డిగ్రీలో సెమిస్టర్‌ ఎవరి కోసం?

డిగ్రీ కళాశాలలను అభివృద్ధి చేసి, ఖాళీగా ఉన్న అధ్యాపక, అధ్యాపకేతర పోస్టులను భర్తీ చేసి అంతర్జాతీయ ప్రమాణా లతో నూతన కోర్సులను ప్రవేశపెట్టి, ప్రమాణాలు పెంచాల్సిన ప్రభుత్వం ఆ దిశగా అలోచనలకు ఆమడ దూరంలో ఉంది. ఇప్పటి దాకా డిగ్రీలో ఉన్న మూడు సంవత్సరాల పరీక్షల స్థానంలో ఆరు సార్లు పరీక్షలు నిర్వహించే ''సెమిస్టర్‌ విధానాన్ని'' అమలు చేయడానికి సిద్ధం అవుతున్నది. ఈ విధానాన్ని ఎవరి ప్రయోజనాల కోసం అమలు చేస్తున్నారు? విద్యార్థుల చదువుల్లో ప్రమాణాలు పెరుగుతాయా లేక ప్రైవేట్‌ కళాశాలల్లో ఫీజులు దండుకోవడానికా లేక ప్రైవేట్‌ కళాశాలల్లో జరుగుతున్న అక్రమాలను అడ్డుకట్టవేయడానికా లేక కొత్తగా రాష్ట్రంలోకి ఆహ్వానిస్తున్న ప్రైవేట్‌ యూనివర్శిటీల్లో ప్రవేశార్హత సాధించడానికా అనేది అంతా సీక్రెట్‌ ఈ ప్రభుత్వ విధానం. ఎందుకంటే బాబు ప్రభుత్వం ఏ బహుళజాతి కంపెనీతో ఏ అంతర్గత ఒప్పందం చేసుకుందో మంత్రివర్గానికే తెలియని దీనమైన స్థితి మన రాష్ట్రంలో ఉంది. ఎందుకంటే ఇటీవల సింగపూర్‌ ప్రతినిధులతో సమావేశంలో రాష్ట్ర మంత్రులకు సమావేశం నుంచి బయటకు పంపారనే కథనాలు చూస్తుంటే రాష్ట్రాన్ని ప్రజాస్వామ్య ప్రభుత్వం పాలిస్తోందో లేక సింగపూర్‌, జపాన్‌ కంపెనీలు పాలిస్తున్నాయో అర్థం కాని పరిస్ధితికి నెట్టబడ్డాము.
రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది నుంచే డిగ్రీ మొదటి సంవత్సరంలో ఛాయిస్‌ బేస్ట్‌ క్రెడిట్‌ సిస్టమ్‌ (సిబిసిఎస్‌)ను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించి సిలబస్‌ తయారీ, ప్రభుత్వ ఆమోదం అన్నీ పూర్తి చేశారు. అమలు మాత్రం నాలుగు అడుగులు ముందుకూ, రెండు అడుగులు వెనక్కూ వేస్తున్నారు. వాస్తవికంగా ఈ విధానం అమెరికా లాంటి అగ్రదేశాల్లో ఇది వరకే అమలు జరుగుతున్నది. అక్కడ ప్రతి ముగ్గురు విద్యార్థులకు ఒక అధ్యాపకుడు ఉంటారు. నిత్యం పర్యవేక్షణ ఉంటుంది. విద్యార్థులకు అన్ని రకాల వసతుల కల్పనలో లోటు కనిపించదు. కానీ మన రాష్ట్రంలోని 141 ఎయిడెడ్‌ డిగ్రీ కళాశాలలకు గతంలో ఈ తెలుగుదేశం ప్రభుత్వమే ఉరితాడులా జీవో నెం 35 తెచ్చింది. ఒకప్పుడు విశాఖ నగరంలోని ఎవిఎస్‌, విజయవాడలోని లయోలా, గుంటూరు ఎసి, హిందూ, మచిలీపట్నం నోబుల్‌, కావలి జెబి, నెల్లూరు విఆర్‌, భీమవరం డిఎన్‌ఆర్‌ కళాశాలల చరిత్ర చాలా గొప్పది. దేశంలోని అనేక మంది రాజకీయ నాయకులు, శాస్త్రవేత్తలు ఈ కళాశాలల నుంచి వచ్చిన వారే. దేశ స్వాతంత్య్రోద్యమంలో కూడా ఈ కళాశాలల చరిత్ర చాలా గొప్పది. కానీ నేడు వీటి పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలకు యుజిసి ఇచ్చే నిధులు తప్ప, రాష్ట్ర ప్రభుత్వం తన బాధ్యతల నుంచి తప్పుకుంది. కానీ నేడు ఈ సెమిస్టర్‌ విధానం అమలు కోసం గుర్తువచ్చినట్టుంది. బహుశా ఏదో బహుళజాతి కంపెనీ నవ్యాంధ్రప్రదేశ్‌లో తన బ్రాంచ్‌ పెట్టాలనుకుని ఇక్కడి విద్యా విధానం గూర్చి మన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును ప్రశ్నిస్తే గుర్తువచ్చినట్టుంది. అందుకు వారి మన్ననలు పొందాలంటే వారిచ్చే సూచనల అమలు ఒక్కటే మార్గంలా కనిపించింది ఈ ప్రభుత్వానికి. అందుకే ఇలాంటి తప్పటడుగులు వేస్తున్నారు.
పునాదిని భద్రపరచాలి
రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ డిగ్రీ కళాశాలల్లో ముందు అన్ని రకాల వసతులు కల్పించాలి. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేస్తున్న అధ్యాపక పోస్టుల్లో నెట్‌ లేదా సెట్‌ అర్హత సాధించిన వారినే నియమిస్తున్నారు. కాని ప్రైవేట్‌ కళాశాలలకు ఇది వర్తించడం లేదు. ఎయిడెడ్‌ కళాశాలల్లో వేల కొలది పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రభుత్వం ఇచ్చే గ్రాంటులను అపేసింది. మరోవైపు డిగ్రీ కళాశాలల్లో పని చేస్తున్న అధ్యాపకులను చూస్తే అయ్యోపాపం అనిపిస్తుంది. ఇన్ని రకాల అధ్యాపకులు మిగతా రాష్ట్రాల్లో ఉంటారో, లేదో కానీ మన రాష్ట్రంలో మాత్రం పర్మినెంట్‌, కాంట్రాక్ట్‌, గెస్టు, టైంస్కేల్‌, పార్ట్‌టైమ్‌ లాంటి అనేక రకాల లెక్చరర్లు పని చేస్తున్నారు. వీరిలో పర్మినెంట్‌ అధ్యాపకులు తప్ప మిగిలిన వారి పరిస్థితి దయనీయం. కళాశాలల్లో విద్యార్థులకు అర్థమయ్యే పద్ధతుల్లో పాఠాలు బోధించే అధ్యాపకులను నియమించడంలో చూపాల్సిన శ్రద్ధను పాలకులు మర్చిపోయారు. ఎందుకంటే శ్రీకాకుళం డిగ్రీ కళాశాలలో ఈ విద్యా సంవత్సరం ఎంఇసిఎస్‌ డిగ్రీలో 50 మంది విద్యార్థులు, ఎంపిఇలో మరో 50 మంది ఉన్నారు. రెండవ సంవత్సరంలో 48 మంది, మూడవ సంవత్సరంలో 35 మంది విద్యార్థులు చదువుతున్నారు. కానీ మొత్తం 183 మంది విద్యార్థులున్న ఎలక్ట్రానిక్స్‌ సబ్జెక్టుకు ఒక్క కాంట్రాక్ట్‌ లెక్చరర్‌ మాత్రమే దిక్కు. రాష్ట్రంలో 130 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు ఉంటే అందులో వెయ్యికి పైగా అధ్యాపక పోస్టులు నేటికీ ఖాళీగానే ఉన్నాయి. వీటి అభివృద్ధి కోసం ఆలోచనలు చేయకుండా సెమిస్టర్‌ విధానాన్నీ అమలు చేస్తే మన విద్యార్థుల పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఈ విధానాన్ని ప్రవేశపెట్టే ముందు అంతర్జాతీయ స్థాయిలో మన కళాశాలల అభివృద్ధిని కూడా దృష్టిలో పెట్టుకొని ఆ తరువాత ఈ విధానాన్ని అమలచేస్తే బాగుంటుంది.
కళాశాలల్లో ఫీజులు పెంచడానికే...
ఇప్పటికే 50 శాతం పైగా ప్రైవేట్‌ కళాశాలలు నిర్వహించకుండానే ప్రభుత్వం ఇచ్చే ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై ఆధారపడి నడుస్తున్నాయి. రాష్ట్రంలోని 12 యూనివర్శిటీలు ప్రతి సంవత్సరం డిగ్రీ విద్యార్థుల ఫీజులు పెంచుతున్నాయి. దీన్ని అదనుగా చేసుకుని ప్రైవేట్‌ కళాశాలల అక్రమ ఫీజుల వసూళ్ళకు అడ్డులేదు. అంతేకాకుండా అన్ని యూనివర్శిటీలూ ఆదాయాలను పెంచుకోవడానికి అన్ని సబ్జెక్టుల్లో 90 శాతం మార్కులు సాధించిన విద్యార్థికి రెండు సబ్జెక్టుల్లో ఫెయిల్‌ చేస్తారు. ఇలా చేస్తే కనీసం రీవాల్యుయేషన్‌, రీకౌంటింగ్‌ ఫీజులనైనా విద్యార్థుల నుంచి వర్శిటీ వసూలు చేయవచ్చు అనే దిగజారుడుతనానికి కొన్ని వర్శిటీలు పాల్పడు తున్నాయి. ప్రభుత్వం ఇవ్వాల్సిన నిధులు ఇవ్వకపోతే ఇంక ఏమి చేయాలని తిరిగి ప్రశ్నించే అధికారులు న్నారు. కావున ఇటువంటి పరిస్థితిలో మూడు సంవత్సరాల డిగ్రీ పాస్‌ కావాలంటే మూడు చెరువుల నీళ్ళు తాగిస్తున్న నేపథ్యంలో మూడు సంవత్సరాల్లో ఆరు సార్లు పరీక్షలు నిర్వహిస్తే ఏలాంటి పరిణామాలు ఉంటాయో ఆలోచించాల్సిన అవసరం ఉంది.
ప్రైవేట్‌ వర్శిటీల కోసమేనా?
రాబోయే వర్షాకాల అసెంబ్లీ సమావేశాల్లో ప్రైవేట్‌ యూనివర్శిటీల బిల్లును తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ వర్శిటీలు రాష్ట్రంలో వచ్చాయంటే అందులో చదివే విద్యార్థులకు ఇతర దేశాల్లో అమలు అవుతున్న క్రెడిట్‌ సిస్టమ్‌ ఉండాలి. కానీ ఇప్పటి వరకు అటానమస్‌ కళాశాలల్లో తప్ప మిగిలిన కళాశాలల్లో లేదు. కానీ నేడు అన్ని కళాశాలల్లో అమలుకు సిద్ధ్దమవుతున్న ప్రభుత్వ విధానాన్ని తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది. కావున బహుళజాతి కంపెనీల అవసరాలు తీర్చడానికి విద్యార్థులను పణంగా పెట్టే విద్యా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమించడానికి విద్యార్థిలోకం సిద్ధం కావాల్సిన అవసరం ఉంది.
- ఎస్‌ నూర్‌ మహమ్మద్‌
(వ్యాసకర్త ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి)