డిమాండ్లపై కెవిపిఎస్‌ ఉద్యమం

 భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ రాజ్యాంగంలో రిజర్వేషన్లు పొందుపర్చడం వల్ల దళితులు ఉద్యోగాలు పొంది కొంతవరకైనా అభివృద్ధి అవుతున్నారు. దీన్ని కూడా అగ్రకుల దురహంకారులు ఓర్వలేక పోతున్నారు. ఇంకెన్నాళ్లు రిజర్వేషన్లు, తీసేయమని గగ్గోలు పెడుతున్నారు. రిజర్వేషన్ల వల్ల ప్రతిభ తగ్గిపోతుందని అంటున్నారు. ప్రైవేట్‌రంగంలో రిజర్వేషన్లు అమలుచేయబోమని పెట్టుబడిదారులు, కార్పొరేట్‌ సంస్థలు ముక్తకంఠంలో చెబుతున్నాయి. కానీ పాలకులు ప్రైవేటురంగాన్ని ప్రోత్సహించడం ద్వారా రాజ్యాంగ స్ఫూర్తికే విఘాతం కల్గిస్తోంది.
             దేశానికి స్వాతంత్య్రం వచ్చి 68 సంవత్సరాలు కావస్తోంది. ఒక ప్రక్క నాగరికత ఎంత గా అభివృద్ధి చెందుతోందో కుల వివక్షత అనేక రూపాల్లో నేటికీ కొనసాగుతోంది. జాతీయ నేర రికార్డుల బ్యూరో లెక్కల ప్రకారం 2012తో పోల్చితే 2013లో 17 శాతం దళితులపై దాడులు పెరిగాయి. కానీ శిక్షింపబడింది కేవలం 23 శాతం మాత్రమే. 2011లో 39,401 కేసులు, 2012లో 39,501 కేసులు, 2013లో 46,114 కేసుల నమోదయ్యాయి. ఇవి ప్రతి సంవత్సరం పెరిగిపోతున్నాయి. 2013లో ఆంధ్రప్రదేశ్‌లో 5,600, రాజస్థాన్‌లో 8,126 యుపిలో 7,103, బీహార్‌లో 6,815, ఎంపిలో 4,241, ఒడిషాలో 3,322 కేసులు నమోదయ్యాయి. 2013లో మొత్తం కేసుల్లో 90 శాతం నాలుగు రాష్ట్రాల్లోనే నమోదయ్యాయి. భారత శిక్షా స్మృతి ప్రకారం విచారించదగ్గ నేరాలు 40.2 శాతం కాగా దాడుల కేసులు 2011లో 30 శాతం ఉండగా 2013లో అవి 22.3 శాతానికి పడిపోయాయి. కేవలం హర్యానా, మహారాష్ట్ర, త్రిపుర రాష్ట్రాల్లో మాత్రమే దాడుల కేసుల అమలు, సహాయ పునరావాసం అమలు సమీక్షకు సబ్‌ డివిజన్‌లు ఏర్పాటుచేశారు. పెండింగ్‌ కేసులు 2011లో 79.9 శాతం ఉండగా 2013లో 84.1 శాతానికి పెరిగాయి. సగటున దళితులు వారానికి 13 మంది హత్యకు, ఆరుగురు అపహరణకు, 21 మంది మహిళలు అత్యాచారాలకు గురవుతున్నారు. దళితులకు రక్షణ కల్పించవలసిన పోలీసులు, అధికారులు సైతం పెత్తందారులకు కొమ్ముకాస్తున్నారు. ఎస్‌సి/ఎస్‌టి అత్యాచార నిరోధక చట్టాన్ని పటిష్టంగా అమలు చేయడానికి గత యుపిఎ-2 ప్రభుత్వం కొన్ని సవరణలు చేసింది. బిజెపి అధికారంలోకి రాగానే యుపిఎ-2 ప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్స్‌ను స్టాండింగ్‌ కమిటీకి పంపింది. కమిటీ తన నివేదికను 2014 డిసెంబరులోనే సమర్పించినప్పటికీ 2015-16 బడ్జెట్‌ సమావేశాల్లో ఆమోదించడానికి బిజెపి ప్రతిపాదించలేదు. పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లోనైనా ఎస్‌సి, ఎస్‌టి అత్యాచార నిరోధక చట్టం బిల్లు తేవాలని కెవిపిఎస్‌ డిమాండ్‌ చేస్తోంది. 
భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ రాజ్యాంగంలో రిజర్వేషన్లు పొందుపర్చడం వల్ల దళితులు ఉద్యోగాలు పొంది కొంతవరకైనా అభివృద్ధి అవుతున్నారు. దీన్ని కూడా అగ్రకుల దురహంకారులు ఓర్వలేక పోతున్నారు. ఇంకెన్నాళ్లు రిజర్వేషన్లు, తీసేయమని గగ్గోలు పెడుతున్నారు. రిజర్వేషన్ల వల్ల ప్రతిభ తగ్గిపోతుందని అంటున్నారు. ప్రైవేట్‌రంగంలో రిజర్వేషన్లు అమలుచేయబోమని పెట్టుబడిదారులు, కార్పొరేట్‌ సంస్థలు ముక్తకంఠంలో చెబుతున్నాయి. కానీ పాలకులు ప్రైవేటురంగాన్ని ప్రోత్సహించడం ద్వారా రాజ్యాంగ స్ఫూర్తికే విఘాతం కల్గిస్తోంది.
బడ్జెట్‌లో ప్రణాళికా బడ్జెట్‌ నుంచి దళితుల జనాభా ప్రాతిపదికన నిధులు కేటాయించి, ఖర్చు చేయాల్సిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు కేటాయించడంలోనూ, ఖర్చు చేయడంలోనూ వివక్ష చూపుతున్నాయి. దళితులకు కేటాయించిన నిధులు అగ్రకులాల అభివృద్ధికి ఖర్చు చేస్తున్నాయి. ఐక్య పోరాట ఫలితంగా 2013లో యస్‌సి, యస్‌టి సబ్‌ప్లాన్‌ చట్టం వచ్చింది. చట్టం అమలుకు నియమ నిబంధనలపై ఇచ్చిన జీవో 23 లోపభూయిష్టంగా ఉంది. దీన్ని సవరణ చేయమని అడుగుతుంటే రాష్ట్ర ప్రభుత్వం నోరు మెదపటం లేదు. దేశవ్యాప్తంగా యస్‌సి, యస్‌టిలకు సబ్‌ప్లాన్‌ చట్టం రూపొందించాలని, నిధులు ప్రక్కదారి పట్టిస్తున్న వారిపై యస్‌సి, యస్‌టి అత్యాచార నిరోధక చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని, యస్‌సి, యస్‌టి సబ్‌ప్లాన్‌ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని కెవిపిఎస్‌ డిమాండ్‌ చేస్తోంది.
ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగ నియామకాల్లో రిజర్వేషన్లు ఉన్నప్పటికీ పెద్ద సంఖ్యలో యస్‌సి, యస్‌టి బ్యాక్‌లాగ్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఒకవైపు ఉద్యోగాలు తగ్గి పోతుండగా, మరోవైపు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యస్‌సి, యస్‌టి బ్యాక్‌లాగ్‌ పోస్టులు భర్తీ చేయకుండా రద్దు చేస్తున్నాయి. సిబ్బంది విభాగం లెక్కల ప్రకారం 2011లో యస్‌సి, యస్‌టి బ్యాక్‌లాగ్‌ పోస్టులు 24.779 ఉన్నాయి. గత కొన్ని సంవత్సరాల నుంచి ప్రమోషన్లలో రిజర్వేషన్లు పాటించడం లేదు. కారుణ్య నియామకాలను అమలు చేయడం లేదు. ఈ రకంగా దళితులకు అన్యాయం జరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వ విభాగాల్లో రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల్లోని ఎ, బి, సి గ్రూపు పోస్టులను కూడా కలుపుకుంటే యస్‌సి, యస్‌టి ఖాళీలు ఎక్కువగా ఉంటాయి. కావున యస్‌సి, యస్‌టి బ్యాక్‌లాగ్‌ పోస్టులు భర్తీ చేయాలని, ప్రమోషన్ల్‌లో రిజర్వేషన్లు అమలు చేసి, కారుణ్య నియామక ఉద్యోగాలు ఇవ్వాలని కెవిపియస్‌ డిమాండ్‌ చేస్తోంది.
డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ 125వ జయంతిని దేశవ్యాప్తంగా ఘనంగా జరపాలని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు ఇచ్చారు. పైగా నా 'కళ్ళల్లో మెదలాడు తున్నాడు' అని అంటున్నారు. కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బిజెపి దళిత సమస్యలకు పరిష్కారం చూపగపోగా చిన్న చిన్న పథకాలు ఆశచూపి దళితులను దగా చేస్తున్నది. కులవివక్ష, దళితులను అగౌరవ పర్చడం, అంటరాని వారిగా అస్పృశ్యులుగా చూడటం, దేవాలయ ప్రవేశాలకు అనుమతించక పోవటం లాంటివి నేటికీ కొనసాగుతున్నాయి.దళితులు దేవాలయాల్లోకి ప్రవేశిస్తే ఆలయాలను శుభ్రం చేయడం లాంటివి ఇటీవల బీహార్‌ ముఖ్యమంత్రికి ఎదురైంది.
అంబేద్కర్‌పై నిజమైన ప్రేమ ఉంటే 125వ జయంతి సందర్భాన్ని పురస్కరించుకొని దళిత సమస్యలపై చర్చించడానికి నాలుగు రోజులు ప్రత్యేక పార్లమెంటు సమావేశాలు జరపాలని కెవిపియస్‌ డిమాండ్‌ చేస్తున్నది. పై డిమాండ్ల సాధనకు ఈ క్రింది కార్యక్రమాల్లో దళితులు, గిరిజనులు, మేధావులు, దళిత ప్రజాసంఘాలు పాల్గొని జయప్రదం చేయాలని కోరుతున్నాం. జులై 7 నుంచి 15 వరకు రౌండ్‌ టేబుల్‌ సమావేశాలు, జులై 16 నుంచి 31 వరకు దళిత పేటల్లో సంతకాల సేకరణ, ఎంపీలకు అర్జీలు ఇవ్వడం, ఆగస్టు 16-31 వరకు సెమినార్లు, సదస్సులు నిర్వహించడం, సెప్టెంబరు 4 నుంచి 18 వరకు పాద, సైకిల్‌ యాత్రలు, సెప్టెంబరు 21, 22 తేదీల్లో సమస్యలపై ఆందోళనలు చేయాలని నిర్ణయించింది. ఈ ఉద్యమానికి ప్రజలందరూ అన్ని విధాలా సహాయ సహకారాలు ఇవ్వాలని కోరుతున్నాం.
(వ్యాసకర్త కుల వివక్ష వ్యతిరేక పోరాట సంస్థరాష్ట్ర ప్రధాన కార్యదర్శి)
- అండ్ర మాల్యాద్రి