జిఒ 97ను తక్షణమే రద్దు చేయాలి

విశాఖ మన్యంలోని బాక్సైట్‌ తవ్వకాలకు అనుమతి ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జిఒ 97ను తక్షణమే రద్దు చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి కె.లోకనాథం డిమాండ్‌ చేశారు.  చంద్రబాబునాయుడు బాక్సైట్‌ విషయంలో కపట నాటకం ఆడుతున్నారని విమర్శించారు. గత కాంగ్రెస్‌ ప్రభుత్వం జారీ చేసిన జిఒలను రద్దు చేసి తను జారీ చేసిన జిఒ 97ను మాత్రం రద్దు చేయడం లేదని తెలిపారు. ఏదైనా జిఒ జారీ అయితే ఐదేళ్ల పాటు మాత్రమే అమల్లో ఉంటుందని, ఆ తర్వాత ఆ జిఒ ఆటోమెటిక్‌గా రద్దవుతుందని చెప్పారు. ఈ విషయం చంద్రబాబుకు తెలియకపోవడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. ఆటోమెటిక్‌గా రద్దయ్యే జిఒలను రద్దు చేసినట్లు చంద్రబాబు చెబుతూ గిరిజనులను మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. గిరిజనుల మనోభావాలపై చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే తక్షణమే జిఒ 97ను రద్దు చేయాలని, గిరిజన సలహా మండలిని ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. గిరిజన ప్రాంతంలో అనేక సమస్యలున్నాయని, వాటిని చందబ్రాబు గాలికొదిలేశారని ఆవేదన వ్యక్తం చేశారు. మన్యంలో మంచినీటి సమస్య అధికంగా ఉందని, అధికారులు తక్షణమే వాటర్‌ ట్యాంకుల ద్వారా గిరి గ్రామాల్లో మంచినీరు సరఫరా చేయాలని విజ్ఞప్తి చేశారు.