్సీలు నాలుగు శాతం కూడా లేరు. రిజర్వేషన్ల వలన మెరిట్‌కు అన్యాయం జరుగుతోందనే కొన్ని వర్గాల ప్రచారం ప్రైవేటులో పొసగదు. డబ్బున్నవారికే సీట్లు, ఉద్యోగాలైతే ఇక మెరిట్‌కు చోటెక్కడీ ప్రైవేటీకరణ, సరళీకరణలకు వంతపాడుతూ రిజర్వేషన్లను వ్యతిరేకించడం పాలకులు, కొన్ని వర్గాల వ్యూహాత్మక ఎత్తు. కాగా నయా-ఉదారవాద విధానాలు దళితుల్లో చీలికలు తేవడం ఆందోళనకరం. 
దళితుల సంక్షేమం, అభివృద్ధికి ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన పథకాలు, తీసుకొచ్చిన చట్టాలు అంతకంతకూ కొడిగట్టడం దారుణం. బడ్జెట్‌లో జనాభా దామాషా ప్రకారం ఎస్సీ, ఎస్టీలకు నిధులు కేటాయించేందుకు 1980లలో తీసుకొచ్చిన సబ్‌ప్లాన్‌ వెక్కిరిస్తోంది. ఆ వర్గాలకు చెందాల్సిన నిధులు దశాబ్దాలుగా పక్కదారి పడుతున్నాయి. దీంతో దళిత వాడలు విద్య, పారిశుధ్యం, విద్యుత్‌ వంటి కనీస వసతులలేమితో మగ్గుతున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సబ్‌ప్లాన్‌పై పెద్ద ఉద్యమం నడిచింది. ఆందోళనలకు తలొగ్గిన అప్పటి సర్కారు సబ్‌ప్లాన్‌కు చట్టబద్ధత కల్పించింది. అలాగే కేంద్రంలోనూ, రాష్ట్రాల్లోనూ సబ్‌ప్లాన్‌కు చట్టబద్ధత కల్పించాలి. ఎస్సీ సబ్‌ప్లాన్‌ను అమలు చేయకుండా మోడీ సర్కారు చేపట్టిన స్వచ్ఛ భారత్‌ నినాదం నిష్ఫలం. ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం ఉన్నా దాడులు ఆగట్లేదు. చట్టంలోని లొసుగులు, సమాజంలో వివక్ష, దళితులకు న్యాయాన్ని దూరం చేస్తున్నాయి. అట్రాసిటీ చట్టాన్ని పటిష్టపర్చేందుకు సవరణలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బిజెపి సర్కారు వచ్చాక దళితులపై దాడులు పెరిగాయి. కాప్‌ పంచాయతీలు, కుల దురహంకార హత్యలు అధికమయ్యాయి. మత మార్పిడుల పేర దళితులు, ఆదివాసీలపై సంఘ పరివారం దాష్టీకాలు పెచ్చుమీరాయి. సమాజంలో ఒక పెద్ద భాగం ఎదుర్కొంటున్న ఈ సమస్యలపై పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి చర్చించాలన్న డిమాండ్‌ సహేతుకమైంది. కేంద్రం అందుకు స్పందించాలి. దళితులు, మేధావులు, ప్రజాతంత్ర వాదులు ఐక్య ఉద్యమాలతో ప్రభుత్వ మెడలు వంచాలి.