జిఒ 97ను రద్దు చేయకుంటే పోరాటమే- సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు సిహెచ్‌ నర్సింగరావు

బాక్సైట్‌ తవ్వకాలకు అనుమతులు ఇస్తూ ప్రభుత్వం జారీ చేసిన జిఒ 97ను వెంటనే రద్దు చేయాలని, లేకపోతే పోరాటం తప్పదని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు సిహెచ్‌ నర్సింగరావు హెచ్చరించారు. ఆయన స్థానిక విలేకర్లతో శుక్రవారం మాట్లాడుతూ, సమతా తీర్పునకు వ్యతిరేకంగా ఎపిఎండిసికి గిరిజన భూములను అప్పగించే అధికారం ప్రభుత్వానికి ఎక్కడిదని ఆయన ప్రశ్నించారు. అటవీ హక్కుల చట్ట ప్రకారం ప్రభుత్వం గ్రామసభలు నిర్వహిం చాలన్నారు. వెంటనే జిఒను రద్దు చేయకపోతే నిరవధిక పోరాటం తప్పదని ఆయన హెచ్చరించారు. బళ్ళారిలో గాలి జనార్దనరెడ్డి గనులను లూటీ చేసినట్టుగా విశాఖ ఏజెన్సీలో బాక్సైట్‌ను పెట్టుబడి దారులకు కట్టబెట్టేందుకు ప్రభుత్వం కుట్ర పన్నిందని ఆయన విమర్శించారు. బాక్సైట్‌ తవ్వకాల ప్రభావం ఉత్తరాంధ్ర, తూర్పుగోదావరి జిల్లా ఏజెన్సీ ప్రాంతాలపై పడుతుందన్నారు. ఈ జిల్లాల్లో 19 నదుల నీరు కలుషితమవుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తవ్వకాలతో వచ్చే ధూళికి చెట్లన్నీ నాశన మవుతాయన్నారు. ప్రశాంతంగా ఉండే మన్యంలో మైనింగ్‌ మాఫియా రాజ్యమేలడం ఖాయమన్నారు. ఆయన వెంట సిపిఎం జిల్లా కార్యదర్శి లోకనాధం, నాయకులు ఎం.అప్పలరాజు, తదితరులు పాల్గొన్నారు.