
తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి అసెంబ్లీలకు సోమవారం పోలింగ్ ముగియడంతో గత రెండు మాసాలుగా ఐదు రాష్ట్రాల్లో పలు దశల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల పోరు ముగిసింది. ఈ నెల 19న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఐదు రాష్ట్రాల్లో ఫలితాలు రావడానికి మరో మూడు రోజులు మిగిలివున్న నేపథ్యంలో సోమవారం పశ్చిమ బెంగాల్, అస్సాం, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి - ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై ఎగ్జిట్ ఫలితాలు వెలువడ్డాయి. కేరళలో ప్రభుత్వ వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని పాలక యుడిఎఫ్‌ను కూలదోసి సిపిఎం నేతృత్వంలోని ఎల్‌డిఎఫ్ విజేతగా ఆవిర్భవిస్తుందని సి ఓటర్ ఎగ్జిట్ పోల్స్ పేర్కొంటున్నాయి. అలాగే బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్‌కు 178 సీట్లు వస్తాయని, వామపక్షాలు, కాంగ్రెస్‌కు 110 సీట్లు వస్తాయని ఎబిపి ఆనంద ఎగ్జిట్ పోల్స్ పేర్కొన్నాయి. కాగా సి ఓటర్ ఎగ్జిట్ పోల్స్ మాత్రం తృణమూల్‌కు 167 సీట్లు వస్తాయని జోస్యం చెప్పింది. వామపక్షాలకు 75, కాంగ్రెస్‌కు 45, బిజెపికి నాలుగు, ఇతరులకు మూడు వస్తాయని అంచనా వేసింది.