దళితులకు సముచితస్థానం:CPM

రాజధాని ప్రాంతం నుండి పేదలను, దళితులను తరిమివేసేందుకు పాలకులు కుట్రలు చేస్తున్నారని ఈ కుట్రలకు వ్యతిరేకంగా పేదలంతా ఐక్యమై పోరాటాలకు సిద్ధం కావాలని సిపిఎం రాజధాని డివిజన్‌ కార్యదర్శి ఎం.రవి అన్నారు. ఎస్‌సి, ఎస్‌టి రైట్స్‌ అండ్‌ యాక్ట్స్‌ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో మంగళగిరి అంబేద్కర్‌ సెంటర్లో శుక్రవారం దళిత దీక్ష జరిగింది. ఈ దీక్షను బిఎస్‌ఎన్‌ఎల్‌ ఎస్‌డిఈ దుంగా రత్నప్రదీప్‌ ప్రారంభించారు. దీక్షనుద్దేశించి రవి మాట్లాడుతూ రాజధానిలో దళితులకు స్థానం లేకుండా చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందని, దళితుల పట్ల పాలకులు వివక్షత చూపుతున్నారని దళితులుగా ఉన్న అసైన్డ్‌ సాగుదారులకు కౌలు చెక్కులు ఇప్పటివరకు ఒక్కరికి కూడా ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని వ్యవసాయ కూలీలకు పెన్షన్‌ సక్రమంగా ఇవ్వడంలేదని అన్నారు. దళితులు పెద్ద సంఖ్యలో నివసిస్తున్న లంక గ్రామాలైన తాళ్ళాయపాలెం, ఉద్ధండ్రాయునిపాలెం, లింగాయపాలెం, గ్రామాలను రాజధాని నిర్మాణం పేరుతో తొలగించేందుకు ప్రయత్నించి వారు ఎదురుతిరగడంతో వెనక్కు తగ్గారని అన్నారు. దళితులు పేదల సమస్యలు కొరకు నిరాహారదీక్ష చేపట్టిన నిర్వాహకులకు రాజధాని కమిటీ తరపున అభినందనలు తెలిపారు.