త్రిపురలో 300కిలోమీటర్ల పొడవునా మానవహారాలు

త్రిపుర రాష్ట్రమంతటా లక్షలాదిమంది ప్రజలు చేయి చేయి కలుపుతూ అది పెద్ద మానవ హారం నిర్మించారు. రాష్ట్రంలో 96 ప్రాంతాల నుంచి 2.25లక్షల మంది ప్రజలు 300 కిలో మీటర్ల పొడవునా బారులు తీరి మానవ హారాలు నిర్మించారు. తద్వారా వామపక్ష ఉద్యమ చరిత్రలో ఓ కొత్త మైలు రాయి నెలకొల్పారు. సిపిఎం త్రిపుర రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు ఆగస్టు ఉద్యమం ముగింపును పురస్కరించుకుని ఈ మానవ హారాలు ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో ఇంత పెద్ద ఎత్తున ప్రజల్ని సమీకరించడం గతంలో ఎన్నడూ జరగలేదు. అన్ని వర్గాలకు చెందిన ప్రజలు ఇందులో పాల్గొన్నారు. అగర్త లాలో నిర్మించిన మానవ హారంలో ముఖ్యమంత్రి, సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు మాణిక్‌ సర్కార్‌, రాష్ట్ర కార్యదర్శి విజన్‌ధర్‌ ప్రభృతులు పాల్గొన్నారు. మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద వంద రోజులు పనిదినాలు కల్పించాలని, వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి బడ్జెట్‌ను తగ్గించ రాదని, నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలని, ఆహార భద్రతా చట్టాన్ని అమలు చేయాలని సిపిఎం డిమాండ్‌ చేసింది.