తుళ్లూరులో స్వీయ గృహదీక్షలు..

అసైన్డ్‌, సీలింగు భూముల లబ్ధిదారులకు పరిహారం చెక్కులివ్వాలని రాజధాని ప్రాంత పేదలు వినూత్న నిరసనకు దిగారు. బహిరంగ నిరసనలపై ప్రభుత్వం ఆంక్షలు పెట్టి, అరెస్టులకు పాల్పడుతుండటంతో పేదలు మూతికి నల్లగుడ్డలు కట్టుకుని స్వీయ గృహ దీక్ష చేపట్టారు. దాదాపు 30 చోట్ల వందలాది మంది మహిళలు ఈ దీక్షల్లో కూర్చున్నారు. ప్రభుత్వం స్పందించే వరకు పచ్చి మంచినీళ్లు కూడా ముట్టబోమని భీష్మించారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు పెద్ద ఎత్తున తుళ్లూరు లైబ్రరీ సెంటర్లో మోహరించారు.ఈ దీక్షలకు క్రిడా కన్వీనర్‌ సిహెచ్‌.బాబూరావు మద్దతు ప్రకటించారు. బాబూరావు మాట్లాడుతూ 206 ఎకరాల భూములను 380 మంది పేద రైతులు తరతరాలుగా సాగు చేసుకుంటున్నారని వాటికి ఇంతవరకు కౌలు పరిహారం ఇవ్వలేదని తెలిపారు. ఆ ఆ భూములపై పేదలకు హక్కులు లేవనడం న్యాయమా అని ప్రశ్నించారు. దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్న వారికి లేని హక్కు విదేశీ కంపెనీలకు, అధికార తెలుగుదేశం పార్టీకి ఎక్కడ నుండి వచ్చిందని ప్రశ్నించారు. లంకల్లోని మరో 2వేల ఎకరాల భూములనూ ఇచ్చేస్తామని ప్రకటనలు చేస్తూ పేదలను భయపెడుతున్నారని ఆరోపించారు. అక్టోబరు 22న శంకుస్థాపన చేస్తామని ప్రపంచ దేశాల్లో చెప్పొస్తున్న ముఖ్యమంత్రికి ఇక్కడి పేదల బాధలు పట్టకపోవడం బాధాకరమన్నారు.