జిఓ20ని రద్దు చేయాలి: SFI

రాయలసీమ విద్యార్థులకు అన్యాయం చేసే విధంగా ఉన్న జిఒ నంబరు 120ని ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి నూర్‌మహమ్మద్‌ డిమాండ్‌ చేశారు. మంగళవారం ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో పాతబస్టాండ్‌లో సర్కిల్‌లో రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిరుపతిలోని పద్మావతి యూనివర్శిటీ వైద్యకళాశాలలో సీమ విద్యార్థులకు 80శాతం, ఇతరులకు 20శాతం సీట్లు ఉండాలని పేర్కొన్నారు. రాష్ట్ర విభజన అనంతరం ప్రభుత్వం కొత్తగా జిఒ నంబరు 120 తీసుకు వచ్చి లోకల్‌కు 20శాతం, నాన్‌లోకల్‌కు 80శాతం సీట్లు కేటాంచే విధంగా అవకాశం కల్పించారని విమర్శించారు. రాష్ట్ర విభజనలో కోర్టు యాదావిధిగా కొనసాగించాలని చెప్పినా ప్రభుత్వం ధిక్కరించిందని తెలిపారు. రాష్ట్రంలోనే అత్యంత కరువులో ఉన్న రాయలసీమ ప్రాంతం ఉందని చెప్పారు. కొంతమంది నాయకుల మాటలు విని ప్రభుత్వం రాయలసీమ విద్యార్థులకు అన్యాయం చేస్తుందని విమర్శించారు. రాజ్యాంగం ప్రకారం రాయలసీమకు కేటాయించాల్సిన వైద్య సీట్లు కేటాయించకుండా అన్యాయం చేస్తున్నారని పేర్కొన్నారు. స్వప్రయోజనాల కోసం విద్యార్థులను బలిచేస్తున్నారని విమర్శించారు. అన్యాయాన్ని ఎస్‌ఎఫ్‌ఐగా ప్రతిఘటిస్తామని హెచ్చరించారు. రాయలసీమకు విభజన చట్టంలో రావాల్సిన జాతీయ సంస్థలు, విద్యాలయాలు ఇంతవరకు రాలేదని తెలిపారు. కరువుకోరల్లో చిక్కుకుని కష్టనష్టాలకోర్చి చదువులు అభ్యసిస్తున్న విద్యార్థులకు ప్రభుత్వం ఏమిచేయడంలేదని చెప్పారు. వెంటనే జిఒ నంబరు 120ని రద్దు చేయకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.