జాబు కోసం బాబుతో పోరాటమే మార్గం..

వంద అబద్ధాలాడైనా ఒక పెళ్లి చేయాలనేది పాత సామెత.. వెయ్యి అబద్ధాలాడైనా అధికారంలోకి రావాలనేది కొత్త సామెత.. దీనికి నిదర్శనంగా చంద్రబాబు ప్రభుత్వం నిలుస్తోంది. ఎన్నికలకు ముందు టిడిపి మేనిఫెస్టోలలో ఇష్టమొచ్చినట్లు ప్రజలకు, యువతకు హామీలిచ్చేసి... నన్ను నమ్మండి...! నేను మారాను...!! అని అధికారంలోకొచ్చారు బాబు. దేశాభివృద్ధికి వెన్నెముకగా ఉన్న యువత భవిష్యత్‌ గురించి అస్సలు ఆలోచించడం లేదు. ''జాబు రావాలంటే - బాబు రావాలనే'' నినాదాన్ని తన పేటేంటుగా ప్రచారం చేసుకున్నారు. నిరుద్యోగులిప్పుడు జాబు అడుగుతుంటే... గుంటూరు జిల్లా సభలో సాక్షాత్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలోనే తన పార్టీ కార్యకర్తలతో.... నెత్తురొచ్చేటట్లు నిరుద్యోగులను కొట్టించారు. ఇదీ మన బాబు గారికి నిరుద్యోగ యువతపై ఉన్న ప్రేమ.
ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా యువత ఓట్లే కీలకమనీ, వారి ఓట్లు ఏ విధంగా కొల్లగొట్టాలో ఆ ప్రయత్నాలు చేస్తాయి తప్ప వాటి తీరు మాత్రం మార్చుకోవడం లేదు. తమ ప్రతిభకు తగ్గట్టు ఏదో ప్రయివేటు ఉద్యోగం చేసుకుందామన్నా... వచ్చే అరకొర జీతంతో కుటుంబాన్ని పోషించుకోవడం కష్టమవుతోంది. దీంతో ఉన్న తక్కువ ఉద్యోగాలైనా ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని లక్షల మంది కోచింగ్‌ సెంటర్లలో డబ్బులు ఖర్చు చేస్తూ గ్రంథాలయాలు, ఇళ్ళలో ఏళ్ల తరబడి పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు. కానీ ఏ ప్రభుత్వం వచ్చినా ప్రభుత్వ ఉద్యోగాలపై నిషేధాన్ని విధించి నిరుద్యోగుల్లో నిరాశనే మిగులుస్తున్నాయి. దళిత, గిరిజనుల అభివృద్ధే ధ్యేయంగా చెప్పే ఈ ప్రభుత్వాలు బ్యాక్‌లాగ్‌ పోస్టులను సైతం భర్తీ చేయకుండా నిరుద్యోగుల నోట్లో మట్టి కొడుతున్నాయి. రాష్ట్రంలో వివిధ విభాగాలలో మంజూరైన పోస్టులే 6,97,000 పైగా ఉన్నాయి. వీటిలో 1,42,825 పోస్టులు ఖాళీలున్నాయి. ఈ పోస్టులను ఎప్పుడు భర్తీ చేస్తారా..! అని నిరుద్యోగ యువత ఆశగా ఎదురు చూస్తోంది. 
2014 డిఎస్‌సి సమస్య..!
ప్రతి ఏటా డిఎస్‌సి నిర్వహిస్తానని ఎన్నికల్లో హామీ ఇచ్చిన చంద్రబాబు, గత ప్రభుత్వ హయాంలో కేటాయించిన 10,313 టీచరు పోస్టులకు నోటిఫికేషన్‌కే చాలా ఆలస్యం చేశారు. అదీ కూడా డివైఎఫ్‌ఐ వంటి యువజన సంఘాలు పోరాడితే నోటిఫికేషన్‌ ఇచ్చి పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో ప్రశ్నలను సైతం సరైన రీతిలో రూపొందించలేని వారికి అప్పగించి తప్పుల తడకల 'కీ'ని విడుదల చేసిన విద్యాశాఖ నిర్వాకంతో అభ్యర్థులే కోర్టులకు వెళ్లేటట్లు చేసింది. వాస్తవంగా డిఎస్‌సి అభ్యర్థులను 2015 జూన్‌ 14 నాటికి టీచర్లుగా నియామకాలు చేపడతామని చెప్పిన ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వలేదు సరి కదా విద్యా శాఖా మంత్రి గంటా శ్రీనివాసరావు అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడూ ఉద్యోగం అంటూ పూటకో మాట మాట్లాడుతూ వాయిదాలు వేస్తూ అభ్యర్థులను ప్రతి నెలా ఫూల్స్‌ చేస్తూ వచ్చారు. చివరికి ఉద్యోగాలివ్వండి అంటే కోర్టులో కేసులున్నాయనీ, అవి తేలాక ఉద్యోగాలిస్తామనీ చేతులు దులుపుకున్నారు. కోర్టులో కేసులకూ, ఉద్యోగ నియామకాల నిలుపుదలకూ సంబంధం లేదనే విషయాన్ని కావాలనే తొక్కిపెడుతోంది. ప్రభుత్వం చేసిన తప్పులకు అభ్యర్థులను బలి చేసింది. జీవో 38 ప్రకారం హైకోర్టు ఇచ్చిన తీర్పుననుసరించి అందరికీ ఉద్యోగాలివ్వొచ్చు. అయితే ఇప్పటికీ కనీసం మెరిట్‌ లిస్టు కూడా ప్రకటించలేదు. ఆర్థిక ఇబ్బందులు పడి, అప్పులు చేసి కష్టపడి చదువుకొని ఎక్కువ మార్కులు సంపాదించి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న అనేక కుటుంబాలతో ప్రభుత్వం ఆటలాడుకుంటోంది. నోటిఫికేషన్‌ వచ్చి సంవత్సరం దాటింది. ఫలితాలొచ్చి అర్థ సంవత్సరం గడిచింది. పోస్టులను భర్తీ చేయాలని డివైఎఫ్‌ఐ ఆధ్వర్యంలో డిఎస్‌సి ఉద్యోగ సాధన సమితిని ఏర్పాటు చేసి అభ్యర్థులంతా పోరాడుతున్నా ప్రభుత్వంలో చలనమే లేదు. ఇప్పటికే అభ్యర్థులు అనేక రూపాల్లో ఆందోళనలు చేస్తున్నారు.
ఇప్పుడు ఏ కోచింగ్‌ సెంటర్‌లో చూసినా వందల మంది అభ్యర్థులు శిక్షణ పొందుతున్నారు. గ్రంథాలయాలలో కూడా నిరుద్యోగులు పెద్ద ఎత్తున పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు. నోటిఫికేషన్‌ ఎప్పుడొస్తుందా అని ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ప్రకటించిన పంచాయతీ కార్యదర్శుల పోస్టుల నోటిఫికేషనేమైనా వస్తుందా అని ఎదురుచూసిన వారికీ నిరాశే మిగిలింది. ఈ పోస్టులను ఇతర శాఖలలో ఉన్న మిగులు సిబ్బందితో భర్తీ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారని తెలుసుకున్న నిరుద్యోగులు లబోదిబోమంటున్నారు. కానిస్టేబుల్‌ పోస్టులను భర్తీ చేస్తానని చెబుతున్న ప్రభుత్వం నోటిఫికేషన్‌ ఊసే ఎత్తడం లేదు. ప్రభుత్వం ఈ విధంగా నిరుద్యోగుల్లో ఆశలు రేకెత్తిస్తూ, ఉన్న పోస్టులను కూడా భర్తీ చేయడానికి ముందుకు రావడంలేదు. దీని వెనుక ప్రభుత్వ విధానం మరో విధంగా ఉండడమే అసలు కారణం. వివిధ శాఖలలో ఉన్న ఖాళీలను భర్తీ చేయకుండా ఉన్న సిబ్బందితోనో, కాంట్రాక్టు, అవుట్‌ సోర్సింగ్‌ విధానంతోనో కాలం గడపటమే ఈ ప్రభుత్వ విధానమని తెలిసింది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోస్టులకు నోటిఫికేషన్‌ ఇచ్చి భర్తీ చేయాలన్నా, ఇప్పటికే పరీక్షలు రాసిన డిఎస్‌సి అభ్యర్థులకు పోస్టులు రావాలన్నా, నిరుద్యోగులంతా రాష్ట్రవ్యాప్తంగా ఐక్యంగా కదిలి పోరాటం ఉధృతం చేయాల్సిందే. దీనిలో భాగంగా డిసెంబర్‌ 21న జరుగుతున్న చలో విజయవాడ కార్యక్రమంలో డిఎస్‌సి అభ్యర్థులు, నిరుద్యోగ యువత పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలి.
- వివి శ్రీనివాసరావు, డివైఎఫ్‌ఐ విశాఖ జిల్లా కార్యదర్శి