తెలుగు రాష్ట్రాల్లో బిజెపి పాగా

 ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలలో తమ పార్టీ శాఖల పని తీరుపట్ల పూర్తి అసంతృప్తితో ఉన్న బిజెపి అధినాయకత్వం కాయకల్ప చికిత్సకు సిద్ధమవుతోంది. రెండు రాష్ట్రాలకు చెందిన నాయకులతో పార్టీ అధ్యక్షుడు అమిత్ షా విడివిడిగా నిర్వహించిన సమీక్షా సమావేశాలలో పార్టీ నాయకుల పని తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది. కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయతోసహా తెలంగాణ నాయకులకు ఇప్పటికే అమిత్ షా క్లాసు తీసుకున్నారు. గ్రేటర్ హైదరాబాద్ నగర పాలక సంస్థ ఎన్నికల్లో పార్టీ ఒంటరిగా పోటీచేసి విజయం సాధించని పక్షంలో సంస్థాగతంగా భారీ మార్పులు జరిగే అవకాశాలున్నాయి. ఎపిలో ప్రజావిశ్వాసం చూరగొనే ప్రయత్నాలు చేయాలని అధినాయకత్వం ఆదేశించింది. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలతోపాటు విశాఖ నగర పాలక సంస్థకు ఎన్నికలు జరిగే అవకాశాలున్నాయి. విశాఖ నగర పాలక సంస్థకు జరిగిన మొట్టమొదటి ఎన్నికలలో బిజెపి అప్పట్లో అధికార పార్టీ అయిన కాంగ్రెస్‌ను మట్టికరిపించి ఘనవిజయం సాధించింది. ఆనాటి నాయకత్వం ఇప్పుడు బిజెపికి లేనందున, తెలుగుదేశం దయా దాక్షిణ్యాలపైనే ఆధారపడాల్సి ఉంటుంది. కర్నాటకలో తప్పించి దక్షిణ భారతదేశంలోని ఇతర రాష్ట్రాలలో పార్టీ ఆచూకీ కనిపించకపోవటాన్ని అధినాయకత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. ఆదినుంచి ఆంతో ఇంతో బలం ఉన్న ఆంధ్ర, తెలంగాణాలలో తమ బలాన్ని పెంచుకోవాలన్న ఆలోచనలో ఉంది. అయితే రెండు రాష్ట్రాల నాయకత్వం బలహీనంగా ఉండటంతో ఆశించిన ఫలితాలు లభించటం లేదన్న నిర్ణయానికి వచ్చింది. సమర్థవంతమైన నాయకత్వం, పటిష్టమైన వ్యూహంతోప్రజల్లోకి వెళ్లవలసిందిగా అమిత్ షా నాయకులను ఆదేశించారు. తెలుగుదేశం పార్టీతో ఎన్నికల పొత్తు పెట్టుకున్నంత మాత్రాన సొంత పార్టీ గుర్తింపు గంగలో కలిసిపోయేట్లు నాయకులు వ్యవహరించటంపై అమిత్ షా అసహనం వ్యక్తం చేశారని చెబుతున్నారు.
ఆంధ్ర రాజకీయాలలో కీలకపాత్ర వహించే సామాజికవర్గం, ధన ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకుని జాతీయ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకూ పార్టీలోప్రాతినిధ్యం కల్పించాలని సంకల్పించారు. ఈక్రమంలోనే కోస్తాజిల్లాల్లో బలమైన రెండు సామాజిక వర్గాలకు సముచితమైన ప్రాతినిధ్యం కల్పించాలని నిర్ణయించారు. రాయలసీమలో వెనుకబడిన తరగతులకు పెద్దపీట వేస్తారు. తెలంగాణలో మాదిరి ఇకనుంచి జరిగే ప్రతి ఎన్నికలో ఒంటరిగా పోటీ చేయాలని, తెలుగుదేశంతో పొత్తు తప్పకపోతే గరిష్ఠ స్థానాలలో పోటీచేయగల స్థాయికి పార్టీ ఎదగాల్సి ఉంటుందని అమిత్ షా ఆంధ్ర నాయకులకు స్పష్టం చేశారని తెలిసింది. రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు మెతక వైఖరితో వ్యవహరించటాన్ని పార్టీ అధినాయకత్వం తప్పుపట్టింది. హరిబాబు ఒక ప్రతిపక్ష పార్టీ నాయకుని తరహాలో పనిచేయాలే తప్పించి పొత్తు పెట్టుకున్నంత మాత్రాన తెలుగుదేశం పార్టీకి కొమ్ముకాయవలసిన పని లేదని పార్టీ నాయకత్వం స్పష్టం చేసింది.
తెలుగుదేశం పార్టీ తమకు, కార్యకర్తలకు సముచితమైన ప్రాధాన్యత ఇవ్వటం లేదని బిజెపి నేతలు అమిత్ షాకు ఫిర్యాదు చేశారు. అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్వహించిన భూమిపూజకు రాష్ట్ర శాఖ అధ్యక్షుడు హరిబాబును ఆహ్వానించకపోవటం, దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావును పక్కనపెట్టి పుష్కరాలకు సంబంధించిన అన్ని వ్యవహారాలను తెలుగుదేశం నాయకులే చక్కపెట్టేసుకోవటం, నామినేటేడ్ పదవుల పంపకం గురించి ఈ సమావేశంలో చర్చకు వచ్చినట్లు తెలిసింది.