డ్రాపౌట్స్‌ను పెంచే డిటెన్షన్‌ విధానం..

పాఠశాల విద్యలో డిటెన్షన్‌ విధానం తిరిగి ప్రవేశపెట్టాలని కేంద్ర మానవ వనరుల శాఖ దేశవ్యాప్త చర్చకు తెరతీసింది. ఆగస్టు 19న ఢిల్లీలో జరిగిన రాష్ట్రాల విద్యామం త్రుల, అధికారుల సమావేశంలో డిటెన్షన్‌ విధానం ప్రవేశ పెట్టాలని చర్చ జరిగి, రాష్ట్రాల అభిప్రాయాలను రాతపూర్వకంగా ఇవ్వాలని కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీ కోరారు. కేంద్ర విద్యా విషయాల సలహా మండలి (సిఎబిఇ) ఈ మేరకు సిఫార్సు చేసినట్లు ఆమె తెలిపారు. దీనిలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లో కూడా విద్యాశాఖ ఆధ్వర్యం లో మండల, జిల్లా స్థాయిలో ఉపాధ్యాయు లు, ఉపాధ్యాయ సంఘాల అభిప్రాయాలు సేకరిస్తున్నారు. అభిప్రాయ సేకరణలో విద్యావేత్తలు, స్వచ్ఛంద సంస్థలు, తల్లిదండ్రులు మొదలైన వారికి భాగస్వామ్యం కల్పించవలసిన అవసరముంది.
ఆంధ్రప్రదేశ్‌లో నాన్‌-డిటెన్షన్‌ విధానం
1970వ దశకంలో ఆంధ్రప్రదేశ్‌లో అక్షరాస్యత తక్కువగా ఉండి, ప్రాథమిక స్థాయిలోనే బడి మానేసే వారి సంఖ్య (డ్రాపౌట్స్‌) చాలా ఎక్కువగా ఉండేది. 1971లో కాసు బ్రహ్మానందరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నాన్‌-డిటెన్షన్‌ విధానం ప్రవేశపెట్టారు. 7వ తరగతికి కామన్‌ పరీక్షలు, 10వ తరగతికి పబ్లిక్‌ పరీక్షలు నిర్వహించేవారు. 7వ తరగతి పరీక్షలు పాస్‌ గ్యారంటీ పథకాల ద్వారా ఫార్స్‌గా ''మారటంతో పాఠశాల విద్యాశాఖ 2008లో 7వ తరగతి కామన్‌ పరీక్షలను రద్దు చేసింది. 2010లో చేసిన జాతీయ విద్యా హక్కు చట్టం సెక్షన్‌ 16లో ''బడిలో చేరిన బాలలను ప్రాథమిక విద్య పూర్తయ్యే వరకు ఏ తరగతిలోనైనా మళ్ళీ కొనసాగించరాదు. బడి నుంచి తీసివేయరాదు'' అని చెప్పింది. నాన్‌ డిటెన్షన్‌ విధానం వల్ల బలహీన వర్గాల పిల్లలు పాఠశాలలకు రావడం పెరగటమేకాక, బాలికలలో సైతం అక్షరాస్యత పెరిగింది. తల్లితండ్రులు తమ పిల్లలను బడి మాన్పించి ఇతర పనులలో పెట్టకుండా ఉండేందుకు ఈ విధానం కొంతమేరకు ఉపయోగపడింది. అయితే పేద ప్రజల ఆర్థిక, సామాజిక స్థితిగతుల వల్ల ''డ్రాపౌట్స్‌'' విధానం కొనసాగుతున్నది.
రాష్ట్రంలో డ్రాపౌట్స్‌-ప్రస్తుత పరిస్థితులు
1970, 1980 దశకాలతో పోల్చినప్పుడు పాఠశాల విద్యలో డ్రాపౌట్స్‌ రేటు తగ్గినప్పటికీ ఇప్పుడూ కొనసాగుతూనే ఉన్నది. 2013-2014 పాఠశాల విద్యాశాఖ గణాంకాల ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో 1వ తరగతిలో వందమంది పిల్లలు చేరితే 10వ తరగతికి వచ్చేటప్పటికి 26.83 శాతం డ్రాపౌట్స్‌ ఉంటున్నాయి. ఈ సంఖ్య దళిత విద్యార్థుల్లో 34.99 శాతం, గిరిజన విద్యార్థుల్లో 60.37 శాతం ఉన్నది. 13 జిల్లాల గణాంకాలు పరిశీలిస్తే డ్రాపౌట్స్‌ రేటు తెలుస్తుంది.
ఈ గణాంకాలు డ్రాపౌట్స్‌ రేటు ఇప్పటికీ ఎక్కువగానే ఉన్నదని తెలుపుతున్నా యి. డిటెన్షన్‌ విధానం ప్రవేశపెడితే డ్రాపౌట్స్‌ మరింత పెరిగే అవకాశం ఉంది.
ప్రభుత్వ బడులు మరింత క్షీణించే ప్రమాదం
ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే ప్రభుత్వ బడు ల్లో పిల్లల సంఖ్య బాగా తగ్గింది. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధం గా మన రాష్ట్రంలో పాఠ శాల విద్య ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణ జరిగింది. ప్రభుత్వ బడుల్లో 60 శాతం పిల్లలు ఉండగా 40 శాతం పైగా ప్రైవేటు, కార్పొరేట్‌ బడుల్లో ఉన్నారు. ఆర్థిక స్థోమత కలిగినవారు, మధ్యతరగతి, ఉన్నత ఆదాయ వర్గాలు, ఉద్యోగులు, ప్రజా ప్రతినిధులు, ఉపాధ్యాయులు మొదలైన వారందరూ తమ పిల్లలలను ప్రైవేట్‌, కార్పొరేట్‌ పాఠశాలల్లో చదివిస్తున్నారు. పేదలు, దళితులు, గిరిజనులు, అల్పసంఖ్యాకవర్గాలు, వెనుకబడిన తరగతులకు చెందిన పిల్లలు ప్రభుత్వ బడుల్లో చదువుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల్లో 84 శాతం బడుగు, బలహీన వర్గాలకు చెందిన వారే. ఈ నేపథ్యంలో డిటెన్షన్‌ విధానం ప్రవేశపెడితే ప్రభుత్వ బడుల్లో ఫెయిల్యూర్స్‌ ఎక్కువగా ఉండి, డ్రాపౌట్స్‌ పెరగటమే కాక, ఈ పాఠశాలలు మరింత క్షీణించే ప్రమాదముంది. పేద విద్యార్థులు బాలకార్మికులుగా మారతారు.
సమర్థవంతమైన మూల్యాంకన అవసరం
నాన్‌ డిటెన్షన్‌ విధానంతోపాటు సమర్థవంతమైన మూల్యాంకన విధానం ప్రవేశపెట్టటంలో విఫలం చెందాము. చదువులో పరీక్షలు ఒక భాగం మాత్రమే. విద్యార్థి సామర్థ్యాలను అన్ని కోణాల్లో మూల్యాంకన చేయవలసి ఉన్నది. పరీక్షల సంస్కరణల్లో భాగంగా ఇటీవల అమలులోకి తెచ్చిన ''నిరంతర సమగ్ర మూల్యాంకన (సిసిఐ) విధానాన్ని పటిష్టంగా 10వ తరగతి వరకు అమలు పరచాలి. పిల్లల ఆలోచన, అభ్యసన, అన్వయ సామర్థ్యాలను, విభిన్నమైన నైపుణ్యాలను అంచనా వేయటానికి వీలుగా పరీక్షల సంస్కరణలను అమలు పరచాలి. సిసిఐ అమలు పద్ధతులపై ఉపాధ్యాయులకు నిరంతర శిక్షణ ఇవ్వాలి. పిల్లల సామర్థ్యాలను, పరీక్షల ఫలితాలను తల్లిదండ్రులకు తెలియచేసేవిధంగా యంత్రాంగాన్ని రూపొందించాలి.
నాన్‌ డిటెన్షన్‌ విధానం-ప్రయోజనాలు
1929 లోనే హార్టాగ్‌ కమిటీ ''వృథా-స్తబ్థత'' గురించి పేర్కొన్నది. నాన్‌-డిటెన్షన్‌ విధానం వల్ల ఇవి రెండూ ఉండవు. పిల్లలు ఏటా పై తరగతికి వెళ్తుండటంతో డ్రాపౌట్స్‌ రేటు క్రమంగా తగ్గి అక్షరాస్యత పెరుగుతూ ఉంటుంది. అలాగే పరీక్షల వల్ల కలిగే మానసిక ఒత్తిడి నుంచి పిల్లలు బయట పడతారు. ఇంటర్మీడియెట్‌ విద్యార్థులు ఒత్తిడి వల్ల ఏవిధంగా ఆత్మహత్యలు చేసుకుంటున్నారో నిత్యం చూస్తున్నాము. తల్లిదండ్రులు తమ పిల్లలను బడిమాన్పించి ఇతర పనుల్లో పెట్టకుండా నాన్‌ డిటెన్షన్‌ పద్ధతి ఉపయోగపడుతుంది. ప్రైవేట్‌ విద్యాసంస్థల ''పాస్‌ గ్యారంటీ'' పథకాలకు అవకాశం ఉండదు. ప్రతి విద్యార్థీ జాతీయ విద్యా చట్టం లక్ష్యాలకనుగుణంగా చదువుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. డిటెన్షన్‌ విధానంపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తొందరపడకుండా విద్యావేత్తలు, నిపుణులు, విద్యారంగంలో పనిచేసే స్వచ్ఛంద సంస్థల అభిప్రాయాలతోపాటు వివిధ రాజకీయ పార్టీల అఖిల పక్షం ఏర్పాటు చేసి అభిప్రాయసేకరణ చేసిన అనంతరమే నిర్ణయాలు తీసుకోవాలి.
జిల్లా -శాతం
శ్రీకాకుళం -15.64
విజయనగరం- 34.20
విశాఖపట్నం- 19.94
తూర్పు గోదావరి -17.55
పశ్చిమ గోదావరి -9.98
కృష్ణా -15.42
గుంటూరు - 27.82
ప్రకాశం - 37.79
నెల్లూరు - 29.40
కడప - 36.64
కర్నూలు - 45.02
అనంతపురం - 29.7
చిత్తూరు - 21.97

- కెయస్‌ లక్ష్మణరావు 
(వ్యాసకర్త శాసనమండలి మాజీ సభ్యులు, విద్యా వికాస వేదిక సభ్యులు)