తొక్కిసలాట ఫుటేజి మాయం!

రాజమండ్రి దుర్ఘటనలో ప్రభుత్వ విచారణ తీరుపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గోదావరి పుష్కరాల సందర్భంగా గతనెల 14న పుష్కరఘాట్‌ వద్ద జరిగిన తొక్కిసలాటలో 30 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. ఘాట్‌ వద్ద ఏ విధమైన అవాంఛనీయ ఘటనలు జరిగినా పసిగట్టేందుకు రూ.2 కోట్లు ఖర్చుచేసి ఆర్భాటంగా సిసి కెమెరాలు ఏర్పాటుచేశారు. దీనిపై రెండు రోజుల ముందే ట్రైల్‌ వేశారు. అన్నీ సజావుగా పని చేస్తున్నాయని నిర్ధారించారు. ఇంత పక్కా ఏర్పాట్లు చేసినా జరగాల్సిన ఘోరం జరిగి పోయింది. తొక్కి సలాట ఘటన తనను తీవ్రంగా కలిచివేసిందని... దీనిపై న్యాయ విచారణకు ఆదేశించామని ముఖ్య మంత్రి చంద్రబాబు ప్రకటించారు. ఇందులో భాగంగా పోలీసులు చేపట్టిన రహస్య విచారణ తీరు సర్వత్రా విస్మయం కలిగిస్తోంది. సంఘటన సమయంలో సిసి కెమెరాలు పనిచేయలేదని... పోలీసులు కొత్త పల్లవి అందుకుంటున్నారు. పోలీసుల మాటలు వింటుంటే పుటేజ్‌లను పథకం ప్రకారమే మాయం చేశారన్న అనుమానాలు కలుగు తున్నాయని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ నేప థ్యంలో నిజంగానే కెమెరాలు పనిచేయలేదా? లేకుంటే సిసి కెమెరాల పుటేజ్‌ను కావాలనే ప్రభు త్వం దాచేసిందా? అనే ప్రశ్నలు ఉత్పన్న మవు తున్నాయి. తొలి రోజున ముఖ్యమంత్రి 

ఎన్‌.చంద్రబాబునాయుడు ఘాట్‌లో స్నానం చేసి పుష్కరాలను ప్రారంభించారు. ఆ సమయంలో సుమారు రెండు గంటల పాటు యాత్రికులను ఘాట్‌లోకి పోలీసులు అనుమతించకపోవడంతో బయట యాత్రికుల రద్దీ పెరిగింది. సిఎం ఘాట్‌లో ఉన్న సన్నివేశాలను నేషనల్‌ జియోగ్రఫీ చానల్‌ ద్వారా ప్రభుత్వం చిత్రీకరించింది. రూ.60 లక్షల ఒప్పందంతో ఓ లఘు చిత్రం షూటింగ్‌కు ఒప్పందం కుదిరిందని ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్‌ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. 
కలెక్టర్‌, అర్బన్‌ ఎస్‌పిలను బాధ్యులుగా చేయడానికి...
సిఎం ఘాట్‌లో ఉన్న సమయంలో భారీగా యాత్రికులు వచ్చారని, ఒక్కసారిగా వారు తోసుకురావడంతో తొక్కిసలాట జరిగిందని కలెక్టర్‌ హెచ్‌.అరుణ్‌కుమార్‌ కేంద్ర హోంశాఖకు నివేదించారు. ఈ పాపం తనపైకి రాకుండా తొక్కిసలాట ఘటనకు రాజమండ్రి అర్బన్‌ ఎస్‌పి, కలెక్టర్‌ను బాధ్యులుగా చేయాలని సిఎం ఆలోచిస్తున్నారనే ప్రచారముంది. ఈ సంఘటనకు ఆధారం సిసి కెమేరాల పుటేజ్‌లే. షూటింగ్‌ కోసమే ఘాట్‌ బయట భారీగా జనాన్ని అనుమతించారని, సిఎం వెళ్లిన తర్వాత ఒక్కసారిగా ఘాట్‌ గేట్లు తెరవడంతో తీవ్ర తొక్కిసలాట జరిగిందని, దీనికి సిఎం బాధ్యత వహించాలని ప్రతిపక్షాలు డిమాండ్‌ చేస్తున్నాయి.