డెక్కన్‌ కెమికల్ కంపెనీ విస్తరణ అనుమతులు నిలిపేయాలి. ఫిబ్రవరి 23న ప్రజాభిప్రాయసేకరణను రద్దు చేయండి - జిల్లా కలెక్టర్‌కు సిపిఎం జిల్లా కార్యదర్శి లోకనాథం లేఖ

            విశాఖ జిల్లా పాయకరావుపేట మండలం డెక్కన్‌ ఫైన్‌ కెమికల్స్‌ కంపెనీ విస్తరణ ఇచ్చిన అనుమతులను రద్దు చేయాలని, దీని కోసం వచ్చే నెల 23న నిర్వహించబోయే ప్రజాభిప్రాయసేకరణను రద్దు చేయాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎన్‌.యువరాజ్‌ను సిపిఎం జిల్లా కార్యదర్శి కె.లోకనాథం కోరారు. ఈ మేరకు సోమవారం కలెక్టర్‌కు లోకనాథం రాసిన లేఖను పత్రికలకు విడుదల చేశారు. 'భద్రతా చర్యలు పాటించకపోవడంతో తరచూ డెక్కన్‌ కెమికల్‌ కంపెనీలో ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. కనీస భద్రతా ప్రమాణాలు పాటించని ఈ కంపెనీ విస్తరణకు అనుమతులు మంజూరు చేస్తే కంపెనీ కార్మికులతో సహా పరిసర రాజవరం, గజపతినగరం, పెంటకోట, వెంకటనగరం, రాజానగరం, కేశవరం, శ్రీరాంపురం, రాజగోపాలపురం ప్రజలకు తీరని నష్టం కలుగుతుందని పేర్కొన్నారు. డెక్కన్‌ కంపెనీలో 2014 ఏప్రిల్‌ 11న రియాక్టర్‌పేలి జరిగిన ప్రమాదంలో ఐదుగురు కార్మికులు మృతిచెందగా 20 మంది గాయపడ్డారు. ఈ పరిశ్రమ కాలుష్యం వల్ల క్యాన్సర్‌, గుండెజబ్బులు వంటి వ్యాధులబారిన ప్రజలుపడుతున్నారు. కార్మిక చట్టాలు అమలుచేయని యాజమాన్యం, యూనియన్‌ ఏర్పాటు చేసుకొనే హక్కునూ కాలరాచి యూనియన్‌ నాయకులపై తీవ్ర నిర్భందాన్ని ప్రయోగిస్తోంది. ఈ ప్రమాదాలు చాలవన్నట్లు ప్రస్తుతమున్న 4,750 టన్నుల సామర్ధ్యాన్ని 8,665 టన్నులకు పెంచేందుకు యాజమాన్యం సిద్ధపడుతోంది. ప్రజాప్రయోజనాల రీత్యా జోక్యం చేసుకొని కంపెనీ విస్తరణకు చేపట్టబోయే ప్రజాభిప్రాయసేకరణను రద్దుచేయాలని, ఆదివారం కంపెనీలో జరిగిన ప్రమాదంపై సమగ్ర విచారణకు ఆదేశించి భవిష్యత్‌లో ఇటువంటి ప్రమాదాలు జరక్కుండా ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించాలి' అని ఆ లేఖలో పేర్కొన్నారు.