టిడిపి ప్రభుత్వ ఏడాది పాలన నిర్వాకం

రాష్ట్రానికి పెట్టుబడులు రావాలంటే కార్మికులు, ఉద్యోగులు, ప్రజలు ఆందోళనలు చెయ్యకూడదట. వీధుల్లోకి రాకూడదట. ఏం చేసినా కుక్కినపేనులా పడుండాలట. వీధుల్లోకి వచ్చి ఆందోళనలు చేస్తే సహించేది లేదని హెచ్చరిస్తూ మహానాడులో తీర్మానాన్నే ఆమోదించింది. అంగన్‌వాడీ, ఐకెపి ఉద్యోగులు తమ సమస్యలపై ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా అతీగతీ లేదు.
          సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ సమావేశాలు జూన్‌ 29, 30 తేదీలలో విజయవాడలో జరిగాయి. రాష్ట్ర ఆర్థిక, రాజకీయ పరిస్థితి, సంక్షేమ పథకాలు, వాగ్దానాల అమలు, కార్మికుల, ఉద్యోగుల స్థితిగతులు, వాటిపట్ల ప్రభుత్వ తీరును సమావేశం సమీక్షించింది. దాని పూర్తి పాఠం.....
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. బడ్జెట్‌ లోటు రూ.22 వేల కోట్లకు చేరింది. ఏ నెలకు ఆ నెల ఉద్యోగుల జీతాలకు కూడా అప్పుల మీద ఆధారపడాల్సి వస్తున్నది. అయినా పరిశ్రమాధిపతులకు రూ.2,060 కోట్ల సబ్సిడీ బకాయిలు ఆఘమేఘాల మీద రద్దుచేసింది. మరొకవైపు విదేశీ పర్యటనలు, మీటింగులు, ఉత్సవాల పేర డబ్బు విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నది. అధికారంలోకి వచ్చీ రాగానే మంత్రులు, శాసనసభ్యుల వేతనాలు, అలవెన్సులు భారీగా పెంచింది.
కార్మికుల, ఉద్యోగుల, ప్రజల సమస్యల పరిష్కారానికి మాత్రం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగులేదని నంగనాచి కబుర్లు చెబుతున్నది. అంగన్‌వాడీ ఉద్యోగుల వేతనాలు పెంచుతానని శాసనసభా వేదికపై ప్రకటించి మూడు నెలలు అయ్యింది. ఇంతవరకు అతీగతీలేదు. మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు ఇచ్చేది నెలకు కేవలం వెయ్యి రూపాయలు మాత్రమే. అది కూడా గత తొమ్మిది నెలలుగా చెల్లించడంలేదు. పైగా అప్పో సొప్పో చేసి పిల్లలకు వండిపెడితే కనీసంగా ఆ బిల్లులన్నా చెల్లించకుండా ఏడు నెలలుగా పెండింగ్‌లో పెట్టింది. ఆశా వర్కర్స్‌ వేతనాల ఊసేలేదు. మున్సిపల్‌ కార్మికులు సమ్మెకు సన్నద్ధం అవుతున్నారు.
రైతుల రుణమాఫీ హామీకి తూట్లు పొడిచింది. 82 వేల మంది రైతులు మాఫీకి అర్హులు కాగా ఆచరణలో నాల్గవ వంతుకు కుదించింది. రూ.60 వేల కోట్ల మొత్తం మాఫీ కావలసి ఉండగా కేవలం రూ.7 వేల కోట్లు మాత్రమే మాఫీ చేసింది. డ్వాక్రా మహిళల రుణాలు మొత్తం రద్దుచేస్తామని వాగ్దానం చేసింది. అధికారంలోకి వచ్చి దాన్ని రూ.10 వేలకు కుదించింది. తీరా ఆచరణలో మూడు వేలతో సరిపెట్టింది. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ రూల్స్‌ లొసుగులతో రూపొందించి అసలు లక్ష్యాన్నే దెబ్బతీసింది. ఎన్నికలకు ముందు భారీ వాగ్దానాలు చేసింది. తాను బాగా అనుభవమున్న వాడినని, హామీల అమలుకు వనరులు ఎలా వస్తాయో తెలుసునని, మడమ తిప్పేది లేదని ప్రగల్భాలు పలికారు. నేడు అందుకు భిన్నంగా బీద పలుకులు పలుకుతూ ప్రజలను మోసం చేస్తున్నారు.
ఉద్యోగ, కార్మికులపై దాడి
రాష్ట్రానికి పెట్టుబడులు రావాలంటే కార్మికులు, ఉద్యోగులు, ప్రజలు ఆందోళనలు చెయ్యకూడదట. వీధుల్లోకి రాకూడదట. ఏం చేసినా కుక్కినపేనులా పడుండాలట. వీధుల్లోకి వచ్చి ఆందోళనలు చేస్తే సహించేది లేదని హెచ్చరిస్తూ మహానాడులో తీర్మానాన్నే ఆమోదించింది. అంగన్‌వాడీ, ఐకెపి ఉద్యోగులు తమ సమస్యలపై ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా అతీగతీ లేదు. చివరకు చలో హైదరాబాద్‌ కార్యక్రమానికి పిలుపునిస్తే ఎక్కడికక్కడ ముందస్తు అరెస్టులు చేయించింది. ఎట్లాగో హైదరాబాద్‌ చేరుకుంటే నిర్దాక్షిణ్యంగా అరెస్టులు చేసి కేసులు బనాయించారు. నెల్లూరులో అంగన్‌వాడీ ఉద్యోగులు ముఖ్యమంత్రి సభలో ప్లకార్డులు ప్రదర్శిస్తే కక్షగట్టి 13 మందిని ఉద్యోగాల నుంచి తొలగించింది. రాజకీయ కక్షసాధింపులతో అంగన్‌వాడీ, మధ్యాహ్న భోజన, మున్సిపల్‌, విద్యుత్‌, తదితర రంగాలలో చిరుద్యోగులను తొలగించి తమ వారిని పెట్టుకునే చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నది. యజమానుల కొమ్ముకాస్తూ చట్టాలను సవరించి కార్మికులను బలిపశువులను చేసింది. బెల్టు షాపులు రద్దుచేస్తానన్న హామీ అటకెక్కించింది. పైగా ఎక్కడబడితే అక్కడ విచ్చలవిడిగా మద్యం విక్రయాలకు నూతన ఎక్పైజ్‌ పాలసీ తెచ్చింది. దీనిపై నిరసన వ్యక్తం చేసిన మహిళలపై పోలీసులు విరుచుకు పడ్డారు. రెగ్యులరైజేషన్‌ కోసం సమ్మెచేసిన విద్యుత్‌ ఉద్యోగులను సమ్మె విరమిస్తే తప్ప చర్చలకు పిలిచేది లేదని హెచ్చరించింది. తీరా సమ్మె విరమించి వెళితే చూస్తామని చెప్పి పంపింది. నాలుగు నెలలు అయినా ఇంతవరకు అతీగతీ లేదు. ఆ విధంగా ఉద్యోగులు, కార్మికులు, ప్రజలపై నిర్బంధాలతో యుద్ధం ప్రకటించింది.
బడ్జెట్‌ లోటు భర్తీ చేస్తానన్న కేంద్ర ప్రభుత్వం హామీని అమలు చేయలేదు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, రాయలసీమ, ఉత్తరాంధ్రలకు ప్రత్యేక ప్యాకేజీలు కేంద్రం ఇంతవరకు ప్రకటించలేదు. రాజధాని నిర్మాణం ఖర్చు భరిస్తుందని గ్యారంటీ లేదు. హుదూద్‌ తుఫాను తీవ్ర నష్టం సృష్టించింది. ఇలాంటి అంశాలలో కూడా రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీలతో కనీసంగా సంప్రదించలేదు. ఏకపక్షంగానే పాలన సాగిస్తున్నది. మరొకవైపు పెట్రోల్‌, డీజిల్‌పై 4 శాతం వ్యాట్‌ పెంచింది. భూముల రేట్లు, రిజిస్ట్రేషన్‌ ఛార్జీలు, ఇసుక మైనింగ్‌ రూపాలలో ప్రజలపై భారాలు పెంచింది. విద్య, వైద్యం కార్పొరేట్‌ శక్తుల కబంద హస్తాలలో బందీ అయింది. మధ్యతరగతి ప్రజలు కూడా భరించలేని విధంగా ఛార్జీలు వసూలు చేస్తున్నారు. ఇది ఒక ప్రధాన సమస్యగా ముందుకొచ్చిందని సమావేశం అభిప్రాయపడింది.
ప్రభుత్వ ఈ చర్యలన్నీ ప్రజలలో అసంతృప్తికి దారితీస్తు న్నాయి. క్రమంగా ఆందోళనలు పెరుగుతాయి. ఈ పరిస్థితులలో భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) ప్రజా సమస్యలపై కేంద్రీకరించి పనిచేయాలని సమావేశం నిర్ణయించింది. విద్య, వైద్యం, సామాజిక న్యాయం అంశాలపై ప్రత్యేకంగా అధ్యయనం చేసి ఈ అంశాలలో ప్రజల పక్షాన నిలబడి ఆందోళనలు చేయాలని నిర్ణయించి అందుకు ప్రత్యేక విభాగాలను ఏర్పరచింది.
అవినీతిని అంతమొందిస్తానని, ఎంతటివారైనా సరే క్షమించేది లేదని ప్రగల్భాలు పలికారు. తీరా ఓటుకు నోటు కేసులో స్వయంగా ముఖ్యమంత్రిగారే ఇరుకున్నారు. తెలంగాణ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయాడు. ఆడియో టేపుల్లో మాటలు తనవా, కాదా చెప్పకుండా ఫోన్‌ ట్యాపింగ్‌ చేశారని, సెక్షన్‌-8 అమలు చేయాలని రాద్ధాంతం చేస్తున్నారు. ఆ విధంగా అవినీతి గురించి మాట్లాడిన మాటలు నేతిబీరకాయలో నెయ్యి చందమని తెలుగుదేశం పార్టీ రుజువు చేసుకుంది.
- ఆర్‌ లక్ష్మయ్య