దళితులకు అందని రాజ్యాంగ ఫలాలు..

ప్రతి భారతీయుడి కంట తడిని తుడిచివేయాలన్న స్వాతంత్య్ర సమరయోధుల ఆకాంక్షలను నెరవే ర్చేందుకు ప్రతి పౌరునికీ సామాజిక, ఆర్థిక, రాజకీయ సమానత్వం కల్పిం చాలనే లక్ష్యంతో మన రాజ్యాంగం ఏర్పడింది. రాజ్యాంగం కల్పించిన హక్కులు, రాజ్యాంగ ఫలాలు దళితులకు అందాయా అని ప్రశ్నించుకుంటే ఎక్కడవేసిన గొంగళి అక్కడే ఉన్నట్టు ఉంది. రాజ్యాంగ ఫలాలు అందక పోగా మిగతా హక్కులను కూడా గుంజుకుం టున్నారని స్పష్టమౌతోంది. దళితులు నేటికీ అమానుషమైన కులవివక్ష, అంటరానితనం, దాడులు, అవమానాలు, సాంఘిక బహిష్కరణలు, హత్యలు, అత్యాచారాలకు గురవుతున్నారు. అగ్రకుల అహంకారానికి బలౌతున్నారు. ఇష్టపడి ఆహారం తినడానికిలేదు. తన భావాలను చెప్పుకునే స్వేచ్ఛలేదు. బయటకు వస్తే దాడులు, అవమానాలు. వీటికి వ్యతిరేకంగా సామాజిక, రాజకీయ, ఆర్థిక సమానత్వం కోసం మరో సామాజిక న్యాయానికి సన్నద్ధమయ్యే సమయం ఆసన్నమైంది.
రాజ్యాంగ రచనకు అవకాశం అంబేద్కర్‌కు రాకముందు, కొన్ని దేశాలకు రాజ్యాంగం రాసిన వ్యక్తిని భారతదేశానికి రాజ్యాంగం రాయమని అడిగినప్పుడు, తాను రాసిన రాజ్యాంగాలన్నీ అంబేద్కర్‌ పిహెచ్‌డిల నుంచి రాసినవేననడం గమనార్హం. వివిధ దేశాల రాజ్యాంగాలను అధ్యయనంచేసి, రాజ్యాగ సభ నిర్ణయాలకు అనుగుణంగా ముసాయిదాను తయారు చేశారు. మన రాజ్యాంగ పీఠికలోని వివిధ అంశాలతో పాటు, పౌరులందరికీ సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగంలో సమన్యాయం కల్పించాలని నిర్దేశించింది. వాటి అమలు కోసం చట్టసభలు, పరిపాలన, న్యాయవ్యవస్థలను రూపొందించింది. ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజా ప్రతినిధులు లోక్‌సభ, రాజ్యసభల్లో చట్టాలను రూపొందించి వాటి అమలుకు కృషిచేయాలి. చట్టాలను ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు అమలు చేయాలని, న్యాయ వ్యవస్థ చట్టాన్ని విశ్లేషిస్తూ, న్యాయాన్ని ప్రకటించాలి, న్యాయం అమలుకు ఆదేశించాలి. కానీ రాజ్యాంగం అమల్లోకి వచ్చిన దగ్గర్నుంచి దేశం, రాష్ట్రంలో అగ్రకుల భూస్వాములు, పెట్టుబడిదారులే పాలకులైనందు వల్ల పై మూడు వ్యవస్థలు ఎస్సీ, ఎస్టీ, పేదల సామాజిక, ఆర్థిక, రాజకీయ సమస్యలు పరిష్కరించకపోగా ఆటంకంగా మారాయి. సామాజిక సమస్యలు పరిష్కరించేందుకు ప్రాథమిక హక్కుల్లో ఆర్టికల్‌ 14 చట్టం ముందు అందరూ సమానులే, అందరికీ సమాన రక్షణ కల్పిస్తుంది. ఆర్టికల్‌ 15 కులం, మతం, లైంగికత, పుట్టిన ప్రదేశాల ఆధారంగా ఎలాంటి వివక్ష, అంటరానితనం నిషేధించింది. ఆర్టికల్‌ 17 అంటరానితనాన్ని నిషేధించి, నిర్మూలించాలని ఆదేశించింది. వీటిని ఆధారం చేసుకుని పౌరహక్కుల చట్టం 1955, ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం 1989 నిబంధనలు, 1998 కెవిపిఎస్‌ ఉద్యమ ఫలితంగా ఏర్పడిన జస్టిస్‌ పున్నయ్య కమిషన్‌ సిఫారసులు, 2001 ఆధారంగా ఏర్పడిన జీవోలు ఉన్నప్పటికీ అడుగడుగునా కుల వివక్ష, అంటరానితనం, లైంగిక వివక్ష వికృత రూపాల్లో విలయతాండవం చేస్తున్నాయి. దాడులు, అత్యాచారాలు, సాంఘిక బహిష్కరణలు నిరాటంకంగా కొనసాగుతున్నాయి.
విజయవాడలో రక్షణ కల్పించాల్సిన పోలీసులు పుట్ల దుర్గతో మద్యం తాగించి వ్యభిచారి అని ముద్ర వేసి దారుణంగా కొట్టారు. రాజమండ్రి తహశీల్దారు దళితుల భూమిలో గుడి కట్టొద్దన్నందుకు అర్జీ ఇస్తామని పిలిచి దారుణంగా సంఫ్‌ుపరివార్‌ శక్తులు దాడిచేశాయి. విశాఖ జిల్లా తురువోలు దళితులు పొలాలకు బాట ఏర్పాటు చేసుకుంటుండగా ఆగ్రహించిన పెత్తందారులు మీ బాటలకు మేం ఆక్రమించు కున్న పొలాలే కావాలా అని కులాన్ని సంబోధించి బూతులు తిట్టి కొట్టగా కేసు పెట్టినందుకు మాపైనే కేసులు పెడతారా అంటూ ఊళ్లోకి రావద్దని సాంఘిక బహిష్కరణ చేశారు. ఇలాంటి ఘటనలే తూర్పుగోదావరి, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, కర్నూలు, కడప జిల్ల్లాల్లో అనేకం చోటుచేసుకున్నాయి.
రాజ్యాంగంలోని 4వ భాగంలో ఆర్టికల్‌ 36 నుంచి 51 వరకు ఆదేశిక సూత్రాల్లో దేశ సంపద, వనరులు కొద్ది మంది చేతిలో కేంద్రీకరించకుండా అన్ని వర్గాల ప్రజలకు సమానంగా పంపిణీ చేయాలని, పౌరులందరికీ గౌరవప్రదమైన జీవన ప్రామాణాలు, జీవనోపాధి కల్పించి స్త్రీ, పురుషులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, ఆరోగ్య భద్రత కల్పించాలని పేర్కొన్నది. ప్రత్యేకించి సామాజిక న్యాయం, దోపిడీ నుంచి రక్షణ, విద్యావకావకాశాలతోపాటు ఆర్థిక ప్రయోజనాలు కాపాడాలని పేర్కొంది. సంపదలు, వనరులు కొద్ది మంది చేతిలో పోగై ఉన్నాయి. దళితులు, పేదలు మరింత పేదలుగా మారుతున్నారు. ఆదేశిక సూత్రాలు కాగితాలకే పరిమితమ య్యాయి. రాష్ట్రంలో దళితులు 17,27,078 కుటుంబాల్లో 84,45,398 మంది అంటే 17.10 శాతం ఉన్నారు. వీరిలో 40 శాతం నిరక్షరాస్యులు. అత్యధికులు భూమిలేని కూలీలుగా ఉన్నారు. భూమి ఉన్నా ఆ భూమి అగ్రకుల భూస్వాముల చేతుల్లో ఉంది. ఈ మధ్య ప్రభుత్వమే పూలింగ్‌ పేరుతో దళితుల భూములను బందరు పోర్టు, భోగాపురం పోర్టు, కారిడార్‌, విద్యాసంస్థలు, వివిధ రకాల పేర్లతో లాక్కుంటోంది. తాతల కాలం నుంచి పండించుకుంటున్న భూముల్లో నీరు, చెట్టు పేరు చెప్పి చెరువులు, కాలువలు తవ్వించి మట్టి రూపంలో పచ్చచొక్కాలకు వేల కోట్ల రూపాయలు దోచి పెడుతోంది. ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా భూమి కొనిస్తామన్న 'భూమి కొనుగోలు' పథకం అటకెక్కింది.
రాష్ట్ర ప్రభుత్వం 1951-52 నుంచి 2013-14 వరకు 65 సంవత్సరాల్లో రాష్ట్ర బడ్జెట్‌లో రూ.3 లక్షల కోట్లు ఖర్చు చేసింది. ఎస్సీ సబ్‌ ప్లాన్‌ ప్రకారం దళితులకు 16.2 శాతం అంటే రూ.48 లక్షల కోట్లు కేటాయించి ఖర్చు చేయాలి. కానీ రూ.10 లక్షల కోట్లు కూడా ఖర్చు చేయలేదు. అందులోనూ 50 శాతం దళితేతురుల కోసం ఖర్చు చేశారు. దళితుల పథకాలు పక్కదారి పట్టించారు. కోత విధించారు. రాష్ట్రంలో ఉన్న వివిధ బ్యాంకులు వ్యవసాయానికి ఇస్తున్న రుణాల్లో ఎస్సీలకు 16.2 శాతం ఇవ్వాలన్న రిజర్వుబ్యాంకు నిబంధనలు అమలు జరగడంలేదు. దళితుల్లో పౌష్టికాహార లోపం వల్ల అత్యధికులు చనిపోతున్నారు. శిశు మరణాలు పెరుగుతున్నాయి. బాలింత లు రక్తహీనతకు గురవుతున్నారు. హాస్టల్‌ విద్యార్థులకు సరైన ఆహారం అందడంలేదు. పాలకులు అనుసరించిన విధానాల వల్ల ప్రభుత్వరంగం తగ్గి ప్రయివేటురంగం పెరిగిపోతోంది. ప్రభుత్వ రంగంలో కాంట్రాక్ట్‌, ఔట్‌ సోర్సింగ్‌కు పెద్ద పీట వేస్తున్నారు.
లోక్‌సభ, శాసనసభల్లో రాజ్యాంగం రిజర్వేషన్లు కల్పిం చినా రాజ్యసభలోనూ, న్యాయమూర్తుల నియామకాల్లోనూ రిజర్వేషన్లు అమలు కాక మేధావుల సభలో, న్యాయస్థానాల్లో ఎస్సీ, ఎస్టీలు అవకాశాలు కోల్పోతున్నారు. సామాజిక న్యాయం కొరవడింది. ప్రయివేటు సంస్థలు పెట్టుబడులకు బ్యాంకుల నుంచి రుణాలు, భూమి, నీరు, కరెంటు, రవాణా, తదితర రాయితీలు ప్రభుత్వం నుంచి పొందుతున్నాయి. కానీ ప్రయివేటు రంగంలో రిజర్వేషన్లు అమలు చేయడంలేదు. సామాజిక న్యాయంలో అన్యాయం జరుగుతోంది.  మనది లౌకిక దేశం. మత స్వేచ్ఛను రాజ్యాంగం కల్పించింది. దేశంలో హిందూ, సిక్కు, బౌద్ధ మతాలు అవలంబించిన ఎస్సీలకు ఎస్సీ రిజర్వేషన్లు వర్త్తిస్తున్నా క్రైస్తవ, మరి ఇతర మతాలను అను సరిస్తున్న దళితులకు ఎస్సీ రిజర్వేషన్లు అమలు చేయకుండా మత స్వేచ్ఛను అడ్డుకుంటు న్నారు. ఆర్టికల్‌ 32 హక్కుల ఉల్లంఘన జరిగితే సుప్రీం కోర్టుకు వెళ్లే హక్కునిచ్చింది. దీన్ని అంబేద్కర్‌ రాజ్యాగానికి ఆత్మ, హృదయంగా అభివర్ణించారు. రాజ్యాంగంలోని అంశాల అమలు పాలకుల చిత్తశుద్ధిపై ఆధారపడి ఉంటుందన్నారు. రాజ్యాగాన్ని అమలుచేయాల్సిన పాలకులు అగ్రకులతత్వం, దోపిడీవర్గం వారైనపుడు రాజ్యాంగానికి హృదయం, ఆత్మ ఉండదు. దళితులు, గిరిజనులు, పేద లు, పీడిత కులాలు అందరూ ఏకమై ఐక్యపోరాటం ద్వారా హక్కులు అమలు చేయించుకోవాలి.
- ఆండ్ర మాల్యాద్రి 
(వ్యాసకర్త కెవిపిఎస్‌ రాష్ట్ర కార్యదర్శి)