తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న నిర్బంధం

గత వారం తెలంగాణ రాష్ట్ర శాసనసభ లోపలా వెలుపలా అట్టుడికిపోయింది. రైతుల ఆత్మహత్యలపై చర్చ సభను వేడెక్కిస్తే- ఎన్‌కౌంటర్లకు వ్యతిరేకంగా ఉద్దేశించిన చలో అసెంబ్లీపై అణచివేత బయిట నిరసనాగ్ని రగిల్చింది. ఒక విధంగా విభజనకు ముందు చలో అసెంబ్లీల సన్నివేశాన్ని గుర్తుకు తెచ్చింది. ఆత్మహత్యలు కూడా తెలుగు దేశం పాలన చివరి రోజులను మించిపోయే రీతిలో జరగడం ఆవేదనా కారణమైంది. గత విధానాలే అమలు జరుగుతుంటే బంగారు తెలంగాణ ఎలా సాధ్యమని నాటి ఉద్యమ కారులే ప్రశ్నించిన పరిస్థితి ఏర్పడింది. ఇందుకు సంకేతమా అన్నట్టు తెలంగాణ పితామహుడనిపించుకోదగిన విద్యావేత్త చుక్కా రామయ్య గృహ నిర్బంధం, జిల్లాల నుంచి వచ్చేవారిని ఎక్కడికక్కడ అరెస్టుయ చేయడం కెసిఆర్‌ ప్రభుత్వ అప్రజాస్వామిక పోకడలకు అద్దం పట్టాయి. చలో అసెంబ్లీలో నిషేదిత మావోయిస్టులు పాల్గొంటున్నట్టు సమాచారం రావడం వల్లనే అనుమతి నివ్వలేదని పోలీసులు సమాధాన మివ్వడం సవాళ్లను తీవ్రం చేసింది. మావోయిస్టు ఎజెండానే మా ఎజెండా అని ప్రకటించిన ముఖ్యమంత్రి నాయకత్వం లోని ప్రభుత్వం ఎన్‌కౌంటర్‌ చేయడం, దానిపై చలో అసెంబ్లీకి మావోయిస్టులు వస్తారని ఆరోపించడం ఏమిటి?
వాస్తవానికి శ్రుతి విద్యాసాగర్‌ల ఎన్‌కౌంటర్‌తో తెలంగాణ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఎన్‌కౌంటర్లు లేని తెలంగాణ అనేది అప్పట్లో కెసిఆర్‌ నినాదంగా వుండేది. సమైక్య రాష్ట్రంలో విధానాలు సరిగా లేని కారణంగానే యువతలో అశాంతి పెరిగి తీవ్రవాద ఉద్యమాలవైపు వెళుతున్నారనేది ఆయన ప్రధాన వాదనగా సాగింది. మావో యిస్టు శక్తులూ సానుభూతి పరులూ ప్రత్యక్షంగానూ పరోక్షం గానూ తెలంగాణ ఉద్యమానికి సహాయసహకారా లందజే శారు కూడా. ఎన్నికలలో టిఆర్‌ఎస్‌ పోటీ చేసిన చోట్ల బహి ష్కరణ బెదిరింపులు లేకుండా ఓటింగు జరగడానికి మద్దతు రావడానికి కూడా వారి ఆధీనంలోని ప్రాంతాలలో తోడ్డడ్డారనే అభిప్రాయాలున్నాయి.మావోయిస్టు ఎంఎల్‌ పార్టీలకు చెంది న కొందరు మాజీలు టిఆర్‌ఎస్‌లో కీలక పదవులు అధిష్టిం చారు కూడా. ఇదంతా ఇలా వుంటే నూతన రాష్ట్రం ఏర్పడిన ఏడాదిన్నర లోపే- ఎలాటి తీవ్రమైన ఘటనలు జరక్కుండానే (సిపిఎం నాయకులు కొందరిని హతమార్చడం మినహా) ఎన్‌ ్‌కౌంటర్‌కు ఎందుకు పాల్పడాల్సి వచ్చిందనే ప్రశ్నకు టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం నుంచి సమాధానమే లేదు.దీనిపై నిరసనకు జవాబూ లేదు. వారిని పట్టుకుని కాల్చి చంపారనీ, అందుకు ముందు భీకర చిత్ర హింసలకు గురి చేశారని వచ్చిన కథనాలపై పోలీసు అధికారుల సంఘం ఖండనా వ్యాసం తప్ప ప్రభుత్వ స్పందననాస్తి.
ఇలాటి నేపథ్యంలో 375 సంఘాలు తెలంగాణ ప్రజాస్వామ్య వేదికగా ఏర్పడి చలో అసెంబ్లీకి పిలుపివ్వడం ప్రభుత్వానికి మింగుడు పడని వ్యవహారంగా తయారైంది. వేలమందిని ముందస్తుగా అరెస్టులు చేయడం, ఎక్కడికక్కడ పోలీసులను మొహరించి వామపక్ష నేతలను నిర్బంధించడం చాలా పెద్ద ఎత్తున జరిగింది. దీనిపై సభలో ప్రకటన గాని చర్చ గాని లేకుండా పోయింది. అంతకు ముందు మునిసిపల్‌ కార్మికుల సమ్మె సందర్భంలో వలెనే ఇప్పుడు కూడా వామపక్షా లపై ప్రత్యేకించి సిపిఎంపై పాలక పక్షం దాడి కేంద్రీకృత మైంది. మావోయిస్టుల పట్ల సిపిఎం గతంలో వ్యతిరేకంగా వున్నట్టు ఇప్పుడే హఠాత్తుగా ప్రేమ ప్రదర్శించడమేమిటని అడ్డు సవాళ్లకుదిగింది. మావోయిస్టు విధానాలతో సైద్ధాంతిక తేడాలు, సిపిఎం కార్యకర్తలపై వారి హంతక దాడులను ఖండించడం వేరు. ఆ కారణంగా ప్రభుత్వం పోలీసులు నిర్బం దానికి ఇష్టానుసారం ఎన్‌కౌంటర్లకు పాల్పడితే నిరసించడం వేరు. అంతేగాక దానికి నిరసన తెల్పుతామంటే అరెస్టులతో విరుచుకుపడటం ఇంకా దారుణం. రెండవ విషయం- రైతుల ఆత్మహత్యలు చూస్తే రోజుకు ముగ్గురు చొప్పున ప్రాణాలు తీసుకోవడం ప్రభుత్వ అలసత్వం అసమర్థత కారణంగానే జరిగినవే. గతం నుంచి ఈ సమస్య వున్న తెలంగాణలో ముందుగానే జాగ్రత్త పడకపోగా ఆత్మహత్య లను అవహేళన చేసే విధంగా మంత్రులు మాట్లాడారు. ముఖ్యమంత్రి దానిపై దీర్థకాలం పాటు స్పందించకుండా మౌనం పాటించారు. ఆక్రమంలోనే అంతకంతకూ సమస్య తీవ్రమైంది. ఆ దశలో అనివార్యంగా పరిహారం పెంచి అది ఇక ముందు చనిపోయేవారికి మాత్రమే వర్తిస్తుందన్నట్టు మంత్రి వర్గం నిర్ణయం తీసుకుంది. సరికాదనే అభిప్రాయాలు ఎన్ని వచ్చినా పట్టించుకోవడానికి నిరాకరించింది. ఫలితం? మరిం త విషాదం. ఆ దశలోనే గత్యంతరం లేక శాసనసభలో సుదీర్ఘ చర్చకు అనుమతించినా అందుకు స్పష్టమైన రేఖలు గీసింది. తమ రాజకీయ బూటకత్వాన్ని ప్రశ్నించే అవకాశం లేకుండా చేసింది. అంతా అయిన తర్వాత పొడగాటి సమాధానమిచ్చిన ముఖ్యమంత్రి గత పాలనను కారణంగానూ భవిష్యత్‌ ప్రాజెక్టు లను పరిష్కారంగానూ చూపించి సరిపెట్టారు. అంతేగాని అత్యవసరంగా ఆదుకునేందుకు ఏమి చేస్తారో వివరించలేదు. కనీసం రుణమాఫీ ఒక్కదఫాగా చేస్తే పరపతి సమస్య తగ్గి రైతులకు మేలు జరుగుతుందంటే అంగీకరించలేదు. ఆ కోర్కెపై సభలో బైఠాయించిన ప్రతిపక్ష సభ్యులను మార్షల్స్‌తో తొలగించి నిర్బంధంగా తీసుకెళ్లారు. ఆ తర్వాత వారిది మొసలి కన్నీరని తిట్టిపోశారు. ఈ విధంగా తెలంగాణ శాసనసభ వ్యవహారం ఒక యాంటీ క్లైమాక్స్‌గా తయారైంది.
- తెలకపల్లి రవి