థర్మల్ పవర్ బాధితులకు అండగా..

భోగాపురం ఎయిర్‌పోర్టుకు ఒక్క ఎకరా కూడా గుంజుకో నివ్వబోమని, అడ్డగోలు భూ సేకరణను కలిసికట్టుగా అడ్డుకుందామని వామపక్ష నాయకులు పిలుపునిచ్చారు. బలవంతపు భూ సేకరణపై రాష్ట్రస్థాయి ఉద్యమం చేపడతామని చెప్పారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు మాట్లాడుతూ ప్రభుత్వ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారానికి పేదోళ్ల భూములే దొరికాయా అని చంద్రబాబుని ప్రశ్నించారు. రాష్ట్రం అభివృద్ధి పేరుతో 13జిల్లాల్లోనూ చంద్రబాబు 15లక్షల ఎకరాలు భూసేకరణ చేపడుతున్నాడని, దీంతో రాష్ట్రంలోని లక్షలాది మంది రైతులు అవేదన చెందుతున్నారని తెలిపారు. అవసరాలకు మించి భూములు గుంజుకుంటున్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాష్ట్ర స్థాయి ఉద్యమం జరగబోతుందని, దీనికి అందరూ సమాయత్తం కావాలని పిలుపు నిచ్చారు. పోలీసులు అతిగా వ్యవహరిస్తున్నారని, దౌర్జన్యాలు, లాఠీచార్జీలు చేస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. అధికారులు సమన్వయంతో వ్యవహరించాలని కోరారు. తమ యుద్దం రాష్ట్ర ప్రభుత్వం పైనే గాని అధికారులతో కాదన్నారు. డిసెంబర్‌ నాటికి పెద్ద ఉద్యమంగా మార్చాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ భోగాపురంలో ఎయిర్‌పోర్టు రానివ్వబోమని తేల్చి చెప్పారు. భోగాపురం రైతులు భయపడొద్దని..అండగా తాముంటామని భరోసా ఇచ్చారు.