తెలుగు రాష్ట్రాలకు నష్టదాయకం

కృష్ణా జలాల పంపిణీని ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలకు పరిమితం చేస్తూ కృష్ణా జలాల వివాదాలపై నెలకొల్పిన బ్రిజేష్‌ కుమార్‌ ట్రిబ్యునల్‌ బుధవారం వెలువరించిన తీర్పు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజా ప్రయోజనాలకు శరాఘాతం. ఉమ్మడి ఏపీ విభజనతో నదీ పరీవాహక రాష్ట్రాలు మహారాష్ట్ర, కర్నాటక, తెలంగాణ, ఏపి నాలుగుకు పెరగగా, నీటి పంపిణీ పంచాయతీ నుంచి మహారాష్ట్ర, కర్నాటకలను ట్రిబ్యునల్‌ మినహాయించడం సహజ న్యాయ సూత్రాలకు, అంతర్జాతీయ నీటి చట్టాలకు పూర్తి విరుద్ధం. బచావత్‌ ట్రిబ్యునల్‌ తీర్పునకు భిన్నంగా 2013 నవంబర్‌ 29న బ్రిజేష్‌ ట్రిబ్యునల్‌ చెప్పిన తీర్పుపై నదీ పరీవాహక పరిధిలోని రాష్ట్రాలన్నీ దేశ సర్వోన్నత న్యాయస్థానం వద్ద సవాల్‌ చేయగా, గెజిట్‌ పబ్లికేషన్‌ను నిలిపేస్తూ సుప్రీం కోర్టు మధ్యంతర ఉత్తర్వులిచ్చి విచారణ జరుపుతుండగా, ఏపీ విభజన నేపధ్యంలో తలెత్తిన మరో వివాదంపై అదే బ్రిజేష్‌ ట్రిబ్యునల్‌ ఇచ్చిన తీర్పు న్యాయ సమ్మతం అనిపించుకోదు. బచావత్‌ అవార్డుపై ఎగువ రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్నాటక ఫిర్యాదులతోనే 2004లో కేంద్రం బ్రిజేష్‌ ట్రిబ్యునల్‌ను నియమించింది. బ్రిజేష్‌ ట్రిబ్యునల్‌ అవలంబిస్తున్న ధోరణి, అది చేపట్టిన విచారణ మొదటి నుంచీ ఎగువ రాష్ట్రాలకు అనుకూలంగా, ఉమ్మడి ఏపీకి వ్యతిరేకంగా సాగింది. అందుకు తగ్గట్టుగా ఏపీ సర్కారు కీలక సందర్భాల్లో పస లేని వాదనలు వినిపించడం బ్రిజేష్‌ ట్రిబ్యునల్‌కు కలిసొచ్చింది. ఆ వెసులుబాటుతో అంతకుముందున్న బచావత్‌ అవార్డును తోసిరాజని 2013లో ట్రిబ్యునల్‌ వివాదాస్పద తీర్పు చెప్పింది. నీటి లభ్యతను 75 శాతం నుంచి 65 శాతానికి తగ్గించి కృష్ణా జలాలను 2,131 టిఎంసీల నుంచి 2,578 టిఎంసీలకు పెంచి వాటిని మూడు రాష్ట్రాలకూ పంచింది. మిగులు జలాలపై దిగువ రాష్ట్రమైన ఉమ్మడి ఏపీకి బచావత్‌ అవార్డు పూర్తి హక్కులు కల్పించగా బ్రిజేష్‌ ట్రిబ్యునల్‌ మిగులు జలాల్లో ఎగువ రాష్ట్రాలకూ వాటా ఇచ్చి తన అశాస్త్రీయ విధానంతో ఏపీకి తీరని అన్యాయం చేసింది.
బచావత్‌ అవార్డు మహారాష్ట్రకు 585 టిఎంసీలు, కర్నాటకకు 734 టిఎంసీలు, ఏపీకి 811 టిఎంసీలు కేటాయించగా, బ్రిజేష్‌ ట్రిబ్యునల్‌ వరుసగా 666, 911, 1001 టిఎంసీలుగా పేర్కొంది. ఎగువ రాష్ట్రాలకు అదనంగా 140 టిఎంసీలు ధారాదత్తం చేసింది. ఏపీకి పెంచామంటున్న కేటాయింపులు కాగితాలకే పరిమితం. నీటి లభ్యత లేని సమయంలో ఎగువ రాష్ట్రాలు తమకు కేటాయించిన నీటిని వాడుకుంటే కిందికి చుక్కరాదు. దిగువ రాష్ట్రం అనివార్యంగా నష్టపోవాల్సిందే. అందుకే సుప్రీం కోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో ప్రస్తుతానికి అమల్లో ఉన్న బచావత్‌ కేటాయింపులను ప్రాజెక్టులవారీగా, రాష్ట్రాల వారీగా పుఃనపంపిణీ చేయాలని ఏపీ, తెలంగాణ చేస్తున్న డిమాండ్‌ సహేతుకమైంది. అయినా బ్రిజేష్‌ ట్రిబ్యునల్‌ ఆ వాదనలను నిర్ద్వందంగా తిరస్కరించింది. అందుకు ఏపి రీఆర్గనైజేషన్‌ యాక్టులోని సెక్షన్‌ 89ను సాకుగా చూపించి, ఉమ్మడి ఏపీకి చేసిన కేటాయింపులను రెండు తెలుగు రాష్ట్రాలూ పంచుకోవాలనీ, ప్రాజెక్టులవారీ కేటాయింపులు, నీటి లభ్యత తగ్గినప్పుడు అనుసరించాల్సిన ప్రొటోకాల్‌పైనా, గోదావరి బేసిన్‌ నుంచి కృష్ణాకు నీటి మళ్లింపుపైనా విచారణ జరుపుతామని అంటోంది. ఏపీ విభజన చట్టానికి అనుగుణంగా కేంద్రంచే గడువు పొడిగించబడ్డ బ్రిజేష్‌ ట్రిబ్యునల్‌పై సహజంగానే మోడీ సర్కారు నియంత్రణ ఉంటుందన్నది తిరుగులేని యధార్ధం. బ్రిజేష్‌ ట్రిబ్యునల్‌ తీర్పులో పేర్కొన్న అంశాలే అందుకు సాక్ష్యాలు. కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఆధ్వర్యంలో ఏపీ, తెలంగాణ మధ్య నదీ జలాల వివాదాల పరిష్కారానికై ఏర్పడిన అపెక్స్‌ కౌన్సిల్‌ దిశా, నిర్దేశాలు రెండు తెలుగు రాష్ట్రాలకూ పరిమితం అయినందన, దాని ప్రాతిపదికన తీర్పు చెప్పానని బ్రిజేష్‌ ట్రిబ్యునల్‌ స్పీష్టీకరించింది. అంతేనా, కేంద్రం సుప్రీం కోర్టుకు ఇచ్చిన అఫిడవిట్‌లలో నదీ జలాల పంపిణీ రెండు తెలుగు రాష్ట్రాలకూ పరిమితం చేసింది. అదే తమ సలహా అని ట్రిబ్యునల్‌కూ తెలిపింది. దీన్నిబట్టి ట్రిబ్యునల్‌పై కేంద్ర మార్గదర్శకత్వం పని చేసిందని అర్థమవుతుంది. 
అధికార కాంక్ష, రాజకీయ లబ్ధి కోసమే నరేంద్ర మోడీ సర్కారు తెలుగు రాష్ట్రాలకు అన్యాయం చేసిందన్న విమర్శలకు కేంద్ర ప్రభుత్వ వ్యవహారం బలం చేకూర్చుతోంది. మహారాష్ట్రలో బిజెపి అధికారంలో ఉంది. వచ్చే ఏడాదిలో కర్నాటకలో ఎన్నికలున్నాయి. మహారాష్ట్రలో అధికారం నిలబెట్టుకోవడం, కర్నాటకలో పాగా వేయడం కేంద్రం తీసుకున్న కర్తవ్యాలు. అందుకే బ్రిజేష్‌ ట్రిబ్యునల్‌ ముందు ఆయా రాష్ట్రాల వాదనలకు బలం చేకూర్చే విధంగా కేంద్రం వ్యవహరించిందన్న వాక్కు బలంగా వినిపిస్తోంది. తాజా బ్రిజేష్‌ ట్రిబ్యునల్‌ తీర్పుపై ఏపీలో అధికారంలో ఉన్న చంద్రబాబు సర్కారు స్పందించాలి. ఎన్‌డిఎలో భాగస్వామిగా ఉన్నప్పటికీ ప్రత్యేక హోదా సహా విభజన హామీలను బిజెపి ఎగ్గొడుతున్నా మౌనం దాల్చిన టిడిపి ప్రభుత్వం, బ్రిజేష్‌ తీర్పుపైనా ఆచితూచి స్పందించడం దారుణం. రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బ తీస్తున్న మోడీ సర్కారును టిడిపి సర్కారు నిలదీయాలి. బ్రిజేష్‌ తీర్పుపై తక్షణం సుప్రీం కోర్టులో సవాల్‌ చేయాలి. ఏకపక్షంగా కాకుండా అఖిలపక్ష సమావేశం నిర్వహించి అందరినీ కలుపుకుపోవాలి. తెలంగాణ, ఆంధ్ర సమస్యగా ఉద్వేగాలతో ముడిపెట్టకుండా రెండు తెలుగు రాష్ట్రాలూ సమన్వయంతో పని చేయాలి. ఉన్న నీటిలో వాటాలకోసం తగాదా పడడం కాకుండా బచావత్‌ ట్రిబ్యునల్‌ ప్రకారం రెండు రాష్ట్రాలకు నీటి కేటాయింపులు జరగాలన్న వాదనను రెండూ కలిసి వినిపించాలి.