ట్రూ అప్‌ ఛార్జీల పేర రూ.7,209 కోట్ల ప్రజలపై భారం- సిపియం రాష్ర్ట కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్.నరసింగరావు

-  చెల్లించని వారి బకాయిలు ప్రజలపై మోపుతారా?
-  ఛార్జీలు పెంచితే నిత్యావసరాల ధరలూ పెరుగుతాయి
-  పరిశ్రమలు మూతపడి లక్షలాది మంది కార్మికుల వీధులపాలు కాక తప్పదు
-  విద్యుత్తు కంపెనీలతో తప్పుడు ఒప్పందాలు రద్దు చేయాలి
-  నేటి ఎపిఇఆర్‌సి బహిరంగ విచారణలో వ్యతిరేకిస్తాం : సిపిఎం
         ట్రూ అప్‌ ఛార్జీల పేర రూ.7,209 కోట్ల విద్యుత్‌ ఛార్జీలు పెంచాలన్న ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సిపిఎం డిమాండ్‌ చేసింది. సంపన్నులు, పెద్ద యజమానులు చెల్లించని బకాయిలను ట్రూ అప్‌ ఛార్జీల కింద ప్రజల నుంచి వసూలు చేయాలని భావించడం సరికా దని హితవు పలికింది. సాధారణంగా విద్యుత్‌ ఛార్జీలు పెంచుతున్న ప్రభుత్వం.. ట్రూ అఫ్‌ ఛార్జీల పేర ఐదేళ్లకొక సారి.. చెల్లించని వారి నుంచి వసూలు చేయాల్సిన విద్యుత్‌ బకాయిలను ప్రజలపై మోపడం సరైంది కాదని, ఈ విధా నాన్ని మార్చుకోవాలని కోరింది. శుక్రవారం విశాఖపట్నంలోని ఎన్‌పిఆర్‌ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్‌ నర్సింగరావు మాట్లాడారు. విద్యుత్‌ భారాలు ప్రజలపై మోపడానికి చేసే ప్రయత్నాలను ఆమోదించవద్దని విద్యుత్‌ రెగ్యులేటరీ కమిషన్‌ శనివారం హైదరాబాద్‌లో నిర్వహించే బహిరంగ విచారణలో తెలియజేయనున్నామని తెలిపారు. ఈ విచారణ లో సిపిఎం పక్షాన రాష్ట్ర కార్యదర్శి పి.మధు, తానూ, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వై.వెంకటేశ్వరరావు హాజరవుతున్నట్టు తెలిపారు. విద్యుత్‌ ఛార్జీల పెరిగితే నిత్యావసర వస్తువుల ధర లు మరింత పెరుగుతాయని, ఫెర్రో ఎల్లాయిస్‌ కంపెనీలతో పాటు చిన్న పరిశ్రమలు మూతపడడంతో లక్షలాది మంది కార్మికులు వీధిన పడతారని ఆవేదన వ్యక్తం చేశారు. గత ఐదేళ్లలో పేరుకుపోయినట్లు ఎపిఇపిడిసిఎల్‌, ఎపిఎస్‌పిడిస ిఎల్‌ చూపిన రూ.5,462 కోట్లకు 12 శాతం వడ్డీతో రూ.1,740 కోట్లు కలిపి రూ.7,209 కోట్ల భారం పెంచాలని ప్రతిపాదించారని వివరించారు. పెట్టుబడుల కోసం విదేశాల చుట్టూ తిరిగే ప్రభుత్వ నేతలకు ఉన్న పరిశ్రమలను పరిరక్షించాల్సిన బాధ్యత లేదా? అని ప్రశ్నించారు. విద్యుత్‌ కంపెనీలతో చేసుకున్న తప్పుడు ఒప్పందాలను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. గ్యాస్‌ ఆధారిత కంపెనీలకు రిలయన్స్‌ గ్యాస్‌ సరఫరా చేయకపోయినా అడగలేని పరిస్థితిలో చంద్రబాబు ప్రభుత్వం ఉందని విమర్శించారు. విద్యుత్‌ వ్యయంలో వ్యత్యాసాలు పూరించడానికి రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ ఇవ్వాలి తప్ప ఛార్జీలు పెంచితే రాష్ట్ర అభివృద్ధికి ఆటంకంగా మారుతుందని అన్నారు. ప్రభుత్వం విద్యుత్‌ ఛార్జీలను పెంచే ఆలోచనను విరమించుకోకపోతే ప్రజాపోరాటాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. 2003 విద్యుత్‌ ఛార్జీల వ్యతిరేక పోరాటంలో ముగ్గురిని బలి తీసుకున్న చంద్రబాబు తరువాత విద్యుత్‌ ఛార్జీలు పెంచడానికి పదేళ్లలో ప్రభుత్వాలు సాహసించనప్పటికీ మళ్లీ అధికారంలోకి వచ్చిన ఆయన విద్యుత్‌ ఛార్జీలు పెంచుతున్నారని విమర్శించారు.