దగాకోరు సంస్కరణలు - మోసపూరిత నినాదాలు

దేశ ప్రజలందరికీ బ్యాంకింగ్‌ సేవలు అందుబాటులోకి రావాలనీ, గ్రామీణ ప్రాం తాలకు కూడా బ్యాంకులు విస్తరిం చాలనీ, దేశ ఆర్థికాభివృద్ధికి బ్యాంకులు ఎంతో కృషి చేయాలనీ, ఇవి సాధించటం కోసమే 'ప్రధాన మంత్రి జన్‌ధన్‌ యోజన' ప్రవేశపెట్టిందని ప్రభుత్వ ప్రకటనలు, మంత్రివర్యుల ఉపన్యాసాలు వింటుంటే విస్మయం కలుగుతుంది. బ్యాంకింగ్‌రంగం ఇంకా ఇంకా ప్రజలకు చేరువ కావాలనే సంకల్పం తోనే బ్యాంకింగ్‌రంగ సంస్కరణలు చేపట్టామని పాలక పక్షాలు ప్రచారం చేయటాన్ని సునిశితంగా పరిశీలించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బ్యాంకుల జాతీయకరణ జరిగి 46 ఏళ్లు నిండాయి. రిజర్వుబ్యాంకు లెక్కలు, ప్రభుత్వ గణాంకాలు పరిశీలిస్తే ప్రజలందరి భాగస్వామ్యంతో కూడిన సమ్మిళిత వృద్ధి (ఇంక్లూసీవ్‌ గ్రోత్‌) సాధించలేక పోవటానికి ప్రభుత్వ మోసపూరిత నినాదాల వెనుక దాగి ఉన్న దగాకోరు విధానాలే అసలు కారణమని అర్థమవుతుంది.
1969లో బ్యాంకుల జాతీయకరణ తరువాత రెండు దశాబ్దాల కాలంలో వ్యవసాయ రంగానికి, సన్న, చిన్నకారు రైతులకు, ప్రాధాన్యతా రంగాలకు, చేతివృత్తులు, కుటీర పరిశ్రమలకు రుణాలు వేగంగా పెరుగుతూ వచ్చాయి. గ్రామాలకు విస్తరించటం ద్వారా సుమారు లక్ష గ్రామాలకు బ్యాంకింగ్‌ సౌకర్యాలు చేరాయి. లక్షల మంది నిరుద్యోగులకు బ్యాంకింగ్‌ ఉద్యోగావకాశాలు కల్పించింది. ఈ విస్తరణ ఇంకా పెరిగి ప్రజల అవసరాలు తీర్చగలిగే స్థాయికి చేరాల్సిన సమయంలో బ్యాంకింగ్‌ సంస్కరణలను ప్రవేశపెట్టి గత 25 సంవత్సరాలుగా అమలు చేయటం జరుగుతున్నది. బ్యాంకింగ్‌ జాతీయకరణ చట్టాన్ని మార్చి 49 శాతం ప్రైవేటు పెట్టుబడికి అవకాశం కల్పించి ప్రభుత్వవాటా 51 శాతానికి పరిమితం చేసే వీలు కల్పించారు. ప్రైవేటు పెట్టుబడితో స్టాక్‌ మార్కెట్‌లో ప్రవేశించిన తరువాత దేశ ఆర్థికాభివృద్ధికి కృషి చేయటం కంటే లాభాలను పెంచుకోవటమే ప్రధానంగా మారింది. బ్యాంకుల స్వభావాన్ని, ప్రగతి మార్గాన్ని సామాన్యుల నుంచి బ్యాంకింగ్‌ రోజు రోజుకు దూరమయ్యే పరిస్థితిని తెచ్చాయి సంస్కరణలు.
తగ్గుతున్న గ్రామీణ ప్రాంత ప్రాధాన్యత
శాఖలవారీ లాభనష్టాలను లెక్కగట్టడం మొదలుపెట్టి, నష్టాలలో ఉన్న శాఖలను మూసివేసే వీలుకల్పించింది ప్రభుత్వం. జాతీయకరణతో వేగంగా విస్తరిస్తున్న గ్రామీణశాఖల వాటా తిరోగమనంలో పడింది. గ్రామీణ శాఖలు 2006 నాటికి 43 శాతానికి, 2014 నాటికి 38 శాతానికి కుదించుకుపోయాయి. శాఖల విస్తరణలో గ్రామాలతో పోల్చినప్పుడు పట్టణ ప్రాంతాల ప్రాధాన్యత పెరుగుతూ ఉంది. ప్రజల అవసరాలకు తగినట్టు కొత్త శాఖలను ప్రారంభించే బదులు, బిజినెస్‌, కరస్పాండెంట్స్‌, తదితర ఏజంట్లను నియమించుకోవటం ద్వారా గ్రామీణ ప్రజలకు బ్యాంకింగ్‌ సేవలందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆర్థిక అవకతవకలకు పాల్పడటంతో లక్షల మంది ఏజెంట్లను మరలా ప్రభుత్వమే నిషేధించింది. బ్యాంకింగ్‌ శాఖలను విస్తరించటానికి బదులు మరే ప్రత్యామ్నాయ ఏర్పాటు ఉపయోగపడదని రుజువైంది.
చిన్న, గ్రామీణ రుణాలను మింగేస్తున్న కార్పొరేట్‌ రుణాలు
బ్యాంకుల లాభాల వేటలో చిన్న చిన్న రుణాలు, ప్రాధాన్యతా రంగాలు, రైతుల రుణాలు ఏటా తగ్గుతూ కార్పొరేట్‌ రుణాలు పెరుగుతున్నాయి. మొత్తం బ్యాంకు రుణాల ఖాతాలో రూ.25 వేల లోపు రుణాలు 2000 సంవత్సరంలో 72 శాతం ఉంటే, అది 2005 నాటికి 50 శాతానికి, 2014 నాటికి 23 శాతానికి పడిపోయాయి. మరి ఈ రుణాలు ఎక్కడికి చేరుతున్నాయి? మొత్తం రుణ ఖాతాలలో అర శాతం (0.5 శాతం) కూడా లేని కార్పొరేట్‌ కంపెనీలు స్వంతం చేసుకుంటున్నాయి. మార్చి 2015 నాటికి బ్యాంకింగ్‌ రంగం రూ.68 లక్షల కోట్ల రుణాలు కలిగి ఉంది. మైనింగ్‌, ఐరన్‌ అండ్‌ స్టీల్‌, టెక్స్‌టైల్‌, మౌలిక వసతులు, విమానయాన రంగాలు బ్యాంకు రుణాలలో 25 శాతం హస్తగతం చేసుకొని, బ్యాంకుల పారుబాకీలలో 51 శాతానికి కారణభూతమయ్యాయి. బ్యాంకులలో ప్రజలు దాచుకున్న సొమ్ముకు, దేశ ఆర్థిక వ్యవస్థకు పొంచి ఉన్న ప్రమాదాన్ని ఇది తెలియజేస్తుంది. వ్యవసాయ రంగంలో కూడా సన్న, చిన్నకారు రైతులకిచ్చే రుణాలు తగ్గుతూ కార్పొరేట్‌ వ్యవసాయా నికిచ్చే రుణాల వాటా పెరుగుతోంది. దేశ ఆర్థికాభివృద్ధికి, ఆర్థిక అసమానతలను తగ్గించవలసిన ప్రభుత్వ రంగ బ్యాంకులు బ్యాంకింగ్‌ రంగ సంస్కరణలతో కార్పొరేట్‌ కంపెనీల అవసరాలకు మళ్లించబడ్డాయి.
సమ్మిళిత వృద్ధి ఎలా సాధ్యం?
'ఏ విత్తనం నాటితే ఆ మొక్కే మొలుస్తుంది'. ఇది అందరికీ తెలిసిన జీవిత సత్యం. కానీ ప్రభుత్వ రంగాన్ని నిర్వీర్యం చేసి ప్రైవేటు బ్యాంకుల ద్వారా సమ్మిళిన వృద్ధి సాధించాలని ప్రభుత్వం చూస్తున్నది. 'ప్రధాన మంత్రి జన్‌ధన్‌ యోజన' ఆర్భాటంగా ప్రకటించింది ప్రభుత్వం. అనుకున్న సమయం కంటే ముందే అనుకున్న దానికంటే రెట్టింపు ఖాతాలు బ్యాంకులు తెరిచాయి. ఈ ఖాతాలు తెరవటం వలన ఎంత మేలు జరిగిందనేది చర్చనీయాంశమైనా, ప్రపంచ రికార్డు సృష్టించిన సంఖ్యలో ఖాతాలు తెరవడంలో ఏ బ్యాంకులు ఎంత పాత్ర పోషించాయి? మొత్తం 16.93 కోట్ల ఖాతాలలో ప్రభుత్వ రంగ బ్యాంకులు 16.24 కోట్ల ఖాతాలు (వాణిజ్య బ్యాంకులు 13.22 కోట్లు+గ్రామీణ బ్యాంకులు 3.02 కోట్లు) ప్రారంభించగా, కేవలం 69 లక్షల ఖాతాలు మాత్రమే ప్రైవేటు రంగ బ్యాంకులు తెరిచాయి. ప్రాధాన్యతా రంగాలకు, వ్యవసాయ రంగానికి, చిన్న పరిశ్రమలకు రుణాలందించటంలో కూడా ప్రభుత్వ రంగ బ్యాంకులు, గ్రామీణ బ్యాంకులు, సహకార సంస్థలు ముందున్నాయి. కానీ ఈ సంస్థలన్నింటినీ ప్రైవేటుపరం చేసే చర్యలను ముమ్మరం చేసింది కేంద్ర ప్రభుత్వం. వ్యవసాయాభివృద్ధికీ, గ్రామీణాభివృద్ధికీ కృష ిచేస్తున్న రంగం సహకార రంగం. ప్రకాశ్‌ బక్షి కమిటీ నివేదిక ఆధారం గా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు బ్యాంకింగ్‌ వ్యాపారం చేయకూడదని, అవి జిల్లా సహకార బ్యాంకులకు ఏజెంట్లుగా పనిచేయాలని నిర్ణయించింది. సహకార బ్యాంకులు కూడా డిపాజిట్లలో కొంత భాగం చట్టపరమైన నిల్వ ధనం (ఎస్‌ఎల్‌ఆర్‌) ఆదాయపన్ను చట్టాలకు లోబడి పనిచేయాలని మార్పులు చేసింది. సహకార సంఘాలు మూతబడే స్థితి కల్పించింది.
బ్యాంకుల ప్రైవేటీకరణే సంస్కరణల లక్ష్యం
అంతర్జాతీయ ద్రవ్య సంస్థలు, ఐఎంఎఫ్‌, ప్రపంచ బ్యాంకు రూపొందించిన ప్రణాళిక ప్రకారం ఫైనాన్స్‌ పెట్టుబడి, కార్పొరేట్‌ కంపెనీల లాభాల కోసం ప్రభుత్వ బ్యాంకుల ప్రైవేటీకరణే లక్ష్యంగా బ్యాంకింగ్‌ సంస్కరణలు అమలవుతున్నాయి. 1991 నరసింహన్‌ కమిటీ నుంచి పిజె నాయక్‌ కమిటీ వరకు, వీటి నివేదికల, సిఫార్సుల సారాంశం ఒక్కటే. ప్రైవేటీకరణ ద్వారా దేశ ఆర్థిక వనరుల మీద ఆధిపత్యం ఫైనాన్స్‌ పెట్టుబడికి కల్పించటమే. జాతీయకరణ నాటి నుంచి ప్రభుత్వ ప్రణాళికలకనుగుణంగా ఐఆర్‌డిపి లాంటి సామాన్య ప్రజల, రైతుల సంక్షేమానికి ఉద్దేశించిన వాటిని అమలు చేయటంలో కృషి చేస్తున్నాయి. ఈ సంస్థలన్నిటినీ బలహీనపరచి ప్రజలందరికీ బ్యాంకింగ్‌ సౌకర్యాలు కల్పించటం ప్రైవేటు బ్యాంకులతో సాధ్యమా? జాతీయకరణకు ముందు, ఆర్థిక సంస్కరణలు అమలు జరుగుతున్న గత 25 సంవత్సరాల కాలంలో ప్రైవేటు బ్యాంకుల పాత్రను పరిశీలిస్తే అవి తమ లాభాల కోసం, తమ స్వంత కార్పొరేట్‌ ప్రయోజనాల కోసమే కృషి చేస్తాయనే వాస్తవాన్ని తెలియజేస్తున్నది.
ప్రభుత్వ రంగ బ్యాంకుల పరిరక్షణే ప్రధానం
ప్రజల పొదుపుతో సమకూర్చిన డిపాజిట్ల రూపంలో ఉన్న ఆర్థిక వనరులు ప్రజా సంక్షేమానికే ఉపయోగపడాలి. అందుకు ప్రభుత్వ రంగ బ్యాంకులను పరిరక్షించాలి. ప్రైవేటు బ్యాంకులన్నింటినీ జాతీయం చెయ్యాలి. బ్యాంకులకు భారంగా మారిన కార్పొరేట్‌ కంపెనీల పారుబాకీలు (ఎన్‌పిఎలు) వసూలుకు ప్రభుత్వం చర్యలూ తీసుకోవాలి. బ్యాంకింగ్‌ సౌకర్యాలు లేని గ్రామాలకు శాఖలు విస్తరించేలా ప్రణాళికాబద్ధంగా కృషి చేయాలి. వ్యవసాయ, గ్రామీణాభివృద్ధికి, చిన్నతరహా, కుటీర పరిశ్రమలకు ప్రాధాన్యత నిచ్చి రుణాలు సమకూర్చాలి. ఔట్‌సోర్సింగ్‌ విధానాన్ని రద్దుచేసి నిరుద్యోగ యువతకు పర్మినెంట్‌ ఉద్యోగాలు కల్పించాలి. ఈ లక్ష్యాల సాధనకు బ్యాంకు ఉద్యోగులు, విశాల ప్రజానీకం ఐక్యంగా కృషి చేయాలి.
(వ్యాసకర్త బ్యాంక్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల ప్రధాన కార్యదర్శి)
- పి వెంకట రామయ్య